
- అనిల్ రావిపూడి సినిమా అంటే కామెడీ అని, బాలకృష్ణ సినిమా అంటే సహజంగా పంచ్ డైలాగ్స్, ఫైట్స్ ఊహిస్తారు అభిమానులు. వీరి కాంబినేషనో సినిమా అంటే ప్రేక్షకుల్లో కొంత ఆసక్తి నెలకొంది. అంచనాలకు తగ్గకుండా రావిపూడి -బాలయ్య స్టైల్లో 'భగవంత్ కేసరి' సినిమా తీశారు. పాత కథ అయినా మెసేజ్‌పరంగా వినోదాన్ని అందించారు. కానీ తొలిసారి వీరిద్దరూ తమ బలాలను వదిలి, ప్రయోగంగా చేశారు. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడే బాలయ్యను కొత్తగా చూడబోతున్నారని చెప్పాడు అనిల్ రావిపూడి. అన్నట్లుగానే బాలయ్యను తెరపై కొత్తగా చూపించే ప్రయత్నం చేశారు. మరి సినిమా ఎలా ఉందో చూద్దాం.
పండగ అంటే సినిమా సందడి ఉండాల్సిందే. అందులోనూ పెద్ద హీరోల సినిమా విడుదలైతే అభిమానులకు మరింత ఆనందం. ఈ నేపథ్యంలో దసరాకు బాలకృష్ణ సినిమా 'భగవంత్ కేసరి' విడుదల అయ్యింది. ఇందులో హీరోయిన్ కాజల్, శ్రీలీల నటించారు. ముందుగా పాటలు, ట్రైలర్ విడుదల చేయడంతో ప్రేక్షకుల్లో కథ ఏమైంటుందోనన్న ఉత్సాహం కలిగించింది. ఇంతకీ ...
కథలోకి వెళితే... నేలకొండ భగవంత్ కేసరి (బాలకృష్ణ) వరంగల్ జైల్లో ఖైదీగా ఉంటాడు. అక్కడికి కొత్తగా వచ్చిన జైలర్ శ్రీకాంత్ (శరత్‌కుమార్).. భగవంత్ కేసరి గురించి తెలుసుకొని, అతనికి దగ్గరవుతాడు. భగవంత్ కేసరికి సహాయం చేసిన కారణంగా శ్రీకాంత్ సస్పెండ్ అవుతాడు. వెళ్లే ముందు సత్ప్రవర్తన కారణంగా రిలీజ్ చేసే ఖైదీల లిస్ట్‌లో భగవంత్ కేసరి పేరు చేర్చుతాడు. దీంతో భగవంత్ జైలు నుంచి విడుదలవుతాడు. బయటకు రాగానే జైలర్ శ్రీకాంత్ ఇంటికి వెళ్తాడు. అదే రోజు శ్రీకాంత్ రోడ్డు యాక్సిడెంట్‌లో మరణిస్తాడు. దీంతో అతని కూతురు విజ్జి పాప (శ్రీలీల) బాధ్యతను భగవంత్ కేసరి తీసుకుంటాడు. తండ్రి కోరిక మేరకు విజ్జి పాపను ఇండియన్ ఆర్మీలో చేర్పించాలనుకుంటాడు. మరోపక్క వ్యాపారవేత్త రాహుల్ సంఘ్వీ (అర్జున్ రాంపాల్) ప్రభుత్వాన్ని బెదిరించి ప్రాజెక్ట్ 'వి' ని దక్కించుకోవాలనుకుంటాడు. దానికి అడ్డుగా వచ్చిన ఉప ముఖ్యమంత్రి (శుభలేఖ సుధాకర్) ని హత్య చేసి.. అతని పీఏ దగ్గర ఉన్న ఆధారాల కోసం వెతుకుతుంటాడు. ఓ కారణంగా విజ్జి పాపను చంపేందుకు సంఘ్వీ మనుషులు ప్రయత్నిస్తారు. అప్పుడు భగవంత్ కేసరి ఏం చేశాడు? అసలు భగవంత్ కేసరి జైలుకు ఎందుకు వెళ్లాడు? ఆదిలాబాద్ ఊచకోత కేసు నేపథ్యం ఏంటి? రాహుల్ సింఘ్వీకి, కేసరికి మధ్య ఉన్న పాత వైరం ఏంటి? చివరకు విజ్జి పాప ఆర్మీలో చేరిందా? లేదా? అనేది 'భగవంత్ కేసరి' కథ.
