Jul 17,2022 12:15

రిహద్దు బ్రహ్మపుత్రనది ఈశాన్య భారత్‌కి జీవగంగ. అనేకానేక ఉపనదులు కలుపుకుంటూ జన జీవనానికి జీవం పోస్తూ బంగాళాఖాతంలో కరిగిపోతుంది. అటువంటి ఉపనదుల్లో ఒకటి దార్ల నది. పశ్చిమ బెంగాల్‌లోని కుచ్‌ బీహార్‌ జిల్లా, జారీదార్ల గ్రామం నుండి బంగ్లాదేశ్‌లోకి ప్రవహిస్తుంటుంది. అదో సరిహద్దు గ్రామం. కంచెలేని సరిహద్దు గ్రామం. ఉన్నది వంద గడపలలోపే. దీంతో సరిహద్దు భద్రతాదళాల చెక్‌పోస్ట్‌ గ్రామం మొదటిలోనే ఉంటుంది. గ్రామస్తులైనా సరే వారి అనుమతితోనే గ్రామంలోకి వెళ్లాలి. గ్రామంలో ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రం తప్ప మరే ఇతర సౌకర్యాలూ లేవు. ఉన్న ఒక్క ప్రాథమిక పాఠశాలలోనూ అన్ని తరగతులకూ కలిపి ఉన్నది ఒకే ఒక్క ఉపాధ్యాయుడు. అతనూ ప్రతిరోజూ రారు. గ్రామస్తులు ఉప్పు, పప్పు కొనుక్కోవాలన్నా ఊరికి దక్షిణాన ఉన్న బంగ్లాదేశ్‌ వెళ్లాల్సిందే.
      దార్ల అందాలు ఎవరినైనా ముగ్ధుల్ని చేస్తాయి. నీరు ఎంత స్వచ్ఛంగా ఉంటుందో నదిలో కనిపించే ప్రతిబింబమే చెబుతుంది. దార్లకి గమనం మీదే ధ్యాసగానీ పేరేమిటన్న ఆలోచన లేదు. నీటిని పంచే తాపత్రయమే కానీ తాగేదెవరనే ఆరా లేదు. వెన్నెలైనా వేడయినా పరుగును ఆపే ప్రయత్నమే లేదు. దార్లను చూడగానే ఠాగూర్‌ 'కోపాల్‌' గురించి చెప్పిన పద్య పంక్తులు గుర్తుకొస్తాయి.
   'నీ మేని ఒంపుసొంపులు వెలుగునీడల్లో వయ్యారంగా కదులుతూ ఉంటాయి. కుంభవృష్టి కురవగానే భంగు తాగిన కన్నెపిల్లలా గంతులేస్తుంటావు. కానీ ఏనాడూ గట్టునున్న గ్రామాలను శోక సంద్రంలో ముంచలేదు. కేవలం కుచ్చెళ్ల విదిలింపులు, పయ్యెదల ఊగిసలతోనే గ్రామాలను ఆటపట్టిస్తావు. నీ నవ్వులతో ఒడ్డును కోతపెట్టేస్తావు.'
    పట్టణీకరణకు బహుదూరం అయినందువల్ల కాలుష్యం దరి చేరలేదు. నదిలోతు తక్కువ. మామూలు వాతావరణ పరిస్థితుల్లో నదిలో అటునుండి ఇటు నడుస్తూ దాటేయడానికి దారిని చేస్తుంది దార్ల. ఒడ్డున కూర్చుని నదిలో కాళ్లు పెడితే.. బుజ్జి చేపపిల్లలు కాళ్లకి పెట్టే కితకితలతో మైమరచిపోతాం. కాల గమనమే తెలియదు. గ్రామంలోని పిల్లలందరూ ఈత కొడుతూ ఆటలాడుతుంటారు ఇక్కడ. ఈత పోటీలు, ఇసుకతిన్నెలపై పరుగు పందాలు. ఒడ్డునున్న సన్నని ఇసుకతిన్నెలు వేలాది ఎండ్రకాయలకు ఆవాసం. గ్రామంలో దాదాపు వయసులో ఉన్న మగవాళ్లంతా పొలం పనులు లేకపోతే వలలు వేసి, చేపలు పడుతుంటారు. ముసలివాళ్లు చిరిగిన వలలను కుట్టడంలాంటి పనుల్లో ఎప్పుడూ తీరిక లేకుండా ఉంటారు.
