
గుజరాత్ అల్లర్లపై బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (బిబిసి) రూపొందించిన డాక్యుమెంటరీని కేంద్ర ప్రభుత్వం సోషల్ మీడియాలో నిషేధించడం పారదర్శకతకు పాతర వేయడమే. ఈ మేరకు యు ట్యూబ్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా సంస్థలకు సమాచార సాంకేతిక చట్టంలోని ఎమర్జెన్సీ అధికారాలను ఉపయోగించి కేంద్రం ఆదేశాలను జారీ చేసింది. ఈ చర్య ద్వారా దాదాపు 20 ఏళ్ల క్రితం ఒక మతానికి చెందిన ప్రజలను లక్ష్యంగా చేసుకుని గుజరాత్‌లో జరిగిన ఊచకోతకు సంబంధించిన నిజాలను దేశ ప్రజలు చూడకుండా అడ్డుకోవడం బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ లక్ష్యం! ఈ దారుణం వెనుక నాటి గుజరాత్ ముఖ్యమంత్రి, ప్రస్తుత భారత ప్రధాని నరేంద్రమోడీ హస్తం ఉందని ఆ డాక్యుమెంటరీలో పేర్కొనడమే ఈ నిషేధానికి కారణం. అన్ని ఆధారాలతోనే ఆ కథనాన్ని రూపొందించామని చెబుతున్న బిబిసి బుధవారం రెండవ ఎపిసోడ్‌ను కూడా విడుదల చేసింది. ఆ విషయం అలా ఉంచితే సత్యాన్ని ఎల్లకాలం గుప్పిట్లో దాచిఉంచలేరన్న సంగతి తెలిసిందే. బిబిసి ఎపిసోడ్ విషయంలోనూ అదే జరుగుతోంది. వివిధ ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా బిబిసి రూపొందించిన ఎపిసోడ్‌ను చూస్తున్న విద్యార్థులు, యువజనులపై కేంద్ర ప్రభుత్వం, బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ దాని అనుబంధ సంస్థలు దాడులకు దిగుతుండటం దుర్మార్గం.
ఢిల్లీలోని ప్రతిష్టాత్యక విశ్వవిద్యాలయం జెఎన్‌యులో బిబిసి డాక్యుమెంట్‌ను తెరపై ప్రదర్శించి, సామూహికంగా చూడటానికి విద్యార్థులు చేసిన ప్రయత్నాన్ని విద్యుత్ సరఫరాను నిలిపివేయడం ద్వారా యూనివర్శిటీ పాలకవర్గం అడ్డుకుంది. మొబైల్‌ఫోన్లలోనూ, లాప్‌టాప్‌లలోనూ చూస్తున్న విద్యార్థులపై ఎబివిపి మూకలు రాళ్ల దాడికి దిగాయి. దీంతో అర్ధరాత్రిపూటే విద్యార్థులు నిరసన ప్రదర్శన నిర్వహించాల్సి వచ్చింది. కేరళలోని అనేక విశ్వవిద్యాలయాల్లోనూ విద్యార్థులు సామూహికంగా తిలకించారు. ఇక్కడ కూడా ఆర్‌ఎస్‌ఎస్ దాని అనుబంధ సంస్థలు దాడులతో అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఫలించలేదు. తిరువనంతపురంలో పూజాపూర మైదానంలో స్క్రీన్ మీద బిబిసి రూపొందించిన ఎపిసోడ్‌ను ప్రదర్శించారు. ఇక్కడ కూడా బిజెపి కార్యకర్తలు రాళ్ల దాడికి ప్రయత్నం చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలోని బోధనా సిబ్బంది మద్దతుతో 21వ తేదినే దీనిని ప్రదర్శించగా పెద్ద సంఖ్యలో విద్యార్థులు చూశారు. ఆలస్యంగా ఈ విషయం తెలుసుకున్న ఎబివిపి విద్యార్థులు నిషేధిత చిత్రాలను వీక్షిస్తున్నట్లు కేసుపెట్టారు. దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ బిబిసి రూపొందించిన ఎపిసోడ్‌ను సాధారణ ప్రజలు చూడనీయకుండా ఆర్‌ఎస్‌ఎస్, బిజెపిలు అడ్డుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ పరిణామాలను చూసే జెఎన్‌యు విద్యార్థి సంఘ అధ్యక్షురాలు అయిషీ ఘోష్ 'ఈ ప్రభుత్వాన్ని విమర్శించాలని కోరుకుంటున్నాను. ప్రజాస్వామ్యాన్ని విమర్శ మరింతగా బలోపేతం చేస్తుంది.' అంటూ 2018లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేసిన ట్వీట్‌ను ప్రస్తావించాల్సి వచ్చింది. ఇదొక్కటే కాదు..ఇటువంటివే మరికొన్ని వ్యాఖ్యలను కూడా ఆయన చేశారు. 'ప్రజల భాగస్వామ్యం లేకుండా ప్రజాస్వామ్యం విజయవంతం కాదు. మా ప్రభుత్వం ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుంది' అని ఒక సందర్భంలో ఆయన చెప్పారు. 'ప్రతి ఒక్కరు తమ స్వప్నాలను, ఆశయాలను, లక్ష్యాలను తమదైన పద్ధతిలో సాధించుకోవడానికి సహకరించేదే ప్రజాస్వామ్యం' అని మరో సందర్భంలో ఆయన అన్నారు. ఇంత ఉదాత్తంగా మాటలు ఒకవైపు చెబుతూనే మరోవైపు నిరంకుశ పోకడలకు పోవడం ఆయనకే చెల్లింది. కాశ్మీర్ ఘర్షణలను అర్ధసత్యాలతో చిత్రీకరించి, ఆర్‌ఎస్‌ఎస్, బిజెపిల ప్రచార చిత్రంగా రూపొందిన 'కాశ్మీర్ ఫైల్స్'ను ప్రదర్శించడానికి అన్ని విశ్వవిద్యాలయాలకు అనుమతించిన కేంద్ర ప్రభుత్వం గుజరాత్‌పై బిబిసి రూపొందించిన డాక్యుమెంటును తొక్కిపెట్టడంలో మతలబేంటి? మోడీ సర్కారుకు ప్రజాస్వామ్యం పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా బిబిసి డాక్యుమెంట్లపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలి. బిబిసి కథనంలో అవాస్తవాలు ఉంటే అసలు నిజాలేంటో ప్రజలకు తెలియచేయాలి. గుజరాత్ దారుణకాండకు సంబంధించి ఎన్నో అంశాలు ఇప్పటికే ప్రజల ముందుకు వచ్చాయి. ఇంకా రాని విషయాలు ఏమైనా ఉంటే వాటిని కూడా తెలుసుకోవడం దేశ ప్రజల హక్కు.