
మైనారిటీ కమ్యూనిటీలుగా ఉన్న ముస్లింలు, బౌద్ధులు, క్రిస్టియన్లు, జైనులు, పార్సీలు, సిక్కులు ఎంఫిల్, పిహెచ్‌డి ప్రోగ్రామ్‌లను కొనసా గించడానికి ఐదేళ్ల పాటు ఆర్థిక సహాయం అందించాలనే ఉద్దేశంతో 2009లో యుపిఎ ప్రభుత్వం తీసుకొచ్చిన మౌలానా ఆజాద్ నేషనల్ ఫెలోషిప్ (యంఎయన్‌ఎఫ్)ను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తుంగలోకి తొక్కింది. 2022-23 నుండి మైనారిటీ విద్యార్థులకు ఇచ్చే మౌలానా ఆజాద్ నేషనల్ ఫెలోషిప్ (యంఎయన్‌ఎఫ్)ను రద్దు చేస్తున్నామని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి స్మృతి ఇరానీ ఇటీవల పార్లమెంట్‌లో ప్రకటించారు. ఇది పూర్తిగా మైనారిటీ వర్గాన్ని ఉన్నత విద్య నుండి దూరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం పన్నిన కుట్రే. ఈ చర్య దేశంలోని పేద, మైనారిటీ విద్యార్థులకు శాపంగా మారి స్కాలర్‌షిప్‌లకు బ్రేక్ వేస్తూ వారిని చదువులకు దూరం చేస్తున్నది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ద్వారా జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్‌ల కోసం యువ పండితులను ఎంపిక చేయటానికి ప్రతి ఏటా నిర్వహిస్తున్న ఈ పరీక్షకు లక్షలాది మంది హాజరైనా ప్రతీ సంవత్సరం 25 వేల మంది మాత్రమే ఫెలోషిప్ పొందుతున్నారని ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. అయినప్పటికీ మైనారిటీలకు చెందినవారికి ఉపయోగపడే మౌలానా ఆజాద్ నేషనల్ ఫెలోషిప్‌ను మోడీ సర్కార్ నిలిపివేసి వారిని ఉద్దేశ్యపూర్వకంగానే అంధకారంలోకి నెడుతున్నది.
దేశంలోని ముస్లింలు, ఇతర వర్గాల మధ్య విద్యాపరమైన అంతరాన్ని పరిష్కరించడానికి ప్రభుత్వం నిర్దిష్ట చర్యలు తీసుకోవాలని ఉన్నత స్థాయి కమిటీ సిఫారసు చేసిన తర్వాతనే 2009లో మౌలానా ఆజాద్ నేషనల్ ఫెలోషిప్ ప్రారంభించబడింది. 2019లో నిర్వహించిన ఆలిండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రకారం దేశ జనాభాలో ముస్లింలు 14.2 శాతం మంది ఉన్నారు. అయితే దేశంలోని కళాశాలలు, విశ్వవిద్యాలయాలలో చేరిన వారిలో కేవలం 5.5 శాతం మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. ఇది కేవలం ముస్లింల కోసమే తీసుకొచ్చిన పథకం కాకపోయినప్పటికీ దీని ద్వారా లబ్ధి పొందే వర్గంలో ముస్లింలు ఎక్కువగా ఉన్నారు. మతపరమైన రాజకీయాలకు అలవాటు పడిన కేంద్రంలోని బిజెపి సర్కార్ ఈ ఫెలోషిప్‌ను రద్దు చేసి మైనారిటీల విద్యా అవకాశాలపై దాడి చేయాలనే ఆ పథకాన్ని గత కొన్ని సంవత్సరాల నుండి నీరుగారుస్తూ వస్తున్నది. 2019-20లో 1,251 మందికి ఈ ఫెలోషిప్ అందజేయగా, 2020-21 నాటికి 1,075 మందికి కుదించింది. ఆ పథకానికి ఇచ్చే నిధులను కూడా 100 కోట్ల రూపాయల నుంచి 74 కోట్ల రూపాయలకు తగ్గించి ఇప్పుడు ఏకంగా ఆ ఫెలోషిప్‌నే ఎత్తేసింది. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చినప్పటి నుండి దేశంలోని యూనివర్సిటీలకు నిధులను తగ్గించి ప్రభుత్వ యూనివర్సిటీ వ్యవస్థను నాశనం చేస్తున్నది. కేంద్రప్రభుత్వం ఇప్పుడు యంఎయన్‌ఎఫ్‌ను ఆపడం ద్వారా విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలన్న మైనారిటీల ఆకాంక్షను నులిమేస్తున్నది.
