ప్రజాస్వామ్యంలో భావ ప్రకటనా స్వేచ్ఛ పత్రికల పాత్ర గురించి ఎంతగానో ఉద్ఘోషించే మన పాలకులు అది తమను ఆక్షేపించేదిగా తయారైనప్పుడు ఎంత అప్రజాస్వామికంగా మారిపోతారో ఇప్పుడు ప్రపంచమంతా చూస్తున్నది. మీడియాకు తోడు సోషల్ మీడియా కూడా విస్తరించిన తర్వాత ఇది మరింత తీవ్ర రూపం దాల్చింది. ఒకప్పటి సోవియట్ యూనియన్‌లో గాని, ఇప్పటి చైనాలో గాని ఎవరైనా రచయితను లేదా పాత్రికేయులను ప్రశ్నిస్తే ప్రపంచమంతటా గగ్గోలు పెట్టేవారు తమ వరకూ వచ్చేసరికి అంతా అంతర్గత వ్యవహారమని సరిపెట్టడం ఆశ్చర్యం కలిగించే వాస్తవం. నచ్చని దేశాలలో ఎన్నికలు సరిగ్గా జరగలేదని, అరాచకం పెరిగిందని సైనిక జోక్యాలకు పాల్పడిన అమెరికా తమ శ్వేతసౌధం మీద దాడిని మాత్రం అంతర్గత వివాదంగానే చూడటం గాని, లేదంటే మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యక్తిగత దుస్సాహసంగానే చిత్రించడంగాని యాదృచ్ఛికం కాదు. ఆయన అధ్యక్షుడుగా వున్నప్పుడు మీడియా వారిపై అధికారికంగా దాడి చేయడం, వారితో మాట్లాడబోనని తిప్పి పంపడం, సోషల్ మీడియాపై ఆంక్షలు పెట్టడం, మరో వైపున అదే వేదిక ద్వారా తన ప్రత్యర్థులపై విష ప్రచారం చేయడం ప్రపంచమంతా చూసింది. తొలి దశలో ఒకటి రెండు మీడియా సంస్థలు ఆయనకు అనుకూలంగా కథనాలు ఇవ్వడమూ సంభవించింది. తర్వాత అదే సంస్థల బాధ్యులను పిలిపించి మందలించిన ఉదంతం కూడా వుంది. తన దాకా వస్తేగాని తెలియదన్నట్టు ప్రపంచ దేశాలకు ప్రజాస్వామ్యం, పత్రికా స్వేచ్ఛ గురించి సుద్దులు చెప్పిన అగ్రరాజ్యం ఆధిపత్యం ప్రధానంగా వ్యవహరించింది. అంటే మీడియా పట్ల పాలకుల తీరు, మీడియాధిపతుల పాక్షిక ధోరణులు కూడా బహిర్గతమైన సందర్భమిది.
భారతీయ మీడియా దృశ్యం పాలకుల ద్వంద్వ ప్రవర్తన ఇందుకు పెద్ద భిన్నంగా లేకపోగా మరింత ఘోరంగా గోచరిస్తున్నది. జాతీయ స్థాయిలో ప్రసిద్ధులైన సంపాదకులు, విలేకరులు, వ్యాఖ్యాతలు కూడా మోడీ ప్రభుత్వ దారుణ వేధింపులకు గురవుతున్నారు. 70 రోజులు పైబడి సాగుతున్న రైతాంగ నిరసనల ను మీడియా ఉపేక్షించినంత కాలం కేంద్రానికి హాయిగా వుండింది. కాని ఉద్యమం ఉధృతం కావడం, మీడియా-సోషల్ మీడియాలో స్పందన పెరగడంతో ప్రభుత్వం నిజ స్వరూపంతో బయిటపడింది. వారిపై నేరారోపణలు ఎఫ్‌ఐఆర్ లు, అరెస్టుల వరకూ వెళ్లింది. నిజానికి యు.పి లోని హత్రాస్ అత్యాచారం ఘటన జరిగాక అక్కడకు వెళ్లిన మళయాల జర్నలిస్టు సిద్దిక్ కప్పన్‌ను అరెస్టు చేసినప్పుడే ఇది మొదలైంది. దానికన్నా ముందు జమ్మూ కాశ్మీర్‌లో సంపాదకులే హత్యలకు గురైనారు. మొన్న జనవరి 26న రిపబ్లిక్ దినోత్సవాన ట్రాక్టర్ ర్యాలీతో నిరసన, ఎర్రకోట ఘటనలు దీన్ని పరాకాష్టకు చేర్చాయి. ర్యాలీలో నవ్రత్ సింగ్ అనే రైతు మృతి చెందడం, ఎర్రకోటపై పతాకాలు ఎగరేయడం గురించి అధికార కథనాలు మీడియా లోనూ కొన్ని సోషల్ మీడియా సైట్లలోనూ విపరీతంగా ప్రచారమైనాయి. జాతీయ పతాకానికి ఏదో