Sep 29,2023 21:08

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో అవినీతి జరగలేదని చెప్పే దమ్ము ప్రతిపక్ష నేత చంద్రబాబుకు, టిడిపి నేతలకు ఉందా? అని విద్యాశాఖా మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. విజయనగరంలోని ప్రయివేటు ఫంక్షన్‌ హాల్లో శుక్రవారం ఏర్పాటు చేసిన వైసిపి జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. అనేక కేసుల్లో స్టేలు తెచ్చుకుని చంద్రబాబు బతికారని, ఇప్పుడు అడ్డంగా దొరికిపోయారని చెప్పారు. ధర్నాలు చేస్తున్నారని వదిలేస్తే.. అందరూ అదే తోవలో వెళ్తారని వ్యాఖ్యానించారు. ప్రజల నుంచి సానుభూతి పొందాలని చంద్రబాబు చూస్తున్నారని, ఆయనేమైనా స్వాతంత్య్ర సమరయోధుడా? అని ప్రశ్నించారు. తప్పు చేయలేదనే ధైర్యం ఉన్నప్పుడు న్యాయస్థానాల ద్వారా నిరూపించుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రజలకు వారి బాగోతం తెలిసిపోతుందని అసెంబ్లీ సమావేశాలకు టిడిపి ఎమ్మెల్యేలు హాజరు కాలేదని ఆక్షేపించారు. ఒపిఎస్‌ అమలు చేస్తామని చెప్పినా, అన్నీ ఆలోచించాక చేయలేమని చెప్పామని, అందుకే జిపిఎస్‌ అమలు చేశామని తెలిపారు. అనంతరం వైసిపి ఉత్తరాంధ్ర కో-ఆర్డినేటర్‌ వైవి సుబ్బారెడ్డి, డిప్యూటీ సిఎం రాజన్నదొర మాట్లాడారు. వైసిపి జిల్లా అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.