Aug 24,2023 22:42

-అర్జెంటీనా, ఈజిప్టు, ఇథోపియా, ఇరాన్‌, సౌదీ అరేబియా, యుఎఇకు చోటు
- జోహన్నెస్‌బర్గ్‌ డిక్లరేషన్‌కు బ్రిక్స్‌ అధినేతల ఆమోదం
జోహన్నెస్‌బర్గ్‌ : విశ్వ యువనికపై బహుళ ధ్రువ కూటములు బలోపేతం అవుతున్నాయి. బ్రెజిల్‌, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా సభ్యదేశాలుగా ఉన్న బ్రిక్స్‌ కూటమి మరింత విస్తరించింది. కొత్తగా ఆరు దేశాలను తమ కూటమిలోకి చేర్చుకుంటూ బ్రిక్స్‌ అధినేతలు ఆమోదం తెలిపారు. అర్జెంటీనా, ఈజిప్టు, ఇథోపియా, ఇరాన్‌, సౌదీ అరేబియా, యుఎఇలు బ్రిక్స్‌ దేశాలతో జట్టుకట్టనున్నాయి. 2024 జనవరి నుంచి పూర్తి స్థాయి సభ్య దేశాలుగా చలామణి అవుతాయి. జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన 15వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు ముగింపు సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. కొత్త సభ్యుల చేరిక వల్ల కూటమికి బలం చేకూరుతుందని, బహుళ ధ్రువ ప్రపంచం ఆలోచనపై విశ్వాసం పెరుగుతుందని ఆయన అన్నారు. 'బ్రిక్స్‌ విస్తరణపై కూటమి ఏకాభిప్రాయంతో వ్యవహరించినందుకు ఆనందంగా ఉంది. బ్రిక్స్‌లో అర్జెంటీనా, ఈజిప్ట్‌, ఇరాన్‌, సౌదీ అరేబియా, ఇథియోపియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ చేరికకు అంగీకరిస్తున్నాము. ఈ దేశాల నాయకులకు, ప్రజలకు అభినందనలు' అని మోడీ పేర్కొన్నారు. బ్రిక్స్‌ ప్రస్తుత అధ్యక్షులు దక్షిణాఫ్రికా ప్రెసిడెంట్‌ సిరిల్‌ రమాఫోసా జోహన్నెస్‌బర్గ్‌ డిక్లరేషన్‌ను సమర్పించారు. 'ఐక్యరాజ్యసమితి చార్టర్‌లో పొందుపరచబడిన ప్రయోజనాలు, నిబంధనలతో సహా, సమగ్రమైన బహుళ పక్ష, అంతర్జాతీయ చట్టాలను సమర్థించడంలో నిబద్ధతను పునరుద్ఘాటిస్తున్నాము. ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో జరుగుతున్న ఘర్షణల గురించి ఆందోళన చెందుతున్నాము. చర్చలతో కూడిన సంప్రదింపుల ద్వారా విభేదాలు- వివాదాల శాంతియుత పరిష్కారానికి నిబద్ధతతో కట్టుబడివున్నాం' అని ఆయన అన్నారు.
బ్రిక్స్‌ కూటమిలో 2010లో దక్షిణాఫ్రికా చివరిగా చేరింది. మళ్లీ 13 సంవత్సరాల తర్వాత బ్రిక్స్‌ను విస్తరించాలనే నిర్ణయం తీసుకున్నారు.