
- పట్టు, నూలుపై జిఎస్‌టి తగ్గించేందుకు ససేమిరా
- అడిగిందే తడవుగా సూరత్ జరీపై తగ్గింపు
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : చేనేత రంగంపై కేంద్ర ప్రభుత్వం మరోసారి దొంగదెబ్బ కొట్టింది. వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) నుంచి చేనేత రంగానికి సంబంధించిన పట్టు, నూలు, రంగులను జిఎస్‌టి నుంచి మినహాయించి కార్మికులను ఆదుకోవాలని పదేపదే డిమాండ్ చేస్తున్నా..పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మేరకు విజ్ఞప్తులు చేస్తున్నా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పెడచెవిన పెడుతూ వస్తోంది. చేనేతను ఇంత నిర్లక్ష్యం చేసిన మోడీ సర్కార్ ఇప్పుడు గుజరాత్ వ్యాపారులు అడిగిందే తడవుగా సూరత్ జరీపై జిఎస్‌టిని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించింది. ఈ మేరకు తాజా జిఎస్‌టి కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం చేశారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని చేనేత కార్మిక సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
దేశంలో ఉత్పత్తి అవుతున్న 90 శాతం జరీ ఉత్పత్తులు ఒక సూరత్ పట్టణంలోనే తయారవుతున్నాయి. 2017లో జిఎస్‌టి పన్నుల విధానం అమలులోకి వచ్చినప్పుడు రియల్, ఇమిటేషన్ జరీలపై 12 శాతంగా జిఎస్‌టి పన్నును వేయాలని నిర్ణయించారు. సూరత్‌కు చెందిన వ్యాపారులు, స్థానిక నాయకత్వం, గుజరాత్ ప్రజా ప్రతినిధులు రియల్ జరీ పనుును 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించుకున్నారు. మళ్లీ ఇప్పుడు అదే సూరత్ వ్యాపారులు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఇమిటేషన్ జరీపై ఉన్న 12 శాతం జిఎస్‌టిని కూడా 5 శాతానికి తగ్గించుకున్నారు. మిల్లులపై ఉత్పత్తి చేసే బట్టలపై విధించే పన్నులు, చేనేత మగ్గంపై తయారు చేసే బట్టలపై విధిస్తున్న పన్నులు ఒకే స్లాబ్ కింద ఉండకూడదని దేశవ్యాప్తంగా ఉన్న చేనేత కళాకారులు మొదటి నుంచీ వాదిస్తూ వస్తున్నారు. పవర్‌లూమ్స్‌తో హ్యాండ్లూమ్ పోటీ పడలేదని తెలిసి కూడా కేంద్రం ఆ రెండింటినీ ఒకే గాటన కట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవంగా తెలుగు, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో చేనేత మగ్గాలపై వేసే వస్త్రాలకు పట్టు, నూలు, కొంత వరకూ జరీ వాడుతారు. పట్టుపై 19 శాతం, నూలుపై 5 శాతం, రంగులపై 5 శాతం జిఎస్‌టి కొనసాగుతోంది. పారిశ్రామికంగా పవర్‌లూమ్స్‌లోనూ ప్రస్తుతం నూలు, పట్టు వినియోగిస్తున్నారు. కానీ ఎక్కువ మోతాదులో ఫ్లోరా జరీ అనే దారాన్ని వినియోగిస్తున్నారు. ఇప్పుడు మోడీ సర్కార్ జరీపై జిఎస్‌టిని7 శాతం మేర తగ్గించి నూలుతో సమానంగా 5 శాతానికి చేసింది. దీనిపైనే ఇప్పుడు చేనేత కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
- ఏళ్లుగా పోరాడుతున్నా..
కేంద్రంలోని బిజెపి సర్కారు అధికారం చేపట్టిన నాటి నుంచి చేనేత రంగాన్ని నిర్వీర్యం చేస్తూవస్తోందని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2017 నుంచి 5 శాతం జిఎస్‌టిని చేనేతపై విధించింది. నాటి నుంచి జిఎస్‌టిని తొలగించాలని చేనేత కార్మికులు, సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి నుంచి ప్రధానినరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లక్షలాది మంది ఉత్తరాలు పంపించారు. చేనేతపై జిఎస్‌టి పన్ను తొలగించాలని దాదాపు 100 మంది పార్లమెంటు సభ్యులు సంతకాలు చేనేత మహా వస్త్ర లేఖపై సంతకాలు కూడా చేశారు. చేనేత రంగానిు జిఎస్‌టి నుంచి మినహాయింపు ఇవ్వాలని కొనసాగుతున్న ఉద్యమానికి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాలు, 15 రాజకీయా పార్టీలు మద్దతు ప్రకటించాయి. అయినప్పటికీ కేంద్ర సర్కారు మాత్రం చలించడం లేదు.
- కార్పొరేట్ల కొమ్ముకాస్తున్న కేంద్రం
మోడీ సర్కార్ ఆది నుంచీ కార్పొరేట్ల కొమ్ముకాస్తున్నదని చేనేత కార్మిక సంఘాలు నేతలు విమర్శించారు. జిఎస్‌టిని తొలగించాలని ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నా పట్టించుకోని కేంద్రం, కేవలం గుజరాత్ జరీ పరిశ్రమ రక్షణ కోసం మాత్రం జిఎస్‌టిని 7 శాతానికి తగ్గించిందని విమర్శిస్తునాురు. కేంద్రం ఇప్పటికైనా వివక్ష పూరిత విధానాలు మార్చుకోవాలని, లేదంటే మూల్యం చెల్లించక తప్పదని కార్మికులు హెచ్చరిస్తున్నారు. చేనేతకు సంబంధించిన పట్టు, నూలు, రంగులపై జిఎస్‌టిని పూర్తిగా ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు.