Jul 17,2022 06:55

ఈ విశ్వంలోని జీవకోటిలో భావోద్వేగాలను వ్యక్తీకరించగలిగే ఒకే ఒక ప్రాణి మనిషి. 'శారీరక ప్రేరేపణ, వ్యక్తీకరణ ప్రవర్తన మరియు చేతన అనుభవం'తో కూడిన వాటిని భావోద్వేగాలని మనస్తత్వవేత్త డేవిడ్‌ జి.మేయర్స్‌ అంటారు. ప్రేమ, కోపం, బాధ, నవ్వు, ఆనందం, వ్యంగ్యం, హాస్యం వంటి అనేక భావోద్వేగాలకు మనిషి లోనవుతూ వుంటాడు. కొన్ని భావనలను మాటలలో వ్యక్తీకరించలేం కూడా. రకరకాల సందర్భాలలో మనిషి వ్యక్తీకరించే అనేక భావనలకు ఒక రూపం ఇస్తే.. అది ఎమోజి. మనిషిలో నిత్యం ఎగసిపడే ఎన్నో భావాలకు ప్రతిరూపాలే ఎమోజీలు. ఇవి కమ్యూనికేషన్‌ యొక్క డిజిటల్‌ రూపం. సోషల్‌ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత, ఆ వేదికలలో తమ తమ భావాలను, భావనలను పంచుకోవడం మొదలైన తర్వాత...మన ఎదుట లేని వ్యక్తికి మన ఫీలింగ్స్‌ అర్థమయ్యేలా చెప్పే ఎమోజీలు జీవితంలో ఒక భాగమయ్యాయంటే అతిశయోక్తి కాదు. నిజానికి ఎమోజి అనేది ఒక భాష. అక్షరాలను పదాలుగా మార్చకుండా భావోద్వేగాలను వ్యక్తీకరించడానికి సులభమైన మార్గం. మాటలకు బదులు భావాలు పంచుతుంది. మాట్లాడకుండానే అర్థాలు చెబుతుంది.
          'వేల పదాలతో చెప్పలేని భావాన్ని ఒక ఫొటో ద్వారా చెప్పొచ్చు'నని జర్నలిజంలో ఒక నియమంగా చెపుతారు. అలాగే ఎక్కడో వున్న వ్యక్తికి తన సంభాషణల (చాటింగ్‌) ద్వారా వివరించడానికి ఎన్నో పదాలను, వాక్యాలను టైప్‌ చేయాల్సిన పని లేకుండా...తమ భావనను ఒక ఎమోజి ద్వారా చెప్పడం మన దైనందిన జీవితంలో భాగంగా మారింది. చాట్‌ చేసేటప్పుడు లేదా మెసేజ్‌ లు, అభినందనలు, శుభాకాంక్షలు, సంతాప సందేశాలు వంటివి పంపేటప్పుడు ఎమోజీలు లేకపోవడాన్ని ఊహించుకోలేని పరిస్థితికి వచ్చేశాం. ఎమోజీలు లేకుండా ఎవరితోనైనా మాట్లాడటం విసుగు తెప్పిస్తుందనే చెప్పాలి. ఒక్క మాటలో చెప్పాలంటే-ఎమోజిలు లేని వర్చువల్‌ సంభాషణ... ఉప్పులేని పప్పులా చప్పగా వుంటుంది. అంతేకాదు...ప్రకృతి, పండ్లు, ఆహారాలు, జంతువులు, పక్షులు, సంగీతం, రకరకాల వృత్తులు ఇలా ఏది చెప్పాలన్నా ఎమోజిలతో మనం చూపించొచ్చు. ప్రస్తుతం అధికారికంగా యూనికోడ్‌ కన్సార్టియం ఆమోదం లభించిన 3,633 ఎమోజిలు అందుబాటులో వున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్‌ వాడుతున్న వారిలో 92 శాతం మంది ప్రతి రోజూ ఎమోజిలను వాడుతున్నారు. దాదాపు 70 శాతం మంది తమ భావాలను పదాలలో కంటే ఎమోజీల ద్వారా సరిగ్గా వ్యక్తీకరించగలుగుతున్నామని నమ్ముతున్నట్లు ఒక నివేదిక వెల్లడించింది. ఒక్క ఫేస్‌బుక్‌ మెసెంజర్‌ లోనే ప్రతి రోజూ 900 మిలియన్ల ఎమోజిలను పరస్పరం పంపుకుంటున్నారు.
              ఎమోజీ పుట్టి ఇప్పటికి 40 ఏళ్లు అవుతోంది. మొదట రెండు చుక్కలు, ఒక గీతతో స్మైలీ ఆకారాన్ని అమెరికాకు చెందిన స్కాట్‌ ఫాల్మన్‌ అనే కంప్యూటర్‌ శాస్త్రవేత్త రూపొందించాడు. ఆ తర్వాత జపాన్‌, చైనా వంటి దేశాల్లో హావభావాలతో, ముఖ కవళికలతో కూడిన ఎమోజీలను తయారుచేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఎందరో అభిమానుల్ని సంపాదించుకున్న ఈ ఎమోజిలు ఆ తర్వాత యానిమేషన్‌ రూపం లోకి మారాయి. ఎమోజీ అనేది జపనీస్‌ పదం. జపాన్‌ భాషలో ఎమోజీ అంటే చిత్ర పదం. 2013లో ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీలో చేరిన ఎమోజి... 2014 జులై 17 నుంచి ప్రపంచ ఎమోజి దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఇదే రోజున, ఎమోజిపీడియా ప్రపంచ ఎమోజి అవార్డులను నిర్వహిస్తుంది.
               'సైన్సు వల్ల ఈ రోజున సామాన్యుని బతుకు కూడా సౌందర్యమయం కాగల సదుపాయం లభించింది' అంటాడు శ్రీశ్రీ. ఫోన్ల లోనే కాకుండా మనం నిత్యం వాడుకునే దిండ్లు, దుప్పట్లు, కాఫీ కప్పులు, టీ-షర్టులు వంటి ఎమోజీ గూడీస్‌తో మార్కెట్‌ ఎమోజిలతో నిండి ఉన్నది. అనేక కొత్త ఎమోజిలు పుట్టుకొస్తున్నాయి. ఈ సాంకేతికతను సద్వినియోగం చేసుకున్నప్పుడే దానికో విలువ, సార్థకత వుంటుంది. కొన్ని సందర్భాలలో కొన్ని ఎమోజిలను వాడితే అభాసుపాలవడమో, ఆక్షేపణీయంగా మారడమో జరుగుతుంది. హార్డ్‌ ఎమోజిని ఎదుటివారి అనుమతి లేకుండా వాడితే కొన్ని దేశాలలో నేరంగా భావిస్తారు. దీని సంగతి ఎలా వున్నా... ఆయా సందర్భాలనుబట్టి మన భావోద్వేగాలను అర్థవంతంగా వ్యక్తీకరించడం ద్వారా సంబంధాలను పదిలంగా కాపాడుకోవచ్చు. అందివచ్చిన సాంకేతికతను సద్వినియోగం చేసుకోవచ్చు.