
తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్.రవి చర్యలు ముమ్మాటికి సమాఖ్య స్ఫూర్తిపై దాడే. గవర్నర్‌గా నియమితులైనప్పటి నుండి ఆయన వివాదాస్పదంగానే వ్యవహరిస్తున్నారు. ఆయన తీరుపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కె స్టాలిన్ ఎప్పటికప్పుడు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో పాటు, కేంద్ర ప్రభుత్వానికి లేఖలు కూడా రాశారు. అయినా, గవర్నర్ వ్యవహార శైలిలో ఇసుమంత మార్పు రాలేదు. సరికదా మరింత దిగజారింది. ప్రభుత్వం రూపొందించిన ప్రసంగ పాఠానికి తన ఇష్టం వచ్చినట్లు మార్పులు చేర్పులు చేసి రాష్ట్ర శాసనసభలో చదవడం దీనికి పరాకాష్ట. దీనిపై పెద్దఎత్తున విమర్శలు చెలరేగుతుండగానే సివిల్ సర్వీసు అభ్యర్థులతో బుధవారం జరిపిన ముఖాముఖిలో కేంద్రం చెప్పినట్లు మాత్రమే నడుచుకోవాలని చెప్పడాన్ని బరితెగింపుగానే అర్ధం చేసుకోవాలి. మాజీ ఐపిఎస్ అధికారి అయిన రవికి రాజ్యాంగం, దాని నిర్దేశాలు, ప్రజాస్వామ్య సాంప్రదాయాల గురించి తెలియవని అనుకోలేం. అయినా, ఇలా వ్యవహరిస్తున్నారంటే ఉద్దేశ్యపూర్వకమే తప్ప మరొకటి కాదు! తమిళనాడు రాష్ట్రాన్ని ఆ పేరుతో పిలవడానికి ఎవరికైనా అభ్యంతరం ఎందుకు ఉండాలి? ద్రవిడ ఉద్యమ నేపథ్యాన్ని ఏమాత్రం అంగీకరించని సంఫ్‌ుపరివార్‌కు మాత్రం ఆ పేరు నచ్చదు. కొంతకాలంగా ఆర్‌ఎస్‌ఎస్ సూచిస్తున్న తమిళగం పేరును రాష్ట్రానికి పెట్టాలని గవర్నర్ ప్రవచిస్తున్నారు. శాసనసభలో చదవడానికి రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రసంగపాఠంలోనూ తమిళనాడుకు బదులుగా తమిళగంను ఆయన చేర్చి చదివారు. ఇది, డిఎంకె ప్రభుత్వాన్ని కాదు, యావత్ తమిళ ప్రజలను అవమానించడమే! ఆ రాష్ట్ర ప్రజలు ఎంతగానో గౌరవించే సిఎన్ అన్నాదొరై తమిళనాడు పేరును మొట్టమొదట ప్రతిపాదించారు. రాష్ట్ర అసెంబ్లీ దానిని అమోదించింది. తమ భాష, సంస్కృతి, రాజకీయాలకు తమిళనాడు పేరు అద్దం పడుతుందని అక్కడి ప్రజలు భావిస్తారు. అటువంటిది శాసనసభ రికార్డుల్లోనే ఆ పేరును తనకు తోచినట్టు మార్చి చదవడానికి గవర్నర్ సిద్ధపడారంటే అర్ధం ఏమిటి? ఇదొక్కటే కాదు, అన్నాదొరై, అంబేద్కర్ల పేర్లుతో పాటు కులవ్యవస్థపై తిరుగులేని పోరు సాగించిన ద్రవిడ ఉద్యమ ప్రస్తావనకు సంబంధించిన పేరాలను కూడా చదవడానికి గవర్నర్ ఇష్టపడలేదు. వాటికి బదులు తన చిత్తానికి తోచిన మాటలు ఆయన చెప్పారు. అందుకే, గవర్నర్ ప్రసంగానికి బదులుగా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన ప్రసంగపాఠాన్నే శాసనసభ రికార్డుల్లో చేర్చాలని ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రతిపాదించాల్సి వచ్చింది. దానిని సభ ఏకగ్రీవంగా ఆమోదించడం ఆహ్వానించదగిన పరిణామం.
శాసనసభలో చదవాల్సిన ప్రసంగపాఠాన్ని రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే గవర్నర్‌కు పంపుతుంది. దానిని పరిశీలించి, ఆమోదించిన తరువాతే తుది పాఠాన్ని ఖరారు చేస్తారు. ఒక వేళ అభ్యంతరాలుంటే, తెలియచేస్తే ప్రభుత్వం సవరించే అవకాశం ఉంటుంది. ఒకవేళ సవరించకుండా అదే ప్రసంగాన్ని మళ్ళీ పంపితే గవర్నర్ దానిని ఆమోదించాల్సిందే. అలా ఆమోదించిన ప్రసంగాన్నే సభలో చదవాలి. ఇది రాజ్యాంగ సంప్రదాయం! అత్యున్నత న్యాయస్థానం కూడా అనేక సందర్భాల్లో దీనినే ధృవీకరించింది. రాష్ట్రపతి, గవర్నర్లకు విధి నిర్వహణలో సొంత అభిప్రాయాలకు తావు లేదంటూ రాజ్యాంగ నిర్దేశ సారాంశం కూడా ఇదే! రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రసంగ పాఠాన్ని ఆమోదించి, చదవాల్సిన సమయంలో దానిని పక్కన పెట్టి సొంత అభిప్రాయాలనో, తనను నడిపించే వారి అభిప్రాయాలనో ఏకరువు పెట్టడం ద్వారా రాజ్యాంగ విలువలను రవి తుంగలో తొక్కారు. గవర్నర్‌ను కేంద్ర ప్రభుత్వమే నియమిస్తుంది. కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా కూడా ఆయన భావించవచ్చు. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నరే ముఖం! ఆయన పేరుతోనే రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలన్నీ సాగుతాయి. సమాఖ్య వ్యవస్థ బలపడాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంధానకర్తలుగా గవర్నర్లు వ్యవహరించాలి. సమన్వయానికి చొరవ చూపాలి.
నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలతో గవర్నర్ల ఘర్షణ ధోరణి పెరిగింది. కేరళ, పశ్చిమ బెంగాల్, తెలంగాణ ఇలా చెప్పుకుంటూ పోతే జాబితా చాలా ఉంది. ఇది యాదృచ్ఛికంగా జరుగుతున్నది కాదు. రాష్ట్రాలను బలహీన పరిచి, బలమైన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్న బిజెపి, సంఫ్‌ుపరివార్ సిద్ధాంతంలో భాగంగానే ఈ దాడులు జరుగుతున్నాయి. వీటిని ప్రతిఘటించి, సమాఖ్య వ్యవస్థను, ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత భారత ప్రజలందరిది.