    జారీదార్ల గ్రామానికి వ్యాపార బంధాలన్నీ పక్కనే ఉన్న బంగ్లాదేశ్‌తోనే.. అక్కడి లాల్మొనిర్‌ హాట్‌ గ్రామంతోనే. కారణం భౌగోళికమే. గ్రామం ఉంది భారతదేశంలోనే అయినా, జిల్లా ప్రధాన పట్టణం 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. మధ్యలో దార్ల దాటాలి, సరిహద్దు భారత సైనిక కార్యాలయాన్ని దాటాలి. అదే బంగ్లాదేశ్‌కి వెళ్లడానికి గ్రామానికి చివర రెండుదేశాలకూ మధ్యనున్న సరిహద్దు గట్టు దాటితే చాలు.
    గ్రామంలో వ్యవసాయమే వృత్తి. పట్టిన చేపలు, పెంచిన పశువుల అమ్మకమే వ్యాపారం. ఇక్కడందరికీ కుంటో, ఎకరమో పొలం ఉంది. నీరు పుష్కలంగా ఉంది. వరదలు ముంచెత్తకుండా దార్ల నది చల్లగా కాపాడితే, తిండికి లోటు లేదు. భారతదేశంలోని తమ గ్రామ జిల్లా ముఖ్యపట్టణానికి చేరాలంటే మాత్రం బిఎస్‌ఎఫ్‌ రక్షక వలయం నుండి అనుమతి పొందాలి. ఆ తరువాత నది దాటాలి. ఈ నాటికీ నది మీద ఓ బ్రిడ్జి లేదు. తాతలనాడు ఉన్న బ్రిడ్జి కూలిపోయి, నదిలో పడిన స్తంభాలు ఒకనాటి బ్రిడ్జి జ్ఞాపకాలు. మళ్లీ బ్రిడ్జి కట్టింది లేదు. కూలిన ఆనవాళ్లని బట్టి బ్రిడ్జి ఉండేదని అనుకోవడమే. విమానాలు కాదుకదా.. రైలు బండి చూసిన గ్రామస్తులు అరుదు. పట్టణం అంటే వారికీ బంగ్లాదేశ్‌లోని లాల్మొనిర్హాట్‌ పట్టణమే. గ్రామస్తులు పిల్లలను బడికి పంపించేది అక్కడికే. రెండు దేశాల మధ్య సరిహద్దు గోడలో, కంచెలో హద్దులుగా లేవు. బంగ్లాదేశ్‌ వైపు ఉన్న జవాన్లు భారత్‌ నుండి వచ్చిపోయే వారిని చూసీచూడనట్టు వదిలేస్తుంటారు. పైగా అక్కడివారు కూలికి కూడా జారీదార్ల గ్రామానికి వస్తుంటారు. బంగ్లాదేశ్‌లో కన్నా ఇక్కడే పదో పరకో కూలీ ఎక్కువ దొరుకుతుంది.
    అదిగో, ఆ జారీదార్ల గ్రామంలో ఉన్న ఆ వంద కుటుంబాల్లో ఒకటి దేవ్‌ కుటుంబం. దేవ్‌ పాతికేళ్ల యవ్వనుడు. కాయకష్టం చేస్తుండడంతో కృష్ణ ఛాయే. కండలు తిరిగి ఉండకపోయినా దృఢమైన దేహం. పెద్దగా పొడగరి అనలేం, కానీ ఆకర్షణీయంగా ఉంటాడు. పఠన జ్ఞానం కన్నా లోకజ్ఞానం ఎక్కువ. అది ఆ కళ్ల మెరుపులో కనిపిస్తుంది. లోలిత అంటే ఇష్టం నడకలో కనిపిస్తుంది.