అపచారం జరిగినట్టు అబద్ధాలు వ్యాప్తి చేశాయి. అయితే ఇది ఎంతో సేపు సాగలేదు. జాతీయ పతాకం జోలికి పోలేదనీ, ఎగరేసిన సిక్కు పతాకం కూడా సైనిక కవాతుల లోనూ ఉపయోగించేది తప్ప ఖలిస్తాన్ పతాక కాదని స్పష్టమైంది. అన్నిటినీ మించి వారిని ఎర్రకోట పైకి వదలడంలో వక్రనీతి కూడా వెల్లడైంది. ఇక ట్రాక్టర్ ర్యాలీకి సంబంధించి రైతులను అనుమతించిన దారులలో కూడా బ్యారికేడ్లు పెట్టడం ద్వారా ప్రభుత్వమే ఉద్రిక్తత పెంచిందని కూడా తేలిపోయింది. రైతు మృతి కూడా ట్రాక్టర్ బోల్తా వల్లనే కాదని, అతని మృతదేహంలో బుల్లెట్లు వున్నాయని తాత హరదీప్ సింగ్ చెప్పినట్టు ప్రముఖ జర్నలిస్టులు ట్వీట్లు పెట్టారు. ఇదే ఏలిన వారికి మహాపరాధమై పోయింది. రాజ్‌దీప్ సర్దేశారు, సిద్ధార్థ వరదరాజన్, మృణాల్ పాండే వంటి ప్రముఖ సంపాదకులపై నేరారోపణ చేస్తూ మొత్తం 29 ఎఫ్‌ఐఆర్‌లు రూపొందించారు. 'వైర్'కు వార్తలు పంపే మణిదీప్ కనియాను అరెస్టు చేశారు. తనకు బెయిల్ రావడానికి ఎంతో పోరాటం అవసరమైంది. కేంద్రంతో పాటు కర్ణాటక, ఉత్తర ప్రదేశ్‌ల లోని బిజెపి ప్రభుత్వాలు కూడా ఈ కేసులు, అరెస్టులు, వేధింపులలో భాగం పంచుకున్నాయి. దేశ ద్రోహం, మతాల మధ్య చిచ్చు పెట్టడం, పోలీసుల స్థయిర్యాన్ని దెబ్బతీయడం వంటి తీవ్రమైన ఆరోపణలు మోపడం ద్వారా వారిని భయపెట్టే ప్రయత్నం చేశాయి. ఇదంతా ఎమర్జన్సీని తలపిస్తున్నదని 'ఎడిటర్స్ గిల్డ్' విమర్శించింది. పాత్రికేయ సంఘాలు కూడా ఖండించాయి.
ఇంతటితో ఆగక సోషల్ మీడియాలో రైతు ఉద్యమానికి మద్దతు తెలిపిన ప్రముఖుల పైన కూడా కేంద్రం విరుచుకు పడింది. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ సోదరి మీరా హారిస్, పర్యావరణవేత్త గ్రెటా ధన్‌బర్గ్, కాంగ్రెస్ సభ్యుడు జిమ్ కోస్టా, పోర్న్ స్టార్ మియా ఖలీఫా, పాప్ సింగర్ రిహానా వంటి వారు ఈ ఉద్యమాన్ని బలపర్చారు. బాలీవుడ్ సెలబ్రటీలు కూడా బలపర్చారు. వెంటనే కేంద్ర మంత్రులు, బిజెపి అగ్రనేతలు వరుసగట్టి ఉద్యమంపై మలి దాడికి దిగారు. ఇదేదో భారత వ్యతిరేక కుట్ర అంటూ పల్లవి ఎత్తుకున్నారు. తామే గాక క్రికెట్ స్టార్ సచిన్ టెండూల్కర్‌తో సహా చాలామందిని రంగంలోకి దింపారు. ఈ ఉద్యమానికి సంబంధించిన 257 ఖాతాలను స్తంభింపచేయాలని ట్విటర్‌కు ఆదేశాలిచ్చారు. సిపిఎం, ఆమ్ ఆద్మీ పార్టీలతో పాటు అనేక ప్రజాసంఘాలకు చెందిన ట్విటర్ అకౌంట్లు ఆపేయాలని 18 పేజీల ఉత్తర్వును సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. రైతు ఉద్యమం పట్ల తగు విధంగా వ్యవహరించే అధికారం తమకుందని, ఇతరులు జోక్యం చేసుకోరాదని ట్విటర్ కేవలం మధ్యవర్తి వంటిది మాత్రమేనని అందులో పేర్కొన్నారు. దేశ అంతర్గత విషయాలలో జోక్యం వద్దని చెప్పొచ్చు గాని ప్రజాస్వామిక ఉద్యమాలకు సంఘీభావాన్ని ఎలా అడ్డుకుంటారు? ఇదే ట్విటర్‌లో ప్రభుత్వాన్ని ప్రశంసించినపుడు ఎంతగా ప్రచారం చేసుకున్నారు?
