Jul 23,2023 15:53

అనగనగా పులిహోర అనే ఊరిలో పరమాన్నం అనే రైతు ఉన్నాడు. ఆ రైతుకి గులాబ్‌ జాం అనే కూతురు ఉంది. ఓ రాత్రి గారె, బూరె అనే ఇద్దరు దొంగలు పరమాన్నం ఇంట్లో దూరి, గులాబ్‌ జాంను ఎత్తుకుపోయారు. తెల్లారి చూసుకున్న పరమాన్నం, అతడి భార్య బొబ్బట్టు లబోదిబోమని మొత్తుకున్నారు. తమ కూతురు గులాబ్‌ జాంను తెచ్చినవారికి ఆమెనిచ్చి పెళ్లి చేస్తామని టముకు వేయించారు. అంటే కజ్జికాయ మైకులో ఊరంతా చాటింపు వేయించారు.
ఈ టముకు లడ్డుండ అనే యువకుడు విని, తాను గులాబ్‌ జాంను తీసుకు వస్తానని బయలుదేరితే, వాళ్ళమ్మ అరిశె ప్రయాణంలో ఆకలైతే కొడుకు తినటానికి బాదం ఆకులో బజ్జీలు, అరిటాకులో అప్పాలు, తామరాకు దొన్నెలో చక్కెరపొంగలి, దాహం వేస్తే తాగటానికి మఱచెంబుడు జీడిపప్పు పాయసం మూటకట్టిచ్చింది. ఆ మూట తీసుకుని వెళ్లగా, వెళ్లగా, వెళ్లగా గవ్వలబస్తీ దాటీదాటకుండా చేగోడీపేట పొలిమేరలో ఆవడల అడవి మధ్యన ఒక పూతరేకుల పాక కనిపించింది.
ఆ పూతరేకుల పాకకు పప్పుచెక్కల అరుగులు, గవ్వల గడపలు, జిలేబీల కిటికీలు, గుమ్మానికి పంచదార చిలకల తోరణాలు ఉన్నాయి. ఆ పాక లోపల జంతికల గుంజకు కారప్పూస తాళ్లతో గులాబ్‌ జాం కట్టి ఉంది. గారె, బూరె దొంగలిద్దరూ గులాబ్‌ జాంను నేను పెళ్లి చేసుకుంటానంటే నేనని కొట్లాడుకుంటున్నారు.
అప్పుడు ఈ లడ్డుండ అనే యువకుడు తన మొలలో ఉన్న కాజా అనే బాకుతో కారప్పూస అనే తాళ్లను కోసి, గారె-బూరె దొంగలిద్దరినీ పొడిచి, గులాబ్‌ జాంను తీసుకువస్తుండగా దోవలో నెయ్యి కాలువ అడ్డం వచ్చింది. అప్పడాన్ని తెప్పగా చేసుకుని, ఊరమిరపకాయ తెడ్డుతో నేతికాలువ దాటి గులాబ్‌ జాంను తెచ్చి, వాళ్ళ నాన్న పరమాన్నంగారికి అప్పగించాడు లడ్డుండ. పరమాన్నం పరమానందంగా మైసూర్‌ పాక్‌ అనే మేళగాణ్ణీ, సున్నుండ అనే పురోహితుడిని పిలిచి, బెల్లపు అచ్చుల పెళ్ళిపీటల మీద, ఫేణీ అనే మంగళసూత్రంతో, బూందీ అనే అక్షింతలతో గులాబ్‌ జాంకి, లడ్డుండకూ ఘనంగా పెళ్లి జరిపించాడు.
పిల్లల్లారా, మనమంతా ఆ పెళ్ళికి వెళ్లి, అన్నిరకాల పిండివంటలు ఆరగించి వద్దాం రండి.
మామిడన్న శ్యామలాదేవి గారి ప్రచురితం కాని కథ (1933-2018)

శైలజ వల్లూరు (కుమార్తె)
99891 43615