మాస్కో : కొత్త సభ్యులను చేర్చుకోవడం ద్వారా బ్రిక్స్ గ్రూపు మరింత బలోపేతమవుతుందని రష్యా గురువారం పేర్కొంది. బ్రిక్స్‌ను విస్తరించాలా లేదా అనే విషయమై తన వైఖరిని స్పష్టంగా వెల్లడించింది. ప్రస్తుతం బ్రిక్స్ గ్రూపులో బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికాలు వున్నాయి. అమెరికా నేతృత్వంలోని పశ్చిమ దేశాలకు దీటుగా అంతర్జాతీయ వ్యవహారాల్లో ప్రభావితం చేయగల సామర్ధ్యం బ్రిక్స్‌కు వుందని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కొవ్ విలేకర్లతో అన్నారు. బ్రిక్స్‌లో సౌదీ అరేబియాను చేర్చుకోవడం చాలా కీలకమని బ్రెజిల్ అధ్యక్షుడు డసిల్వా చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. అలాగే అర్జెంటైనా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కోరుకుంటే వాటిని కూడా గ్రూపులో చేర్చుకోవాలని డసిల్వా సూచించారు. ఈ మూడు దేశాలతో రష్యాకు నిర్మాణాత్మక సంబంధాలున్నాయని పెస్కోవ్ చెప్పారు. అయితే, ఈ నెల 22-24 తేదీల్లో దక్షిణాఫ్రికాలో బ్రిక్స్ సదస్సులో ఈ అంశంపై చర్చించడానికి ముందుగా ''మనందరికంటే మేం ముందుండాలని కోరుకోం'' అని అన్నారు. అమెరికా ఆధిపత్యాన్ని దెబ్బతీసి, బహుళ ధృవ ప్రపంచాన్ని నిర్మించాలన్న రష్యా దార్శనికతలో భాగమే బ్రిక్స్‌ను బలోపేతం చేయడం. ఉక్రెయిన్‌లో తమ చర్యలను ఖండించకుండా సంయమనం పాటించే వర్ధమాన దేశాలతో సంబంధాలు పెంచుకోవడానికి రష్యా విలువనిస్తోంది. పశ్చిమ దేశాల ఆంక్షలతో దెబ్బతిన్న రష్యా ఆర్థిక వ్యవస్థ ప్రభావాన్ని భర్తీ చేసేందుకు ఆ దేశాలతో వాణిజ్యం నెరపాలని కూడా రష్యా భావిస్తోంది. దక్షిణాఫ్రికాలో జరిగే బ్రిక్స్ సదస్సుకు రష్యా విదేశాంగ మంత్రి సెర్గి లావ్‌రోవ్ హాజరు కానున్నారు.










