Jul 06,2023 06:12
  • మన దేశంలో పుణ్యక్షేత్రాలకు, తీర్థయాత్రలకు వెళ్లేవారు కోకొల్లలు.. ఉన్న ఊళ్లో పిల్లికి బిచ్చం వేయని వాళ్లు కూడా అక్కడ.. బారులు తీరిన యాచకుల కోసం ఇక్కడి నుండే ఎంతోకొంత మూట గట్టుకుని వెళతారు. అదేదో పుణ్యకార్యంలా భావించి ఏడాది పొడుగునా చిల్లర నాణేలు పోగేసేవాళ్లు కూడా చాలామందే ఉంటారు. వారందరిలాగానే ఒరిస్సాకు చెందిన చంద్ర మిశ్రా (59) ఉత్తర భారతదేశ యాత్రకు బయల్దేరారు. వారణాసి చేరుకున్న ఆమెకి గుంపులు గుంపులుగా, ఎక్కడ పడితే అక్కడ బారులు తీరిన యాచకులు కనిపించారు. అయితే అందరిలా వారికి ఎంతోకొంత సాయం చేసి చేతులు దులుపుకోవాలని ఆమె అనుకోలేదు. ఆ క్షణంలో ఆమె తీసుకున్న ఓ నిర్ణయం వారి జీవితాల్లో పెద్ద మార్పుకు దారితీసింది. ఏళ్లతరబడి యాచక వృత్తి చేస్తున్న ఆ కుటుంబాలు ఇప్పుడు వ్యాపారవేత్తలుగా మారి సమాజంలో గౌరవప్రదమైన జీవితం గడుపుతున్నాయి. ఏమిటా నిర్ణయం..?

ఒడిశాలో ఓ మారుమూల గ్రామంలో నివసించే చంద్ర జర్నలిస్టు వృత్తి చేసేవారు. కొన్నేళ్లకు ఆ వృత్తికి స్వస్తి పలికి సామాజికవేత్తగా మారారు. సామాజిక వేత్తగా ప్రయాణించడం మొదలుపెట్టిన తరువాత ఒడిశాతో పాటు ఛత్తీస్‌గఢ్‌, బీహార్‌, హర్యానా, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాలతో అనుసంధానమై నిరుద్యోగ ఉపాధి పథకాల్లో పనిచేయడం ప్రారంభించారు. అందులో భాగంగానే 2020లో వారణాసి వెళ్లారు. అక్కడ యాచకులను చూసి తీవ్ర ఆవేదనకు గురైన ఆమె ఇంటిని సైతం విడిచిపెట్టి అక్కడే ఉండిపోయారు. యాచకుల జీవితాల్లో మార్పు కోసం 2021లో 'బెగ్గర్స్‌ కార్పొరేషన్‌'ను ప్రారంభించారు. అయితే యాచకులను అందులో భాగస్వామ్యం చేయడం కత్తిమీద సామే.. ఎన్నో ప్రయాసలు కోర్చిన తరువాత 12 యాచక కుటుంబాలు చంద్రతో కలసినడిచేందుకు అంగీకరించాయి.

  • ఏడాదిలో పదిరెట్లు సంపాదించారు..

కార్పొరేషన్‌ ద్వారా ల్యాప్‌టాప్‌ బ్యాగులు, కాన్ఫరెన్స్‌ బ్యాగులు, షాపింగ్‌ బ్యాగులు తయారుచేయడం నేర్పించారు. తయారైన ఉత్పత్తులను మార్కెటింగ్‌ చేయడం కోసం అనేక హోటల్స్‌, మల్టీనేషనల్‌ కంపెనీలతో ఒప్పందం చేసుకున్నారు. మొత్తం ఉత్పత్తులు తయారుచేసేందుకు మొదట రూ.5.7 లక్షల పెట్టుబడిని సమకూర్చి పెట్టారు చంద్ర. యాచకులు తయారుచేసిన బ్యాగులకు మార్కెట్లో పెద్ద గిరాకీ ఏర్పడడంతో ఏడాది సమయంలోనే అంతకు పదింతల లాభాన్ని సంపాదించారు.

  • స్థిరమైన ఆదాయంతో..

