జోహెన్స్ బర్గ్ : బ్రిక్స్ కూటమిలో మరో ఆరు దేశాలు సభ్యులుగా చేరనున్నాయి. బ్రిక్స్ కూటమిలో మరో ఆరు దేశాల కొత్త సభ్యులను చేర్చుకోనున్నట్లు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమాఫోసా గురువారం ప్రకటించారు. '' మేము బ్రిక్స్‌లో పూర్తి సభ్యులు కావడానికి అర్జెంటీనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లను ఆహ్వానించాలని నిర్ణయించుకున్నాము. 2024 జనవరి నుండి ఆయా దేశాల సభ్యత్వం అమల్లోకి వస్తుంది '' అని రమాఫోసా జోహెన్స్ బర్గ్‌లో జరిగిన శిఖరాగ్ర సమావేశంలో పేర్కొన్నారు. బ్రిక్స్ 15వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా.. బ్రిక్స్‌ను విస్తరించాలన్న కీలక నిర్ణయం తీసుకున్నామని ప్రధాని మోడీ పేర్కొన్నారు. బ్రిక్స్ విస్తరణ సభ్య దేశాల సహకారానికి కొత్త ఉత్సాహాన్నిస్తుందని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తెలిపారు. ఈ విస్తరణ బ్రిక్స్ ఐక్యత మరియు సహకారం సంకల్పాన్ని ప్రతిబింబిస్తుందని అన్నారు. ప్రస్తుతం బ్రిక్స్ కూటమిలో బ్రెజిల్, రష్యా, చైనా, భారత్, దక్షిణాప్రికాలు సభ్యదేశాలుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.