Mar 03,2023 13:41

టాలీవుడ్‌లో కమెడియన్‌గా పేరు తెచ్చుకున్న ప్రియదర్శి హీరోగా నటించిన చిత్రం 'బలగం'. టీవీ షో 'జబర్దస్త్‌' కమెడియన్‌ వేణు యెల్దండి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ప్రొడక్షన్స్‌పై తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 3వ తేదీ శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. వేణు దర్శకత్వంలో తెరకెక్కిన తొలి చిత్రం ప్రేక్షకులను ఏమేరకు అలరించిందో తెలుసుకుందాం..!

కథ
తెలంగాణాలోని ఓ పల్లెటూర్లో ఉండే సాయిలు (ప్రియదర్శి)కి ఊరినిండా అప్పులే. తాను పెళ్లి చేసుకుంటే.. వచ్చే కట్నం డబ్బులతో అప్పులు తీర్చాలని ప్లాన్‌ వేసుకుంటాడు. సాయిలు పెళ్లికి సిద్ధపడి నిశితార్థం చేసుకునేలోపే తన తాతయ్య కొమరయ్య (సుధాకర్‌ రెడ్డి) సడెన్‌గా చనిపోతాడు. కొమరయ్యకు ముగ్గురు పిల్లలు. ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె. చిన్న చిన్న గొడవల వల్ల వీరందరూ విడిపోతారు. అయితే తండ్రి చావుతో... చివరిచూపు చూసుకోవడానికి పిల్లలందరూ వస్తారు. తండ్రిని కడసారి చూసేందుకు వచ్చినా... అక్కడ కూడా మళ్లీ అందరూ గొడవపడతారు. దీంతో సాయిలు పెళ్లి క్యాన్సిల్‌ అవుతుంది. ఇన్ని గొడవల మధ్యే మూడో రోజు కుమారులు తమ తండ్రికి పిండం పెడతారు. ఈ పిండాన్ని కాకులు ముట్టవు. కొమరయ్యకు తీరని కోరికల వల్లే కాకులు పిండం ముట్టడం లేదని... ఆ కోరికలను అతని కుటుంబ సభ్యులు తీర్చాలని, లేకపోతే అది ఊరికే నష్టం జరుగుతుందని, వాటిని తీర్చలేకపోతే ఆ కుటుంబాన్ని ఊరి నుంచి వెలేస్తామని గ్రామస్తులు హెచ్చరిస్తారు. మరి కొమరయ్య చివరి కోరికలేంటి? వాటిని తీర్చేందుకు సాయిలు చేసిన ప్రయత్నమేంటి? చివరకు కుటుంబ గొడవలు సద్దుమణిగి అందరూ ఒకటవుతారా? పెళ్లి క్యాన్సిల్‌ అయిన తర్వాత తన మేనత్త కుమార్తె సంధ్య (కావ్య కళ్యాణ్‌రామ్‌)ని సాయిలు ప్రేమిస్తాడు. మరి ఆ ప్రేమ సక్సెస్‌ అయి.. వాళ్లిద్దరూ ఒక్కటయ్యారా? వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ
'బలగం' సినిమా ఎలాంటి హంగులు లేకుండా... కమర్షియల్‌ ఆర్భాటాలు లేకుండా దర్శకుడు వేణు తెరకెక్కించారు. పల్లెటూరులోని మనుషుల మమకారాలు, గ్రామీణ జీవన నేపథ్యం, బంధాలను తెలిపే చిత్రమిది. దర్శకుడు ఈ కథను ఎంత నిజాయితీగా రాసుకున్నారో... అంతే స్పష్టంగా తెరకెక్కించారు. ఈ విషయంలో వేణుని అభినందించాల్సిందే. ఇక ఈ సినిమా విషయానికొస్తే.. కొమరయ్య పొద్దునే లేచి పొలం వెళ్లిరావడం.. ఊరి ప్రజలతో చమత్కారాలడడం వంటి సన్నివేశాలతో కథ ప్రారంభమవుతుంది. ఇక మనవడు సాయిలు పడే అప్పుల తిప్పలు.. ఆ అప్పుల