Apr 20,2023 06:06

స్వాతంత్య్రోద్యమంలో అంతర్భాగమైన సహకార ఉద్యమ స్ఫూర్తితో రైతులు నిర్మించుకున్న కోఆపరేటివ్‌ వ్యవస్థను ధ్వంసం చేసేందుకు కేంద్ర బిజెపి ప్రభుత్వం ప్రయత్నిస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఆలోచించకుండా సాదరంగా ఆహ్వానిస్తోంది. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల (పిఎసిఎస్‌-ప్యాక్స్‌్‌) లోకి ప్రైవేటు పెట్టుబడికి ఆస్కారం కల్పిస్తూ మొన్న రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు కేంద్రం ఆదేశాల మేరకే వెలువడ్డాయి. సొసైటీల్లో 50 శాతం వాటాలు ప్రైవేటు వ్యక్తులకు, కంపెనీలకు ఇచ్చేయడమంటే వాటిని ప్రైవేటీకరించడమే. ఇంతకాలం రైతుల పూర్తి అజమాయిషీలో నడిచిన ప్యాక్స్‌లోకి ప్రైవేటు వ్యక్తులు చొరబడతారు. రాజ్యాంగం ప్రకారం 'సహకారం' రాష్ట్రాల పరిధిలోనిది. మోడీ సర్కారు రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి కేంద్రంలో సహకార మంత్రిత్వ శాఖను నెలకొల్పి హోం మంత్రి అమిత్‌షా చేతుల్లో పెట్టింది. సహకార వ్యవస్థ నిర్వీర్యానికి, కొన్ని దశాబ్దాలుగా పోగుబడిన ప్రజాధనంపై పెత్తనానికి చట్ట సవరణలు, మోడల్‌ బైలాస్‌ రూపొందించి రాష్ట్రాలు వాటిని ఆమోదించాలని శాసిస్తున్నారు. ఆ పూర్వరంగంలో వచ్చిందే ప్యాక్స్‌ ప్రైవేటీకరణ జీవో.
సహకార వ్యవస్థను పునరుజ్జీవింపజేస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన వైసిపి ప్రభుత్వం చేసిందేమీ లేదు. పిఎసిఎస్‌లపై నాక్బాబ్‌ కన్సెల్టెన్సీతో అధ్యయనం చేయించి నివేదికను ఆమోదించింది. ప్యాక్స్‌్‌లో ప్రైవేటు కన్సల్టెన్సీల నియామకం, వారికి డైరెక్టర్‌ వంటి పోస్టులివ్వాలని నాక్బాబ్‌ సిఫారసు చేసింది. ఇది సహకార రంగ అసలు లక్ష్యానికి విఘాతం కలిగిస్తుంది. చట్ట ప్రకారం ప్యాక్స్‌లో రైతులు, కౌలు రైతులు మాత్రమే సభ్యులుగా ఉండాలి. ఇప్పుడు బయటి వ్యక్తులు, కంపెనీల ప్రతినిధులు సభ్యులవుతారు. నాక్బాబ్‌ నివేదికలో ఉద్యోగుల పాలసీ అని ప్రతిపాదించారు. అది ఉద్యోగులకు వ్యతిరేకం. పిఎసిఎస్‌ల పరిస్థితి ఇలా ఉండగా సహకార డెయిరీలు, చక్కెర కర్మాగారాలు, ఆయిల్‌, స్పిన్నింగ్‌ మిల్లులు మూతబడుతున్నాయి. వాటిని తెరిపించే ప్రయత్నా లేవీ లేవు. కోఆపరేటివ్‌ డెయిరీలను పునరుజ్జీవింపజేసే బదులు వాటి ఆస్తులను గుజరాత్‌కు చెందిన అమూల్‌కు ధారాదత్తం చేసింది. గ్రామాల్లో సమాంతరంగా పాల రైతు సంఘాలను నెలకొల్పి వాతావరణం కలుషితం చేసింది. పక్కనున్న కర్ణాటకలో రైతులు స్థానిక నందినికి మద్దతుగా అమూల్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు. అక్కడి గుణపాఠాన్ని మన రాష్ట్ర సర్కారు నేర్వట్లేదు. పాల రైతులకు లీటర్‌కు రూ.4 బోనస్‌ ఇస్తామని మేనిఫెస్టోలో పేర్కొనగా ఆ ఊసు తేవట్లేదు.
కేంద్రం మొన్న బడ్జెట్‌లో దేశ వ్యాప్తంగా కొత్తగా రెండు లక్షల ప్రైమరీ వ్యవసాయ, మత్స్య, డెయిరీ సంఘాలు ఏర్పాటు చేస్తామంది. ఏ సంఘం లేని గ్రామాల్లో వీటిని నెలకొల్పుతామంటూనే, ఆర్థికంగా చితికిపోయి కొనసాగించలేని వాటిని మూసేస్తామంది. ప్యాక్స్‌్‌ను మల్టీపర్పస్‌ సర్వీస్‌ సంఘాలుగా మారుస్తామనీ పేర్కొంది. ఆచరణలోకొస్తే 30 రకాల వ్యాపారాలు సొసైటీలు చేసుకోవచ్చు. రైతుల అవసరాల కోసం కాకుండా కార్పొరేట్ల సరుకులు అమ్ముకోడానికి అనువుగా సొసైటీలు మారిపోతాయి. కేంద్ర ఆత్మనిర్భర్‌ పథకంలో వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి ఒకటి. ఇది పూర్తి రుణం. ఈ అప్పుతో ఆర్‌బికెలకు అనుబంధంగా రైతులకు అన్ని వసతులూ ఒకే చోట దొరికేలా మల్టీపర్పస్‌ ఫెసిలిటీ సెంటర్ల (ఎంపిఎఫ్‌సి)ను రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పుతోంది. వాటి నిర్మాణానికి ప్యాక్స్‌ భూములు ఉపయోగిస్తోంది. అందుకోసమే నిరుడు నవంబర్‌లో ఆర్‌బికె, ప్యాక్స్‌్‌ అనుసంధానం కోసం 1964- సహకార చట్టానికి సవరణలు చేసింది. దీన్నిబట్టి సహకార వ్యవస్థ ధ్వంసానికి కేంద్ర దర్శకత్వంలో రాష్ట్రం నడుస్తున్నట్లు అర్థమవుతుంది. ఉన్న ప్యాక్స్‌్‌లో సగం నష్టాల్లో ఉన్నాయని నాక్బాబ్‌ స్టడీ తేల్చింది. వాటి మెడపై కత్తి వేలాడుతోంది. ఇప్పటికైనా సర్కారు ప్రైవేటీకరణ జిఒ ఉపసంహరించుకోవాలి. కోఆపరేటివ్స్‌ను పరిపుష్టం కావించాలి. ప్రైవేటీకరణపై సహకార ఉద్యోగులు ఆందోళనలు చేపట్టారు. రైతులు తమ ఆస్తిని కాపాడుకోవడానికి కదలాలి. సహకార వ్యవస్థ బలోపేతానికి నిర్వహించే పోరాటం దేశభక్తికి గీటురాయి.