ఇప్పుడు మనం నాణేనికి మరోవైపు చూస్తే రైతు ఉద్యమంపైన గాని, సిఎఎ వ్యతిరేక ఉద్యమంపైన గాని కట్టుకథలు ప్రచారం చేసిన ఆర్ణబ్ గోస్వామి రిపబ్లిక్ టీవీ వంటి వాటి పట్ల కేంద్రం ఎంత పక్షపాతం చూపింది? ఆఖరుకు కరోనా వ్యాప్తిని కూడా మత కోణంలో మలిచి విద్వేష ప్రచారం చేస్తుంటే ఎంతగా ప్రోత్సహించింది? ఒక పాత ఆరోపణలో గాని టిఆర్‌పి స్కాంలో గాని ఆర్ణబ్ అరెస్టయితే సాక్షాత్తూ హోంమంత్రి అమిత్‌షాతో సహా పాలకపార్టీ ప్రముఖులంతా ఎలా మోహరించారు? సిద్దిక్ కప్పన్ విషయంలో జోక్యం చేసుకోని సుప్రీం కోర్టు కూడా తనకోసం ఆగమేఘాల మీద ఎలా రంగంలోకి దిగి బెయిల్ మంజూరు చేసింది? ప్రసార భారతికి చెందిన 12 కోట్లకు పైగా విలువైన ప్రీబ్యాండ్ విడ్త్‌ను రిపబ్లిక్ టీవీ యథేచ్ఛగా వాడుకోవడం ఎలా అనుమతించబడింది? దేశ రక్షణకు సంబంధించిన ప్రధాని కార్యాలయ వ్యూహాత్మక నిర్ణయాలు ఆర్ణబ్ కు ముందే ఎలా తెలిశాయి? ఇది దేశ భద్రతకు ముప్పు కాలేదా? భారత చైనా సరిహద్దు వివాదంలో యుద్ధం వచ్చేసినట్టే ఆయన ఇచ్చిన కథనాలకు తర్వాత కాలంలో రెండు దేశాల మధ్య సంప్రదింపుల క్రమం పునరుద్ధరించబడటానికి ఏదైనా సాపత్యం వుందా? తబ్లిగీ జమాత్ వల్లనే దేశంలో కరోనా వ్యాపించినట్టు సాగిన ప్రచార దుమారాన్ని తర్వాత సుప్రీం కోర్టు కొట్టిపారేయడం నిజం కాదా? ఈ బాధ్యతా రహిత ప్రసారాలను అడ్డుకునే పద్ధతులేమిటని కేంద్రాన్ని ప్రశ్నించాల్సి వచ్చింది కదా! మీడియా నియంత్రణకు వ్యవస్థ వుంది గాని సోషల్ మీడియాకే ఏర్పాటు జరగాలని కేంద్రం తరపున అటార్నీ జనరల్ చెప్పడం మళ్లీ ఇటువైపు దాడికే దారి తీసే ప్రమాదం కూడా తొంగిచూస్తున్నది కూడా.
మీడియాతో పాటు సినిమాలు, ఓటిటి లో కూడా 'తాండవ్' వెబ్ సిరీస్‌లో ఒక పాత్రధారి శూలం ధరించి ఆజాదీ నేరమంటూ నిరంకుశ పాలకులను అపహాస్యం చేసే దృశ్యం పైనా సంఘపరివార్ దాడి చేయడం, యు.పి సర్కారు నోటీసులివ్వడం మరో కోణం. ప్రభాస్ హీరోగా మరోసారి రాముడి కథను 'ఆదిపురుష్' పేరిట భారీ ఎత్తున నిర్మిసున్న నేపథ్యంలో రావణ పాత్రధారి సైఫ్‌అలీఖాన్ ఆ పాత్రలో మానవీయ కోణాలు కూడా ఆవిష్కరిస్తామని చెప్పడం మహానేరమై క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. రావణుడు, దుర్యోధనుడు వంటి పాత్రలు ధరించిన ఎన్టీఆర్‌ను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్న తెలుగు వాళ్లకు ఇది మరింత విడ్డూరంగా అనిపిస్తుంది. ఇలాంటి ఉదాహరణలు ఇంకా చాలా వున్నాయి. తెలుగునాట కూడా విమర్శక మీడియాపై గత, ప్రస్తుత పాలకుల అసహనాలు ఆంక్షలు ఒకవైపు, బిజెపి కి వంత పాడే మీడియా పోకడలు మరోవైపు కనిపిస్తూనే వున్నాయి. ఈ క్రమంలోనే అసలైన వివాదాలు మరుగునపడి ఆలయాల దాడులు అంతా నిండిపోతున్నాయి. ఈ పరిస్థితులలో మీడియా స్వేచ్ఛను కాపాడుకోవడం, ప్రజాస్వామికంగా ఉపయోగించుకోవడం పెద్ద సవాళ్లుగా మారుతున్నాయి.
- పీపీ