     'చందమామ వెలుగులతో నాకేంపని, నీ నీలి ముంగురులు జలతారు తెరలే చాలు నాకు. దార్ల అలల సోయగాలతో నాకేం పని, లోలిత మేని సొంపు సోయగాలు చాలు నాకు' అంటూ లోలితను కవితలతో ముంచెత్తాడు దేవ్‌. దేవ్‌ ఉంగరాల జుట్టు భార్య లోలితకి మత్తెక్కిస్తుంది. లోలితది చామనఛాయ. కళ్లు దార్ల నదిలో చేపల్లా చురుకుగా, ఉదారంగా ఉంటాయి. ఇల్లు, గ్రామం తప్ప మరేదీ చూడకపోవడం, తెలియకపోవడం వల్ల అసంతృప్తి ఇంకా ఆమె దరి చేరలేదు.
దేవ్‌, ఆమె అంతే. ఇద్దరూ నది ఒడ్డున ఒక సాయంకాలం వేళ కలిశారు. మోహనరాగం పలికింది. నదీతీరంలో సరాగాల పల్లకి కాలక్షేపం పెళ్లికి దారితీసింది.
    దేవ్‌ ముసలితల్లికి కోడలంటే అమితమైన ప్రేమ. వీధి చావడిలో కుక్కి నులక మంచంలో కూచుని, 'ఓహో! నీకు మాత్రమే ఓ కోడలుంది!' అని ఇరుగుపొరుగు ఎగతాళి చేసినా లడ్డు తల్లి చేసిన వంటకాల రుచి, ఇల్లు నడిపే చాకచక్యం చెప్పడం ఆపదు.
ఏడేళ్ల కొడుకు లడ్డు. దేవ్‌ లోలితల ప్రేమకు ప్రతిరూపం. అమ్మ పాలతో బొద్దుగా పెరిగి, లడ్డు అయ్యాడు. ఆ పేరే ఖరారయ్యింది బడిలో కూడా. వాడు చదివేది లాల్మొనిర్హాట్‌లోనే. కంచె దాటి రోజూ బడికి వెళ్లొస్తాడు. లేదా బిఎస్‌ఎఫ్‌ కాంప్‌ దాటి, దార్ల నది దాటి భారత్‌లో దగ్గరగా ఉన్న పట్టణం, గిటాల్డాహకి వెళ్లాలి. గ్రామానికి బస్‌లాంటివేం రావు. ఇక ఆటో వంటి వాటిని గురించి ఊహించలేం. ప్రయాణానికి ఏవిధమైన సౌకర్యాలూ లేవు. రోజూ అంతదూరం ప్రయాణం కన్నా దగ్గరున్న బంగ్లాదేశ్‌లోని లాల్మొనిర్‌ హాట్‌ బడికి పంపడం మేలని గ్రామస్తులందరూ పిల్లల్ని అక్కడికే పంపుతారు. అందరిలాగే లడ్డు కూడా వారు నేర్చుకునేది 'అమర్‌ సోనార్‌ బంగ్లా..' బంగ్లాదేశ్‌ జాతీయగీతం. ఆ సంగతి పిల్లలు, తల్లిదండ్రులు కూడా పట్టించుకోరు. లడ్డు దానిని ఎంతో శ్రావ్యంగా పాడతాడు. గ్రామ ప్రజలందరూ అక్కడే వైద్య సేవలు కూడా వినియోగించుకుంటారు.
'నేను ఈ రోజు గిటాల్డాహాలో వెళ్లాలి. జిల్లా ఆఫీస్‌లో మన ఆధార్‌ కార్డుల పని చూడాలి' దేవ్‌.
'అదేంటి, ఇప్పుడో, కాసేపటికో ఆస్పత్రికి వెళ్లాల్సి వస్తే ఎలా? ఆధార్‌ కార్డుకి తొందరేంటి? లాల్మొనిర్‌ హాట్‌లో డాక్టర్‌ దగ్గరికి వెళ్లాల్సి రావచ్చు. ఎవరు చెప్పగలరు. నిండు చూలాలిని ఎలా వదిలి వెళ్తావు?' లోలిత కోపంగా, మారాం చేసింది.
'అవునురా! అదేంపని ఈ సమయంలో అంతదూరం వెళితే ఇబ్బంది అవుతుంది. పైగా ఈ రోజు వాన పడేటట్టు కూడా ఉంది' తల్లి కల్పించుకుని వారించబోయింది.
