Feb 20,2023 13:42

న్యూఢిల్లీ  : అదానీ సంస్థకు మరిన్ని రుణాలు మంజూరు చేసేందుకు బ్యాంక్‌ సిద్ధంగా ఉందని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా  సిఇఒ, మేనేజింగ్‌ డైరెక్టర్‌ సంజీవ్‌ చద్దా పేర్కొన్నారు.  బ్యాంక్‌ పూచీకత్తు ప్రమాణాలను సక్రమంగా పాటిస్తే రుణాలు మంజూరు చేసేందుకు   అభ్యంతరం లేదని అన్నారు. స్టాక్‌ మార్కెట్‌లో అదానీ గ్రూప్‌ ఎదుర్కొంటున్న అస్థిరత గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. మీడియాకిచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చద్దా ఈ వ్యాఖ్యలు చేశారు. అదానీ గ్రూప్‌కు ఇచ్చిన రుణాల వివరాలను వెల్లడించేందుకు ఇటీవల ఆయన నిరాకరించిన సంగతి తెలిసిందే. అయితే ఈ నెల ప్రారంభంలో అదానీ గ్రూప్‌కు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నిబంధనలకు లోబడి అనుమతించబడిన రుణాలు నాలుగింట ఒకవంతు ఉండవచ్చని సమాచారం. 

అతిపెద్ద మురికివాడ అయిన ధారావి పునరుద్ధరణ ప్రాజెక్ట్‌ను అదానీ గ్రూప్‌ దక్కించుకున్న సంగతి తెలిసిందే. రూ.5 వేల కోట్లకు ఈ ప్రాజెక్ట్‌ను అదానీ గ్రూప్‌ దక్కించుకుంది. ఈ ప్రాజెక్ట్‌ కోసం అదానీ గ్రూప్‌నకు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా రుణం ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తోందని చద్దా తెలిపారు. కొన్ని పరిమితులకు లోబడే రుణాలు మంజూరు చేస్తామని చెప్పారు. ఇటీవల అదానీ కంపెనీ అక్రమాలు, స్టాక్‌ మార్కెట్‌ మోసాలపై హిండెన్‌ బర్గ్‌ ఓ నివేదికను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అదానీ గ్రూప్‌ లిస్టెడ్‌ సంస్థలు మార్కెట్‌ విలువలో 120 బిలియన్లు కోల్పోయాయి.