May 18,2023 09:58
  • అప్పు కట్టినా నగదు జప్తు
  • కెనరా బ్యాంకు నిర్వాకంపై మహిళ ఆవేదన

ప్రజాశక్తి-శ్రీకాళహస్తి: బ్యాంకింగ్‌ రంగ సంస్థలు ఎంతో పారదర్శకంగా ఉంటాయన్నది ప్రజల నమ్మకం..అక్కడ మోసాలు జరగవని, మనం దాచుకునే డబ్బుకు, తీసుకునే రుణాలకు భద్రత ఉంటుందనే ప్రగాఢ విశ్వాసం..అందుకే ప్రజలు చెమటోడ్చి తమ సొమ్మును అక్కడ దాచుకుంటారు..తీసుకున్న రుణాలను సకాలంలో తీర్చేస్తుంటారు. అయితే చేతివాటం ప్రదర్శించే కొందరు సిబ్బంది వల్ల బ్యాంకుల ప్రతిష్ట దెబ్బతింటోంది. చదువురాని వారిని లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి సంఘటనే శ్రీకాళహస్తి కెనరా బ్యాంకులో చోటు చేసుకుంది. వివరాల్లోకి పోతే.. తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం చిట్టత్తూరు గ్రామానికి చెందిన దాసరి మునెమ్మ ఖాతానంబర్‌-5061101001685 తో కెనరా బ్యాంకులో ఆర్థిక లావాదేవీలు నడుపుతున్నారు. వ్యవసాయ అవసరాల నిమిత్తం బంగారుపై రుణం తీసుకుని తీర్చేస్తూ వస్తున్నారు. అలా 2020 నవంబరు 8న రూ.30 వేలు, 2021 నవంబరు 15న రూ.45 వేలు రుణం తీసుకుని తీర్చేశారు. చివరగా తీసుకున్న రుణాన్ని నిర్ణీత గడువు 2022 నవంబర్‌ 14లోపే కట్టేయడంతో తిరిగి ఆమెకు అదే నెల 23వ తేదీ బ్యాంకు అధికారులు కొత్త రుణాన్ని మంజూరు చేస్తూ రూ.49 వేలు ఆమె ఖాతాలో జమ చేశారు. అయితే అప్పటికే ఆమె ఖాతాలో కుమార్తె పెళ్లికోసం దాచుకున్న రూ.50 వేలతో కలిపి మొత్తం లక్ష వరకు నగదు నిల్వ ఉంది. అందులోంచి 2023 ఫిబ్రవరి 8న ఆమె రూ.48 వేలు డ్రా చేశారు.2023 ఏప్రిల్‌ 10న కుమార్తె పెళ్లి కోసం మరో రూ.1.60 లక్షలు తన ఖాతాలో జమ చేశారు. ఈ క్రమంలో ఆమె ఖాతాలో మొత్తం రూ.2.20 లక్షల నగదు ఉండగా, బ్యాంకు అధికారులు అదేరోజు రూ.51,489 కట్‌ చేశారు. ఆ తర్వాత ఆమె అదే నెల 17న తన నగదును తనిఖీ చేయగా ఖాతాలో రూ.1.71 వేలు మాత్రమే ఉండటంతో కంగుతున్నారు.
ఇదేంటని బ్యాంకు అధికారులను ప్రశ్నించగా ముందు తీసుకున్న గోల్డ్‌ లోను తీర్చలేదని, అందుకే ఫీల్డ్‌ ఆఫీసర్‌ ఖాతా నుంచి రుణ మొత్తాన్ని పట్టుకున్నట్లు వివరించారు. తాను నిర్ణీత గడువుకు ముందే పాత రుణాన్ని తీర్చేశానని, తర్వాతే నాకు కొత్త రుణం ఇచ్చారని మునెమ్మ ఎంత మొత్తుకున్నా బ్యాంకు అధికారులకు పట్టకపోవడం గమనార్హం. ఇదిలా ఉంటే పాత రుణం తీరకుండా కొత్త రుణం ఎలా ఇస్తారనేది ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది. తాను చదువుకోలేదని బ్యాంకు అధికారులు అప్పు కట్టేసినా తన ఖాతా నుంచి తనకు తెలియకుండా నగదు కట్‌ చేశారంటూ మునెమ్మ బ్యాంకు ఎదుట వాపోయింది.సంబంధిత బ్యాంకు ఉన్నతాధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలంటూ ప్రాధేయపడుతోంది.

  • రుణం కట్టినట్టు ఆధారాలు ఏమీ లేవు

మునెమ్మ తమ బ్యాంకులో తీసుకున్న రెండో కంతు రుణం తీర్చినట్లుగా ఆధారాలు ఏమీ లేవు. రుణం తీరకుండా కొత్త రుణం ఇవ్వడంపై విచారణ జరుపుతున్నాం. మునెమ్మ రుణం తీర్చినట్లుగా ఏదైనా ఆధారాలు తీసుకొస్తే న్యాయం జరిగే అవకాశం ఉంటుంది.
- విజయ్, కెనరా బ్యాంక్‌ డివిజనల్‌ మేనేజర్‌