హీరో తన సొంతూరిని వదిలి దూరంగా బతకడం.. దాని వెనుక విలన్ కారణంగా ఉండడం.. ఒక ఫ్లాష్ బ్యాక్ స్టోరీ.. క్లైమాక్స్‌లో హీరో మళ్లీ వచ్చి విలన్‌ని చంపడం.. ఈ తరహా కథతో తెలుగులో చాలా సినిమాలే వచ్చాయి. 'భగవంత్ కేసరి' కథ కూడా అలానే ఉంటుంది. కాకపోతే కొంచెం కొత్తగా చెప్పారు. దానికి కారణం బాలయ్య, శ్రీలీల మధ్య జరిగే సన్నివేశాలు. అమ్మాయిలను సింహం లెక్క పెంచాలి అని చెబుతూ.. వారిని కేవలం వంటింటికే పరిమితం చేయొద్దనే సందేశాన్ని ఈ చిత్రం ద్వారా ఇచ్చారు. పాపని ఆర్మీకి పంపాలన్న అతని ధ్యేయం. పాప అందుకు సిద్ధం కాకపోవటంతో అతను బాధపడతాడు. అలాగే బాలకృష్ణ, కాజల్ మధ్య వచ్చే సన్నివేశాలు కడుపుబ్బా నవ్విస్తాయి. విశ్రాంతి సమయంలో ట్విస్ట్ ఒకటి ఉంటుంది. ఇక రెండో సగం అంతా విలన్‌కి, బాలకృష్ణకి మధ్య నడిచే సన్నివేశాలు చూపిస్తారు. స్కూల్లో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి చెప్పించిన అంశాలు కీలకం. 'మా అడవిలో మృగాలు ఉంటాయని బోర్డ్ రాసి ఉంటుంది. కానీ, సమాజంలో అలా కాదు.. ఆవుల్లా కనిపించే నక్కలు ఉంటాయి. మృగం మనిషిగా మారడం చాలా కష్టం. కానీ, మనిషి మాత్రం ఆడబిడ్డని చూస్తే మృగంలా మారిపోతాడు' అంటూ చెప్పే సంభాషణలు ఆలోచింపజేస్తాయి. ఈ సినిమాలో బాలకృష్ణని అతని వయసుకి తగ్గ పాత్రలో చూపించటంలో అనిల్ రావిపూడి సక్సస్ అయ్యారు. తెరపై సరికొత్త శ్రీలీలను చూస్తారు. ఎమోషనల్ సీన్స్‌తో పాటు యాక్షన్స్ సన్నివేశంలో కూడా అద్భుతంగా నటించారు. కాజల్ కూడా బాలకృష్ణకు జోడీగా, తన పాత్రలో ఒదిగిపోయారు.
నటీనటులు : నందమూరి బాలకృష్ణ, కాజల్ అగర్వాల్, శ్రీలీల, అర్జున్ రాంపాల్, శరత్‌కుమార్, జయచిత్ర, మురళీధర్ రెడ్డి, రవి శంకర్ తదితరులు.
ఛాయాగ్రహణం : సి రాంప్రసాద్
సంగీతం : థమన్ ఎస్‌ఎస్
నిర్మాతలు : సాహు గారపాటి, హరీష్ పెద్ది
రచన, దర్శకత్వం : అనిల్ రావిపూడి