Sep 19,2023 12:48
  •  అతనే నిజాయితీ నిరూపించుకోవాలి

ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి : టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు భద్రత ప్రభుత్వం, జైలు అధికార యంత్రాంగం చూసుకుంటాయని, నిజాయితీ నిరూపించుకోవాల్సిన బాధ్యత మాత్రం ఆయనదేనని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. పార్లమెంట్‌లో ఆమోదించిన 33 శాతం మహిళా రిజర్వేషన్‌ బిల్లును తాము స్వాగతిస్తున్నామని తెలిపారు. విజయనగరం పైడితల్లమ్మవారి ఉత్సవాల నిర్వహణపై కలెక్టరేట్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం విలేకర్లతో బొత్స మాట్లాడుతూ చంద్రబాబు భద్రత విషయంలో ఏ చిన్న పొరపాటు జరిగినా ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చన్నారు. తమ ప్రభుత్వం తప్పు చేసినట్లనిపిస్తే కేంద్రానికి మాత్రమే కాదు, ఐక్యరాజ్యసమితికైనా ఫిర్యాదు చేసుకోవచ్చని చెప్పారు. చంద్రబాబు అరెస్టు రాత్రికి రాత్రే జరగలేదని, ఆయనపై వచ్చిన ఆరోపణలపై అనేక సంస్థల దర్యాప్తు తరువాత అవినీతి జరిగినట్టు తేలడంతో అరెస్టు చేశారని తెలిపారు. సీమెన్‌ సంస్థ ఇస్తామన్న తొంబై శాతం మొత్తంలో ఎంత శాతం ఇచ్చిందో... ఆ నిధులను ఎక్కడ ఏ విధంగా ఖర్చుచేశారో అన్న విషయాలు చెప్పకుండా ఇతర విషయాలన్నీ చంద్రబాబు మాట్లాడుతున్నారని విమర్శించారు. గతంలో వోక్స్‌ వ్యాగన్‌ కేసులోనూ ఇలాగే జరిగిందని గుర్తుచేశారు. వోక్స్‌వ్యాగన్‌ కేసులో సిబిఐ దర్యాప్తు చేసి చివరికి డబ్బులు ఎక్కడికి వెళ్లాయో విచారించారని తెలిపారు. విచారణ తరువాత తమ ప్రమేయం లేదని తేలడంతో సంబంధిత సంస్థ నుంచి ప్రభుత్వం నిధులు మొత్తం రికవరీ చేసిందన్నారు. అందరికీ సమాన హక్కులే ఉంటాయని, ఆరోపణలు వచ్చినప్పుడు దబాయించకుండా చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సూచించారు. రాజ్యాంగంలోని చట్టాలకు లోబడే అన్నీ జరిపిస్తున్నామని, చంద్రబాబు స్కిల్‌ స్కామ్‌ కేసులోనూ అదే జరుగుతోందన్నారు. మహిళ రిజర్వేషన్‌ బిల్లును అన్ని రాజకీయ పార్టీలు స్వాగతిస్తున్నాయని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తమ ప్రభుత్వం యాభై శాతం మహిళా రిజర్వేషన్లు ఇప్పటికే అమలు చేస్తోందని గుర్తుచేశారు.