ప్రజాశక్తి-రేపల్లె (బాపట్ల జిల్లా) : రుణమాఫీ వస్తుందని డ్వాక్రా సభ్యులను నమ్మించి, వారితో సంతకాలు చేయించుకుని పట్టణ రిసోర్స్ పర్సన్ (ఆర్‌పిలు) సుమారు రూ. 1.15 కోట్ల రుణాలు కాజేశారు. వీరికి బ్యాంకు అధికారులూ సహాయ, సహకారాలు అందించారు. తీసుకున్న రుణాలు చెల్లించకపోవడంతో డ్వాక్రా సభ్యులకు నోటీసులు అందడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
బాపట్ల జిల్లా రేపల్లె పట్టణంలోని 21వ వార్డుకు చెందిన ఇద్దరు ఆర్‌పిలు, మరో మహిళ సహకారంతో 2019 ఏప్రిల్ 11కు ముందు రుణాలు తీసుకుని రుణమాఫీ రాని డ్వాక్రా గ్రూపులను టార్గెట్ చేసుకుని.. మీకు రుణమాఫీ వస్తుందని డ్వాక్రా సభ్యులను నమ్మించి, వారితో సంతకాలు చేయించకున్నారు. మీకు ఒక్కొక్కరికి రూ.ఐదు వేల చొప్పున డబ్బులు వస్తాయని, మళ్లీ కట్టాల్సిన అవసరం లేని రుణాలిప్పిస్తామని మరికొంత మంది నిరక్షరాస్యులను నమ్మించారు. రేపల్లెలోని జిడిసిసి (గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్), కెనరా బ్యాంక్ అధికారులతో కుమ్మక్కై 11 గ్రూప్‌లకు కలిపి సుమారు రూ.1.15 కోట్లు రుణాలు తీసుకున్నారు. రుణాలు చెల్లించకపోవటంతో తర్వాత వచ్చిన బ్యాంక్ అధికారులు ఆర్‌పిలకు ఫోన్ చేశారు. వారు స్పందించకపోవటంతో గ్రూపు సభ్యులకు నోటీసులు పంపారు. దీంతో అక్రమాలు వెలుగుచూశాయి. జిడిసిసి బ్యాంకులోనూ, కెనరా బ్యాంకులోనూ ఒకే మహిళా సంఘం పేరు ఉంది. మెప్మా సిఎంఎంను వివరణ కోరగా..ఆర్‌పిలు అక్రమాలకు పాల్పడిన ఘటన వాస్తవమే అన్నారు. ఇప్పటికే ఇద్దరు ఆర్‌పిలను విధులకు దూరంగా ఉంచామన్నారు. ఆర్‌పిలు అక్రమంగా రుణాలు పొందిన మాట వాస్తవమేనని జిడిసిసి మేనేజర్ వెంకటరమణ తెలిపారు. తిరిగి డబ్బులు చెల్లించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.