బాధనుంచి తప్పించుకోవడానికి పెళ్లికి రెడీ అవ్వడం నిశ్చితార్థపు పనుల్లో ఉండగానే తాతయ్య మృతి చెందడంతో కథనంలో వేగం పెరుగుతుంది. కొమరయ్య చావు తర్వాత ఏళ్ల తరబడి పుట్టింటికి దూరమైన కుమార్తె తండ్రిని చూసేందుకు రావడం.. వచ్చిన తర్వాత ఆమె భర్తకు.. అన్నయ్యలకు మధ్య గొడవ జరగడం.. సాయిలు పెళ్లి ఆగిపోవడం వంటివి చూస్తే.. సన్నివేశాలన్నీ చాలా సహజంగా అనిపిస్తాయి. కొమరయ్య అంతిమయాత్రలో ఆ సందర్భానికి తగ్గట్టుగా వచ్చే పాట మనసుని హత్తుకుంటుంది. పెళ్లి క్యాన్సిల్‌ అయి తన అప్పులు ఎలా తీర్చుకోవాలా? అనుకుంటున్న సమయంలో మేనత్తకు ఆస్తులున్నాయని.. తన కుమార్తెను ప్రేమించి పెళ్లి చేసుకుంటే.. వచ్చే కట్న కానుకులతో అప్పులు తీర్చుకోవచ్చని సాయిలు అనుకుంటాడు. అలాగే మరదలు సంధ్యని ప్రేమిస్తాడు. అసలే ఇంట్లో గొడవలు జరుగుతున్న సమయంలో.. మరదల్ని ప్రేమించడం వంటి సన్నివేశాలు ఆసక్తిని కలిగిస్తాయి. ప్రేక్షకుడు ఊహించేంత ట్విస్టులేమీ లేకుండా విరామం వస్తుంది. ఇక సెకండాఫ్‌లో.. సెంటిమెంట్‌, బంధాలపైనే డైరెక్టర్‌ కథనాన్ని నడిపించాడు. మూడోరోజు, ఐదోరోజు పిండాన్ని ముట్టని కాకులు.. 11వ రోజుకల్లా కొమరయ్య కోర్కెలు తీర్చి.. కుటుంబంలోని కలహాలు చెదిరిపోయేలా.. అందరూ ఒక్కటయ్యేందుకు వచ్చే సన్నివేశాలన్నీ ఆకట్టుకుంటాయి. ముగింపులో వచ్చే బుర్రకథ హృద్యంగా ఉంది. మనవడు సాయిలు తాతయ్యపై ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తూ చెప్పే డైలాగ్‌లు ప్రేక్షకుడి కంట కన్నీరు తెప్పిస్తాయి. ఓవరాల్‌గా ఈ చిత్రం అందరూ చూడదగ్గది. థ్రిల్లింగ్‌ సన్నివేశాలు లేకపోవడం, క్లైమాక్స్‌ ప్రేక్షకుడు ఊహించిందే కావడం ఈ చిత్రానికి మైనస్‌. అలాగే ఎలాంటి వాణిజ్యాంశాలు జోడించకుండా అచ్చమైన పల్లెటూరి వాతావరణం, ఆయా పాత్రలకు తగ్గట్టుగా నటులను ఎంచుకోవడం దర్శకుడిలోని ప్రతిభకు నిదర్శనం. ఇందులో వేణు నూటికి నూరుపాళ్లు సక్సెస్‌ అయ్యాడు. నటుల ఎంపిక బాగానే ఉన్నా.. స్టార్‌డమ్‌ ఉన్న హీరో అయితే ఈ చిత్రం మరో స్థాయిలో ఉండేది.

balagam


ఎవరెలా చేశారంటే...
హీరోగా ప్రియదర్శి నటన ఆకట్టుకుంది. ఇక హీరోయిన్‌గా కావ్య కళ్యాణ్‌రామ్‌ నటనకు మంచి మార్కులు పడతాయి. తాతయ్యగా సుధాకర్‌రెడ్డి పాత్ర నిడివి తక్కువే అయినా ఆ పాత్ర ప్రభావం సినిమా మొత్తం కనిపిస్తుంది. మురళీధర్‌ గౌడ్‌, రూప లక్ష్మీ, జయరాం, విజయలక్ష్మీ, వేణు టిల్లుల నటన కూడా ఆకట్టుకుంది. తమ పాత్రలకు వీరు పూర్తి న్యాయం చేశారు. మ్యూజిక్‌ డైరెక్టర్‌ భీమ్స్‌ అందించిన సంగీతం హైలెట్‌గా నిలిచింది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.

balagam 2