'తప్పదురా. నాకుమాత్రం వెళ్లాలని ఉందా? లేదు.' గారంగా అలిగిన లోలిత తల ప్రేమగా నిమిరాడు దేవ్‌. 'ఈ వారంలో మన ఇళ్లకి పౌర గణాంకాల సేకరణ అధికారులు వస్తారు. కార్డులు సరిగ్గా లేకపోతే మరిన్ని సమస్యలొస్తాయి. అసలే పరిస్థితులు బాగోలేవు. మన కార్డులో ఉన్న తప్పుల్ని సరిచేయించుకోవాలి. నేను ఇబ్రహీంకి చెప్తాను. వాడి భార్య, చెల్లి కూడా ఉన్నారుగా, నీకు తోడుంటారు. వాడు నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటాడులే. నిన్న వెళ్లి ఇబ్రహీం సవరణలు అన్నీ పూర్తిచేయించుకున్నాడు. వాడికే పాతికేళ్లుంటే, వాడి తల్లి వయసు 36 ఏళ్లని ఉందట. చెల్లి పేరు షమ్మీకి బదులుగా షామి అని, ఇలా అన్ని సరిచేయించుకునేసరికి సాయంత్రమైందని చెప్పాడు.'
'సరే వెళ్లు. అవసరానికి అందుబాటులో ఎప్పుడున్నావు గనక! ఇంట్లో అవసరమైనప్పుడే నీకు బయటి పనులుంటాయి. నేను ఇంకోరి మీదే ఆధారపడాలి' దెప్పిపొడుస్తూ విసుక్కుంది లోలిత.
'మరీ అన్యాయం రా, ఇబ్రహీం ఏమన్నా పరాయివాడా?' అన్నాడు దేవ్‌.
'పైగా ఆ నవ్వొకటి!' లోలిత.
సున్నితంగా వారిస్తూ, కనుసైగతో సమ్మోహనాస్త్రం వేశాడు దేవ్‌. చెప్పులు తొడుక్కుని బయలుదేరాడు.
'అమ్మా! నేను బడికి పోతున్నా' లడ్డుగాడి కేకకి లోలిత నవ్వుకుని, చేస్తున్న పిడకల పనిలో మళ్లీ నిమగమైంది.
కాస్త అలసటగా అనిపించినా పిడకల పని ముగించింది. అత్తకు అన్నం పెట్టి, తనూ తినడానికి కూర్చుంది. మెతుకు దిగలేదు. చేసిన చేపల పులుసు సయించలేదు. కాస్త నీరసంగా ఉందనుకుని నిద్రకుపక్రమించింది. నులకమంచం, పురిటి తరువాత సౌకర్యంగా పిల్లవాడికి తనకు సరిపోవాలి అని మొన్ననే గట్టిగా బిగించింది. దానిమీద దుప్పటి సరిచేసుకుని, నడుము వాల్చింది.
లడ్డు గాడి పురిటి సమయంలోనూ దేవ్‌ పక్కన లేడు. ఆ రోజు ఎడతెరిపి లేని వాన. దార్ల ఉగ్రంగా ఊగిపోతూ ఉంది. ఎద్దుల రంకెలను మించిన హోరుతో కట్టలు తెగుతాయేమో అన్నంత ఉధృతంగా ప్రవాహిస్తూ ఉండింది. డిటాల్డాహలో మంచి బేరం కుదిరిందని ఆ రోజే దేవ్‌ ఆవులను తీసుకెళ్లాడు. పురిటికి డబ్బుల అవసరం ఉంటుందని, మంచి బేరమని వెళ్లక తప్పదన్నాడు. పొద్దున్నే ఆవులను తోలుకెళ్లి, మధ్యాహ్నం కల్లా వచ్చేస్తానని చెప్పాడు.