'లాభాలు వచ్చిన వెంటనే పెట్టుబడి పెట్టిన మొత్తం సొమ్మును తిరిగి ఇచ్చేశారు. యాచకుల పట్ల సమాజంలో చాలా చులకన భావం ఉంది. అది మారాలి. అదే నా తాపత్రయం. నేను ప్రారంభించిన ఈ కార్పొరేషన్‌ ద్వారా ప్రస్తుతం చాలా తక్కువ కుటుంబాలే మార్పు దిశగా ప్రయాణిస్తున్నాయి. నెలకు రూ.10 వేల స్థిరమైన ఆదాయంతో గౌరవప్రదంగా జీవిస్తున్నారు. మనలో చాలామంది యాచకులకు భిక్షం వేయడానికే పరిమితమౌతారు. వారికి ఉపాధి అవకాశం ఇవ్వాలని ఎవరూ ఆలోచించరు. కానీ అవకాశం ఇస్తే వారిలో అభివృద్ధిని చూస్తాం. నిరుద్యోగ అంశంపై పనిచేసేందుకు నేను కాశీ వెళ్లినప్పుడు అక్కడ ప్రతి ఆలయం ముందు 500 మీటర్ల దూరం వరకు యాచకులు భిక్ష కోసం వేచి చూస్తున్నారు. వారందరినీ అలా చూసే సరికి నాలో ఏదో తెలియని బాధ ఆవహించింది. వారితో మాట్లాడేందుకు ఇంటిని వదిలిపెట్టేశాను. ఘాట్‌ సమీపంలో నివసించాను. ప్రతి రోజూ వారిని కలిశాను.

  • ఆమే మొదటి సభ్యురాలు..

కార్పొరేషన్‌ ఏర్పాటు చేశాక మొట్టమొదట ఓ తల్లీబిడ్డ నాతో కలిసివచ్చారు. వేరే మహిళను పెళ్లి చేసుకున్న ఆమె భర్త తనని విడిచిపెట్టాడు. ఆదరించేవారు లేక ఆమె తన 12 ఏళ్ల బిడ్డతో కాశీకి చేరి యాచకవృత్తి ప్రారంభించింది. ఎన్నో రోజులు వారితో మాట్లాడితే కానీ ఈ విషయాలు చెప్పలేదు. ఎప్పుడైతే నేను కార్పొరేషన్‌ ద్వారా ఉపాధి చూపిస్తానని చెప్పానో ఆమె ఎంతో సంతోషించింది. మొట్టమొదట తన పేరే నమోదు చేయించింది. ఆ తరువాత మరో 12 కుటుంబాలు నాతో కలిశాయి. మొట్టమొదట 500 బ్యాగులు తయారు చేయించే ఆర్డరును ఇచ్చాను. 10 రోజుల్లో పూర్తిచేశారు. అది చాలా కష్టం. కానీ పగలు, రాత్రి కష్టపడి పనిచేశారు. ఫలితం సాధించారు. ఆర్డరు పూర్తయ్యాక కంపెనీవాళ్లు ఇచ్చిన మొత్తాన్ని వారి చేతుల్లో పెట్టినప్పుడు వారి కళ్లల్లో కనిపించిన ఆనందం నాకిప్పటికీ గుర్తుండిపోయింది' అంటున్న చంద్ర ప్రారంభించిన 'బెగ్గర్స్‌ కార్పొరేషన్‌' ఈ ఏడాది ఏప్రిల్‌లో స్టార్టప్‌ ఇండియా సహకారంతో లెమన్‌ ఐడియాస్‌ నిర్వహించిన ఇన్నోప్రెన్యూర్స్‌ గ్లోబల్‌ స్టార్టప్‌ కాంటెస్ట్‌లో 'బెస్ట్‌ సోషల్‌ ఇంపాక్ట్‌' అవార్డు అందుకుంది.
యాచకుల జీవితాల్లో మార్పు కోసం చంద్ర చేసిన ప్రయత్నం చిన్నదే కావొచ్చు.. కానీ అది వారి జీవితాలను గొప్పగా ప్రభావితం చేసింది. ఆకలిగా ఉన్నవాడికి చేపల కూర వండిపెట్టడం కంటే చేపలు పట్టడం నేర్పితే వారి జీవితానికి గొప్పగా ఉపయోగపడుతుందన్న సత్యాన్ని చంద్ర నిజం చేసి చూపించారు.