Jun 17,2022 06:49

అధికారం కోసం పాకులాడే అధమ రాజకీయ నేతగా కాదు. కులమతాలకు అతీతంగా భారతమ్మ బిడ్డలందరి యోగక్షేమాల కోసం పరిశ్రమిస్తూ సిసలైన భారతీయుడిగ జీవించు! పాలించు! ఎందరో పాలకుల్లా చరిత్ర చెత్తబుట్టలో పడకండి! ఇకనుంచైనా కార్పొరేట్ల కోసం గాక, కష్టజీవుల కూడు-గూడు-గుడ్డ-విద్య- వైద్యాలకు భరోసా కల్పించి కలకాలం వాళ్ళ గుండెల్లో కొలువుండి పొండి !

మోడీజీ...! ఇస్లాం తీవ్రవాదం ముస్లింలకు ఎంత ప్రమాదకరంగా, అగౌరవంగా మారిందో మీకు తెలుసు! తెలిసి కూడా కేవలం మీ అధికార భద్రత కోసం...బిజెపి నిరంతరం ప్రజ్వలింపజేస్తున్న హిందూ జాతీయ తీవ్రవాదం...ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి వున్న కోట్లాది మంది హిందువులను అభద్రతకు, అవమానానికీ గురిచేస్తున్నదని ఆలోచించలేకపోతున్నారెందుకని ?
     గత సంవత్సరం బంగ్లాదేశ్‌ లోని హిందువులపై ఊచకోతలు జరుగుతున్న సందర్భంలో వాటిని ఆపమని మీరన్నప్పుడు బంగ్లాదేశ్‌ ప్రధాని అన్న మాటల్ని గుర్తు చేసుకోండి. 'మా దేశంలోని తీవ్రవాదుల ఉన్మాద చర్యలకు మీ దేశంలో సాకులు దొరక్కుండా జాగ్రత్త పడండి!' అన్నారు. అప్పుడు మీరు కనీసం నోరెత్తలేకపోయారు. కారణం తమరిక్కడ చేస్తున్న నిర్వాకమే కదా మోడీజీ? జమ్మూకాశ్మీర్‌ లోని ఉగ్రవాదులను అరికట్టి, కాశ్మీరీ హిందువులకు భద్రత కల్పిస్తామంటూ ఆర్టికల్‌ 370ని రద్దు చేశారు. 'కాశ్మీర్‌ ఫైల్స్‌' సినిమా తీయించి కాశ్మీరీ పండిట్లపై దాడులకు గత పాలకులు, ముస్లింలే కారకులంటూ కాశ్మీర్‌ హిందువుల రక్షకులం మేమేనంటూ డప్పు కొట్టుకున్నారు గదా? మరి గత 22 రోజుల్లో 9 మంది పండిట్లను దారుణంగా కాల్చి చంపారు ఉగ్రవాదులు! దీనికి బాధ్యులెవరు? ఆవు మాంసం తిన్నారంటూ మీ పాలన లోని ముస్లింలను చంపిన హిందూ తీవ్రాదులా? వాళ్లకు చేయూతనిచ్చిన మీ ప్రభుత్వమా? ఆత్మ విమర్శ చేసుకోండి !
    'అయ్యా మమ్మల్ని కాపాడండి! లేదా ఎక్కడికైనా వలస వెళ్లి తల దాచుకోనివ్వండి' అంటూ భయంతో పండిట్లు గగ్గోలు పెడుతున్నారు. అయినా సరే మీరు మాత్రం మసీదులు, శివలింగాలు, ఆలయాలు వగైరాలతో నాటి బ్రిటీష్‌ పాలకుల్లా విభజించి, కలకాలం పాలించాలనుకుంటున్నారు కదా ?
    పదవి, అధికారాలే కాదు. మనతో సహా ఏదీ, ఎవరూ శాశ్వతం కాదు మోడీజీ! కారే రాజుల్‌! ఏలరే రాజ్యముల్‌! వారేరీ మోడీజీ? మీకు చదివే తీరికుండదు. నిజమే! కానీ ప్రకృతిని చూసైనా నేర్చుకోవచ్చు గదా? సూర్యుడు ఒక నక్షత్రం. చుట్టూ వివిధ గ్రహాలు. అవన్నీ ఒక ఉమ్మడి సూర్య కుటుంబంలా, అలాగే వివిధ నక్షత్రాలన్నీ ఒక గెలాక్సీగా సహజీవనం చేస్తున్నారు గదా మోడీజీ !