బిజెపి పాలనలో మైనారిటీల సంక్షేమం అన్న పదానికి కూడా విలువ లేకుండా పోయింది. దళితులు, గిరిజనులు, అల్ప సంఖ్యాక వర్గాలు, వెనుకబడిన తరగతుల సంక్షేమం బిజెపి ఎజెండాలోనే లేవు. అగ్రవర్ణాల ఆధిపత్యంతోనే సమాజం నడవాలని బిజెపి సైద్ధాంతికంగా నమ్ముతున్నది. మనువాదాన్ని, మనుస్మృతిని మనసారా నమ్ముతున్న సంఫ్‌ు పరివార్ పాలనలో అణచివేతకు గురవుతున్న అట్టడుగు తరగతుల ప్రజల సంక్షేమాన్ని వీరు పట్టించుకోరనేది ఆచరణలో కనబడుతున్నది. బిజెపి పాలనలో మైనారిటీల సంక్షేమాన్ని వెతకడం అంటే ఎండమావుల్లో నీటి కోసం వెతకటమే. స్వాతంత్య్రానంతరం ముస్లిం మైనారిటీల ఆర్థిక, సామాజిక అభివృద్ధి, రాజకీయ ప్రాతినిధ్యంపై అనేకమార్లు సర్వేలు జరిగాయి. గోపాల్‌సింగ్ కమిషన్, రాజేంద్ర సచార్ అధ్యక్షతన ఏర్పడిన సచార్ కమిటీ, జస్టిస్ రంగనాథ్ మిశ్రా అధ్యక్షతన పని చేసిన మైనారిటీ కమిషన్లు మైనారిటీల సమస్యలపై, విద్య, వైద్యం, సామాజిక అభివృద్ధి, ఉపాధి, పరిశ్రమలు, వ్యాపారం తదితర రంగాలపై లోతైన అధ్యయనం చేశాయి. విద్య, ఉపాధి రంగాల్లో దేశంలోని ఇతర ప్రజలతో పోల్చితే ముస్లిం ప్రజలు చాలా వెనకబడి ఉన్నారని, ఉన్నత విద్యలో దళితులు, గిరిజనుల కంటే కూడా అధ్వాన్నమైన స్థితిలో ఈ ముస్లిం ప్రజలు ఉన్నారని సచార్ కమిటీ నివేదిక వెల్లడించింది. అంతే కాదు. విద్యలో ముస్లిం మహిళలు దేశంలోనే అందరికంటే వెనుకబడి ఉన్నారని, వ్యాపార రంగంలో ఈ తరగతి ప్రజలకు జాతీయ బ్యాంకులు చేస్తున్న సహాయం నామమాత్రంగా ఉందని కూడా పేర్కొంది. ఈ పరిస్థితి మారనట్లయితే భవిష్యత్తులో ముస్లిం మైనారిటీలు దేశ ప్రధాన స్రవంతి నుండి వేరుపడతారని కూడా హెచ్చరించింది. వారి సంక్షేమానికి ప్రత్యేక నిధులు, విద్య, ఉపాధి రంగాల్లో ప్రత్యేక వసతులు కల్పించాలని కూడా తన నివేదికలో కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. అయినప్పటికీ అభివృద్ధి లోని చివరి ఫలాలు కూడా మైనారిటీ ప్రజలకు దక్కటంలేదు. ప్రత్యేకించి బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత ముస్లిం ప్రజల సంక్షేమం మాట అటుంచితే వారి జీవితాలకే ప్రమాదం వచ్చింది. గో రక్షణ దళాల దాడులు, ముమ్మారు తలాక్ పేరిట జైలు శిక్షలు వేయటం, లవ్ జిహాద్ పేరిట విద్వేషాన్ని రెచ్చగొట్టటం, ఏకపక్షంగా జమ్ము-కాశ్మీర్‌ను విడగొట్టడం, ఆ ప్రజలకిచ్చిన హామీ ఆర్టికల్ 370 రద్దు చేయటం, వారి ఆస్తులు కాజేయటానికి 35 (ఎ)ను రద్దు చేయటం ఈ దేశంలో మైనారిటీలకు తీవ్రమైన అభద్రతా వాతావరణాన్ని సృష్టించాయి. కేంద్ర ప్రభుత్వం మత ప్రాతిపదికన పౌరసత్వాన్ని ఇచ్చేలా చట్టాన్ని సవరించటమంటే ముస్లింలకు పౌరసత్వాన్ని ఇవ్వబోమనే. రాజ్యాంగ మౌలిక విలువలను తుంగలో తొక్కటమే. కాబట్టి దేశంలోని లౌకిక శక్తుల మద్దతును కూడగట్టి మైనారిటీ ప్రజల మౌలిక హక్కులకై పోరాడటం దేశంలో ఓ ప్రధాన కర్తవ్యంగా ముందుకొచ్చింది.
- యం.ఎ. జబ్బార్,
సెల్: 9177264832