వెళ్లిన కాసేపటికి ఆకాశంలో మబ్బలు కమ్మడం మొదలైంది. ఆ తరువాత సన్నని చినుకులు. చినుకు వానగా మారడం, వాన ఉధృతం అవడానికి పెద్ద సమయం పట్టలేదు. ముందే ఊహించి ఉంటే దేవ్‌ని వెళ్లనిచ్చేది కాదు. నొప్పులు నెమ్మదిగా పెరిగాయి. సాయంత్రం అవుతున్నా దేవ్‌ జాడలేదు. గుండె వేగంగా కొట్టుకుంటుంది. దేవ్‌ కూడా వాన వల్ల ఎక్కడో ఆగిపోయి ఉండవచ్చు. ఒకవైపు నొప్పులు.. మరోవైపు సాయంత్రం దాటుతోంది. ఇంకాసేపట్లో చీకటి పడుతుందనగా ఇక లేవలేకపోయింది. మంత్రసాని కోసం పక్కింటి అజరుతో కబురు చేసింది. పాపం మంత్రసాని వచ్చి, బిడ్డ అడ్డం తిరిగిందని.. తన వల్ల పురుడు పోయడం కాదని చేతులెత్తేసింది. అప్పుడే ఆ వానలోనే అజరు, ఇబ్రహీంని పిలుచుకొచ్చాడు. పరిస్థితిని చూసిన ఇబ్రహీం గబగబా చెక్క కుర్చీ కాళ్లకు రెండు గట్టి వెదుళ్లను కట్టి రహీమ్‌ని, రంజన్‌ని కూడా కేకేశాడు. నలుగురూ కలిసి లాల్మొనిర్‌ హాట్‌ చేర్చారు. కంచె పక్కనున్న బంగ్లాదేశ్‌ భద్రతా దళాలు చీకటి పడుతుందని అభ్యంతరం చెప్పారు. కానీ లోలిత దాదాపు స్పృహ కోల్పోతుండడం చూసి వెళ్లేందుకు అనుమతించారు. డాక్టర్‌ చూసి వెంటనే ఆపరేషన్‌ చేసి, లడ్డుగాడిని బయటికి తీశారు. లేకుంటేనా.. కళ్ల ముందు ఆనాటి జ్ఞాపకాలు మళ్లీ కదిలాయి లోలితకి.
'ఊహూ.. నిద్ర పట్టడం లేదు. నొప్పులు మొదలయినట్టు ఉన్నాయి.' లోలిత.
'లడ్డు బడి నుండి వచ్చాడు. దేవ్‌ కూడా వచ్చేస్తే బాగుండును' మనసులో మాటలు బయటకు వచ్చాయి.
'లడ్డూ ! కుండలో ఉన్న అన్నం కంచంలో పెట్టుకొని, తిను నాన్నా! చేప పులుసు వేసుకో! తిన్న తరువాత ఇబ్రహీం మామని అమ్మ పిలుస్తోందని చెప్పి పిలుచుకు రా!'.
'వదినా! ఎలా ఉన్నారు?!' పలకరించాడు ఇబ్రహీం వస్తూనే.
'లడ్డుగాడి పుట్టినప్పటి సంగతులు గుర్తుకొస్తున్నాయి. అబ్బబ్బా ఆ కుంభ వృష్టేమిటిరా బాబు? అయినా సమయానికి హాస్పిటల్‌కి చేరగలిగాము.'
'అవును, ఇబ్రహీం. నాకూ అదే గుర్తుకొచ్చింది. ఈ రోజూ మీ అన్నయ్య లేడు. వాన లేదనుకో!'
'అప్పటికన్నా ఇప్పుడు కొంత మెరుగు వదినా! నా దగ్గర బైక్‌ ఉంది. మీరు బైక్‌ మీద కూర్చుంటే కంచె వరకూ తీసుకెళ్లిపోతాను. కంచె అవతలికి ఇప్పుడు లాల్మొనిర్‌హాట్‌ వాళ్ల ఆటోవాళ్లు వస్తారు. మీరు చెకప్‌కి వెళ్లినప్పుడూ ఉండేవారు కదా?'
'అవును. ఈ ఏడేళ్లలో అటువైపు ఆ మాత్రం సౌకర్యం పెరిగింది. అత్తకి సాయంగా షమ్మీని పంపిస్తావా?'
'సరే వదినా! నేను ఇప్పుడే షమ్మిని తీసుకొస్తాను. మీరు రెడీ అవ్వండి' నేను అన్నయ్యకి వచ్చిన వెంటనే లాల్మొనిర్‌హాట్‌ హాస్పిటల్‌కి రమ్మని, అక్కడికి వెళ్లిన వెంటనే ఫోన్‌ చేసి చెప్తాను. అక్కడైతే సిగల్‌ దొరుకుతుంది.'

