న్యూఢిల్లీ: ప్రజలకు నమ్మకమైన సేవలందిస్తూ, మంచి లాభాల్లో నడుస్తున్న జాతీయ బీమా సంస్థలను బహుళజాతి కంపెనీలకు అప్పగించేందుకు మోడీ సర్కార్ పచ్చాజెండా ఊపింది. ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో బీమా సంస్థల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి వాటాను 49 శాతం నుండి 74 శాతానికి పెంచుతున్నట్లు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీంతో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన ఎల్‌ఐసి, జిఐసి సంస్థల తలుపులను బహుళజాతి సంస్థలకు బార్లా తెరిచారు. ఈ సంస్థల్లో 74 శాతం వాటాను ఎఫ్‌డిఐకి అనుమతించడమంటే మొత్తంగా ఆ సంస్థను బహుళజాతి సంస్థలకు అప్పజెప్పడమే. పాత యాజమాన్యం ఉన్నప్పటికీ వారికి నిర్ణయాలు తీసుకునే, సంస్థను నడిపించే అధికారాలు ఉండవు. వేల మంది ఉద్యోగుల భద్రత కూడా ప్రశ్నార్దకమౌతోంది. ఈ నిర్ణయానికి తోడు ఎల్‌ఐసి ఐపివోను ఈ ఏడాది ప్రారంభించనున్నట్లు సీతారామన్ చెప్పారు. అంటే ఈ ఏడాది నుంచి ఎల్‌ఐసి స్టాక్‌మార్కెట్ లిస్టింగ్‌లో ఉంటుంది. ఎల్‌ఐసి షేర్లను బహిరంగ మార్కెట్‌లో అమ్మడం ద్వారా కేంద్ర ప్రభుత్వం కొంత నిధులను సేకరించుకుంటుంది.