    ఇక మన భరత మాతను చూసి ఇంకెంతో నేర్చుకోవచ్చు. మనదొక దేశం మాత్రమే కాదు. భిన్న జాతులు, కులమతాలు, వేషభాషలు, వాతావరణాలతో విరాజిల్లుతున్న ఉపఖండం! ఏ మతం వాడు - ఏ కులపు వాడు, ఏ పార్టీ వాడు సాగుచేసినా ఈ నేల పండుతుంది. పండ్లను, ధాన్యాలనందించి తన బిడ్డల్ని పోషిస్తున్నది తల్లి భరత మాత! అంతే కాదు. నాతో మీతో సహా కుల, మత, పార్టీలకు అతీతంగా మరణానంతరం మన శవాలను ఆప్యాయంగా తన గర్భంలో పొదువుకుంటుంది ! మన చితిమంటల్ని భరిస్తుంది. అలాంటి పుణ్యభూమి బిడ్డలమైన మన మధ్య హిందూ, ముస్లిం కొట్లాటలేంటి ?
    అధికారం కోసం పాకులాడే అధమ రాజకీయ నేతగా కాదు. కులమతాలకు అతీతంగా భారతమ్మ బిడ్డలందరి యోగక్షేమాల కోసం పరిశ్రమిస్తూ సిసలైన భారతీయుడిగ జీవించు! పాలించు! ఎందరో పాలకుల్లా చరిత్ర చెత్తబుట్టలో పడకండి! ఇకనుంచైనా కార్పొరేట్ల కోసం గాక, కష్టజీవుల కూడు-గూడు-గుడ్డ-విద్య- వైద్యాలకు భరోసా కల్పించి కలకాలం వాళ్ళ గుండెల్లో కొలువుండి పొండి!
'మాట తప్పని శ్రీరాముని భక్తుడినని'' చాటుకుంటున్న మీరు, ఒకటి కాదు, రెండు కాదు, ఎన్ని మాటలు తప్పారో ఆత్మ విమర్శ చేసుకోండి మోడీజీ !
    విదేశీ నల్లధనాన్ని తెచ్చి, అందరికీ పంచుతానని వాగ్దానం చేశారు. పనామా-ప్యారడైజ్‌-పండోరా పేపర్లు, భారతీయుల నల్లధనం నిల్వల జాబితాను బయట పెట్టినా, 'ఎవర్నీ వదలమంటూ' ఓ గంభీర ప్రకటన చేయటం తప్ప రూపాయి నల్లధనాన్ని కూడ దేశానికి తెచ్చింది లేదు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలిస్తామంటూ ప్రకటించారు! అవేవీ రాకపోగా మీ హయాంలో కోట్లాది ఉద్యోగాలను కోల్పోయారు. ప్రపంచం తలెత్తుకు చూసేంతగా వృద్ధిరేటును పెంచుతామన్నారు. కానీ భారత జీడీపీని 1980 దశకం నాటి 5 శాతానికి పతనం చేసి నేలకొంగి చూసేలా చేశారు. ఆంధ్రకు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. మూడేళ్ళలో విభజన హామీలు నెరవేర్చుతామన్నారు. ఎనిమిదేళ్ళయ్యింది. అతీగతీ లేదు. గ్యాస్‌ సబ్సిడీని తీసేసి నగదు బదిలీ చేస్తామన్నారు. తీరా హుష్‌ కాకీ అన్నారు. 'స్వచ్ఛ భారత్‌'ను నిర్మిస్తామంటూ 'కక్ష భారత్‌'ను రూపొందిస్తున్నారు.రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్నారు. వ్యవసాయ ఖర్చును రెట్టింపు చేశారు. బ్యాంకులకు కార్పొరేట్లు చెల్లించాల్సిన మొండి బాకీలను ముక్కు పిండి వసూలు చేస్తామన్నారు. కానీ వాళ్ళకు లక్షల కోట్లు రుణ మాఫీ చేశారు. అలా బ్యాంకు రుణాలెగ్గొట్టిన కార్పొరేట్లకే ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులన్నీ కట్టబెడుతున్నారు. వాటిని కొనుక్కోటానికి తిరిగి వారికి బ్యాంకుల చేత అప్పులిస్తున్నారు.