                                                                              ***

'అదేంటి దేవ్‌! ఇబ్రహీం మనకోసం కదా లాల్మొనిర్‌ హాట్‌ వచ్చింది. అక్కడ హాస్పిటల్లో మనతోనే ఉన్నాడు కదా!' లోలిత.
'అవును. నాకు అదే ఆశ్చర్యంగా ఉంది. ఇబ్రహీంని ఎందుకు పోలీసులు తీసుకెళ్లారు? నిన్ను హాస్పిటల్లో చేర్చిన వెంటనే నాకు ఫోన్‌ చేశాడు. నేను వచ్చేవరకూ హాస్పిటల్‌ ముందు వరండాలోనే నా కోసం ఎదురుచూశాడు. నేను వచ్చేసరికి ఏడయ్యింది. నిన్ను, బాబును తీసుకొచ్చి, గదిలో పడుకోబెట్టిన తరువాత నేను, ఇబ్రహీం కలిసి పక్కనే ఉన్న అవ్వదగ్గర అన్నం తిన్నాం. తెల్లవారు ఝామున ఇంటికెళ్లాడు. వెళ్లగానే పోలీసులు పట్టుకున్నారట. షమ్మీ ఇందాకే నేను ఇంటికెళ్లినప్పుడు చెప్పింది. పాపం అంతా చాలా కంగారుగా ఉన్నారు. పోలీసులు వాళ్లని కలవనివ్వడం లేదట. నిన్న మధ్యాన్నం నుంచి వాడు మనతోనే ఉన్నాడు మరి. కానీ..నేను పోలీసులతో..'
'పోలీసులు ఏమన్నారు?'
'డిటాల్డాహ మార్కెట్‌లో బాంబులు పేలాయట! కారణం లాల్మొనిర్‌ హాట్‌లో ఉన్న ఉగ్రవాద సంస్థని వాళ్లకి అనుమానం. నిన్న వాడు లాల్మొనిర్‌ హాట్‌ వెళ్లడం వల్ల వాళ్లకి అనుమానం అంటున్నారు. నాతోనే ఉన్నాడని నేనెంత చెప్పినా వినలేదు. మనతోనే ఉన్నట్టు రుజువు చేస్తేనేగానీ లాభం లేదు. సమస్య ఎలా వచ్చిందంటే, నేను పొద్దున్నే గిటాల్డాహ వెళ్లి అక్కడ హాస్పిటల్‌లో బుజ్జిగాడు పుట్టినట్టు నమోదు చేయించాను. మరి మనకు భారతదేశంలో పుట్టినట్టు నమోదు కావాలి కదా!'
'అదే కొంపముంచింది. అందుకనే మనం గిటాల్డాహలో ఉన్నట్టు, వాడొక్కడే రెండవ పేజీ తరువాయి
లాల్మొనిర్‌ హాట్‌ వెళ్లినట్టు కాగితాలపై ఉంది. బాంబు పేలుళ్లలో దొరికిన ఒక సంచి లాల్మొనిర్‌ హాట్‌లో కొన్నదట. వీడు సరిహద్దు దగ్గర ఉన్నట్లు వాళ్లకి ఆధారాలు దొరికాయి. మనం కూడా లాల్మొనిర్‌ హాట్లోని హాస్పిటల్‌లో ఉన్నామని, వాడు మనతోనే ఉన్నాడని అంటే, పుట్టుక నమోదు ఇక్కడ, భారతదేశంలో జరగదు.'
'అరె, భగవంతుడా ఇప్పుడేం చేయాలి? సహాయం చేసిన ఒక అమాయక మిత్రుడిని ఎలా కాపాడాలి?' లోలిత తల బద్దలవుతుంది.
కొత్తగా లోకంలోకి వచ్చిన చిన్నారి అశిష్‌ని మనస్ఫూర్తిగా ముద్దాడ లేకపోతోంది.
ఏంచేయాలి ?! ఏంచేయాలి ?!
'బాంబ్‌ ఎన్ని గంటలకు పేలిందట' లోలిత.
'మధ్యాహ్నం మూడు గంటలకు' దేవ్‌.
