Aug 11,2023 18:08

ఈ ఏడాది సంక్రాంతికి 'వాల్తేరు వీరయ్య' మూవీ హిట్‌ కొట్టడంతో మెగాస్టార్‌ చిరంజీవి ఫుల్‌ జోష్‌లో ఉన్నాడు. ఈ ఏడాదే ఏడు నెలల గ్యాప్‌తోనే మరోసారి 'భోళా శంకర్‌' మూవీతో చిరు ప్రేక్షకులముందుకొచ్చాడు. ఆగస్టు 11వ తేదీ శుక్రవారం విడుదలైన ఈ మూవీ ప్రేక్షకుల్ని అలరించిందా లేదా అన్నది తెలుసుకుందామా..!


కథ
భోళా శంకర్‌ (చిరంజీవి) తన చెల్లెలు మహాలక్ష్మీ(కీర్తిసురేష్‌)ని మంచి కాలేజీలో చదివించేందుకు కలకత్తాకు వస్తాడు. తాను ఆ సిటీలోనే ట్యాక్సీ డ్రైవర్‌గా పనికి కుదురుతాడు. ఈ క్రమంలోనే అమ్మాయిల కిడ్నాప్‌ కేసులో పోలీసులు క్యాబ్‌ డ్రైవర్‌ శంకర్‌ని సంప్రదించగా.. అతను అలెగ్జాండర్‌ గ్యాంగ్‌ గురించి సమాచారం ఇస్తాడు. దీంతో అలెగ్జాండర్‌ గ్యాంగ్‌ శంకర్‌ని టార్గెట్‌ చేస్తుంది. ఆ గ్యాంగ్‌లోని ఒక్కొక్కరిని శంకర్‌ చంపేస్తుంటాడు. అలా చంపేటప్పుడు లాయర్‌ లాస్య (తమన్నా) శంకర్‌ని చూస్తుంది. లాస్య తమ్ముడు శ్రీకర్‌ (సుశాంత్‌) మహాలక్ష్మీని చూసి ప్రేమిస్తాడు. తీరా వాళ్లు పెళ్లి చేసుకునే సమయానికి మహాలక్ష్మీ శంకర్‌ చెల్లెలు అని తెలిసి లాస్య వారి పెళ్లికి ఒప్పుకోదు. ఆ సమయంలో మహాలక్ష్మీ తన చెల్లెలు కాదనే నిజాన్ని శంకర్‌ బయటపెడతాడు. తాను శంకర్‌ కాదు అని.. భోళా భారు అని చెబుతాడు. హైదరాబాద్‌లో భోళా భారుగా ఉన్న అతను.. కలకత్తాలో శంకర్‌గా ఎందుకు అడుగుపెట్టాడు? అతని బ్యాగ్రౌండ్‌ ఏంటి? శంకర్‌కి, మహాలక్ష్మీకి మధ్య ఉన్న రిలేషన్‌ ఏంటి? శ్రీకర్‌, మహాలక్ష్మీల పెళ్లి అవుతుందా? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

bhola shankar


విశ్లేషణ
తమిళ సూపర్‌ హిట్‌ చిత్రం 'వేదాళం' రీమేక్‌గా భోళా శంకర్‌ చిత్రంని దర్శకుడు మెహర్‌ రమేష్‌ తెరకెక్కించారు. అయితే మాతృక కంటే.. తెలుగు నేటివిటికి తగ్గట్టుగా రమేష్‌ మార్పులు చేర్పులు చేశారు. ఇక సినిమా విషయానికి వస్తే.. ఉమెన్‌ ట్రాఫికింగ్‌ సీన్‌తో కథ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత హీరో చిరు ఎంట్రీ అదిరిపోతుంది. చెల్లెలు మహాలక్ష్మీతో, కలకత్తాలో డ్రైవర్‌గా సాదాసీదా సన్నివేశాలతో కథనం సాగుతుంది. సీరియస్‌ కథ నుంచి కామెడీ ట్రాక్‌వైపు వెన్నెల కిశోర్‌తో వచ్చే సన్నివేశాలు కూడా ఏమంత నవ్వులు పూయించవు. శంకర్‌, అలెగ్జాండర్‌ గ్యాంగ్‌తో తలపడే యాక్షన్‌ సన్నివేశాలు కూడా సోసోగానే సాగుతాయి. ఇంటర్వెల్‌ సీన్‌కి ముందు శంకర్‌ కాదు.. భోళాభారుగా వచ్చే ట్విస్టు సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. సెకండాఫ్‌లో భోళా భారుగా చిరంజీవి యాక్షన్‌ బాగుంటుంది. శ్రీముఖితో చేసే 'ఖుషీ' సీన్‌ తెరపై ఎబ్బెట్టుగా ఉంది. రఘుబాబు, గెటప్‌శ్రీను, హర్ష వంటి కామెడీ యాక్టర్స్‌ ఉన్నా.. తెరపై నవ్వులు పండలేదు. దర్శకుడు కామెడీ ట్రాక్‌ని సరిగ్గా డీల్‌ చేయలేకపోయాడు. ఇక క్లైమాక్స్‌ ప్రేక్షకులు ఊహించిందే. ఇందులో తమన్నా నటన పరవాలేదు. ముందు శంకర్‌ని ద్వేషించినా.. ఆ తర్వాత తన గతం తెలిసి.. ప్రేమించడం వంటి సన్నివేశాలు చూస్తే..కావాలని లవ్‌ట్రాక్‌ని సినిమాలో ఇరికించినట్లుగా ఉంది. ఇది సినిమాపై పెద్ద ఇంపాక్ట్‌ చూపలేదు. కేవలం ఆమె పాటలకు, కొన్ని సన్నివేశాలకే పరిమితమైంది. ఇక కీర్తిసురేష్‌ నటన హైలెట్‌. చిరు వయసు ప్రభావం తెరపై స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఆయన ఎనర్జీ మాత్రం ఏమాత్రం తగ్గలేదని ఆయన డ్యాన్స్‌తో మరోసారి రుజువైంది. సుశాంత్‌ కీలక పాత్ర అనేదానికంటే ఓ అతిథి పాత్ర అనడం కరెక్టేమో. ఆయన పాత్ర నిడివి చాలా తక్కువ. విలన్‌గా తరుణ్‌ అరోరా నటన పరవాలేదు. దర్శకుడు స్క్రీన్‌ప్లే పరంగా కొత్తగా ట్రై చేసి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి. మహతి స్వర సాగర్‌ సంగీతం పరవాలేదు. ఓవరాల్‌గా ఈ చిత్రం చిరుకి డిజాస్టర్‌ మూవీలా నిలుస్తుందనడంలో సందేహం లేదు. డైరెక్టర్‌ రమేష్‌ చాన్నాళ్లకు మెగా ఫోన్‌ పట్టుకున్నా.. దాన్ని సరిగ్గా యూజ్‌ చేసుకోలేదు.

bhola shankar