   'మా హయాంలో సరిహద్దులు భద్రంగా ఉన్నాయ'ని ప్రకటించుకున్నారు. సరిహద్దులు భద్రంగా వుంటే విదేశీ ఉగ్రవాదులు ఎలా దేశంలోకి చొరబడుతున్నారు? కాశ్శీరీ పండిట్లనెలా కాల్చగల్గుతున్నారు? సరిహద్దులు భద్రంగా వుంటే మన సైనికుల వాహనాన్ని ఉగ్రవాదులెలా పేల్చేశారు? చైనా సైనికుల సంఘర్షణలో మెరికల్లాంటి మన వీర జవానులెందుకు అమరులయ్యారు? చిన్న దేశం నేపాల్‌ గూడా, మన భూభాగాన్ని సైతం తమ మ్యాప్‌లో చేర్చి పార్లమెంట్లో ఆమోదాన్నెలా పొందగలిగింది ?
     భారతీయులు తల వంచుకునే పనులేవీ చేయలేదని తమరు ప్రకటించుకున్నారు! కానీ...గోమాంసం తిన్నారన్న నెపంతో జరిపిన ముస్లింల హత్యలను...చర్చిలపై దాడులను నిరసిస్తూ అమెరికాకు చెందిన 'వాషింగ్టన్‌' పత్రిక మిమ్మల్ని దుయ్యబట్టింది.
స్వీడన్‌కు చెందిన 'వి డెమ్‌' పరిశోధనా సంస్థ మీ పాలన గూర్చి చేసిన వ్యాఖ్యలివీ. ''మోడీ పాలనలో, భారతదేశపు మీడియా, పౌర సమాజం, ప్రతిపక్ష పార్టీలు, నిరసనకారులు...తీవ్ర అణచివేతకు గురవుతున్నారు. భారత్‌ ప్రజాస్వామ్య దేశమనే గుర్తింపును కోల్పోవటానికి ఎక్కువ కాలం పట్టదు'' అని వ్యాఖ్యానించింది.
    రైతు ఉద్యమకారులున్న చోట మీరు ఇంటర్నెట్‌ను తొలగించిన సందర్భంలో వివిధ దేశాల వారే కాక, ''భారత్‌ లో మానవ హక్కులు నానాటికీ దిగజారుతున్నామంటూ 'ఐరాస' హక్కుల సంఘం ఆందోళన వెలిబుచ్చింది !
    2013 నాటికి ఏడు దశాబ్దాలుగా గత పాలకులు చేసిన స్వదేశీ + విదేశీ అప్పు మొత్తం రూ. 58,59,331 కోట్లు. కాగా మీ ఎనిమిదేళ్ళ హయాంలో మీరు చేసిన విదేశీ + స్వదేశీ అప్పు మొత్తం రూ. 94,58,579 కోట్లు !
     అమెరికా లోని 'కాటో' అనబడే పరిశోధనా సంస్థ నివేదిక 2021 ప్రకారం స్వేచ్ఛా సూచికలో భారత్‌ 2013 నాటికి ఉన్న 75వ స్థానాన్ని కోల్పోయి...మీ హయాంలో 111వ స్ధానానికి పడిపోయింది. మానవాభివృద్ధి సూచికలో గతంలో 129వ స్థానం నుండి మీ హయాంలో 131వ స్థానానికి పడిపోయింది. పత్రికా స్వేచ్ఛ సూచికలో 180 దేశాలకుగాను భారత్‌ 150వ దేశంగా నిలిచింది. మోడీజీ...ఇవన్నీ భారతీయులు తల దించుకునే పనులా? తల ఎత్తుకునే పనులా? విమర్శలలోకెల్లా గొప్పదైన ఆత్మ విమర్శ చేసుకోండి మోడీజీ !

/ రచయిత సెల్‌ : 9849081889 /
పాతూరి వెంకటేశ్వరరావు

పాతూరి వెంకటేశ్వరరావు