'హమ్మయ్య! మేము నాలుగు గంటలకు బయలుదేరాం. మూడు గంటలకు ఇబ్రహీం మన ఇంట్లోనే ఉన్నాడు. ఇబ్రహీం అక్కడ సరిహద్దు దిమ్మ పక్కన వాలిన నెమలితో కలిసి, నా సెల్‌ కెమెరాతో సెల్ఫీ తీసుకున్నాడు. ఆ ఫొటోని పోలీసులకు చూపించు. అప్పటికి గ్రామంలోనే ఉన్నట్టు కదా! ఇక్కడికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న డిటాల్డాహ, మార్కెట్‌ నుంచి ఎగిరి రాలేడుగా?'
'దేవ్‌ ఒక్కసారి ఊపిరి పీల్చుకున్నాడు. అది సెల్ఫీ. అందులో ఇబ్రహీంతో పాటుగా కొంత దూరంలో స్థంభం, పక్కన నెమలి ఉన్నాయి.'
లోలిత బుజ్జిగాడిని మనస్ఫూర్తిగా ముద్దాడింది.
దేవ్‌ సెల్‌ తీసుకుని, 'ఈ ఒక్క ఆధారమైనా ఉంది. ఇబ్రహీంని ఎలాగైనా బయటికి తీసుకురాగలను' అనుకుంటూ.. పరుగులాంటి నడకతో బిఎస్‌ఎఫ్‌ ఆఫీస్‌ వైపు బయలుదేరాడు.

                                                                                ***

'దీపూ! కథ ఇంట్రెస్టింగ్‌గా లేదా? ఈశాన్య భారతదేశ సరిహద్దు గ్రామాల్లో పౌరసత్వ నమోదులకు వ్యతిరేకతను గురించి మా మ్యాగజైన్‌లో కథనం రాయడానికి నేను జరిదార్లను ఎంచుకున్నాను. సర్పంచ్‌ కూతురే లోలిత. సర్పంచ్‌ నన్ను వాళ్లింటికి తీసుకెళ్లారు. వాళ్లింట్లోనే రెండురోజులు ఉన్నాను. ఇది లోలిత అనుభవం. ఆమే స్వయంగా చెప్పింది. ఇంకో విషయం నీకు ఆశ్చర్యం కలిగిస్తుంది. లడ్డు గాడు 'మా జాతీయగీతం, ''అమర్‌ సోనార్‌ బంగ్లా'' ఠాగూర్‌ రాశారని మా టీచర్‌ చెప్పారు. మరి మీ జాతీయగీతం ఎవరు రాశారు?' అని అడిగాడు.
''ప్రపంచంలోని ప్రతిదేశంలోని స్త్రీ-పురుషులు ఇతరులకు సేవ చేసేందుకు, అన్యాయాన్ని ఎదిరించేందుకు, సమానత్వం సాధించేందుకు అవసరమైన గౌరవాన్ని, అవకాశాలను కలిగి ఉండాలని నేను కోరుకుంటున్నాన''ని కోఫీ అన్నన్‌ అనడం గుర్తుకు రావడం లేదూ?
హద్దులు మనం కల్పించుకున్నవి కదా! మనిషికి కావలసింది జీవనం. దానిని వెతుక్కుంటూ పోతుంటాడు. దానిని అడ్డుకోడానికే కదా ఈ కృత్రిమమైన హద్దులు! సరిహద్దులు!! లడ్డుకి ఈ హద్దులు తెలియవు. ఇంకా వాడు విశ్వమానవుడిగానే ఉన్నాడు. హద్దులతోపాటు వచ్చేవి భయాలు, ఆందోళనలు, తెరలు తెరలుగా మన భూమిని వెదుక్కుంటూ వచ్చి, వందల ఏళ్లుగా ఇక్కడుంటున్న ఇన్ని జాతులది మన దేశం.. తమదేశం ఎలా కాకుండా పోతుంది? చట్టాలు పౌరుల జీవనాన్ని మెరుగుపర్చేదిగా ఉండాలేగానీ జీవితాలను ఛిద్రం చేయడానికి కాదు! తాతలకాలం నుండి ఇక్కడే ఉన్నవారు ఈ దేశస్తులు కాకపోతే ఏ దేశస్తులవుతారు? మన పౌరులు కాకుండా ఎలా పోతారు?

ఉషారాణి
9492879210