Oct 24,2020 07:02

అక్టోబర్‌ 24, 2020 నాటికి ఐక్యరాజ్యసమితి 75 ఏళ్లు పూర్తి చేసుకోబోత్నుది. 1991లో సోవియట్‌ యూనియన్‌ చీలిపోయిన తరువాత ప్రపంచం 'ద్విధ్రువ ప్రపంచం' నుండి 'ఏక ధ్రువ ప్రపంచంగా మారిందని, అమెరికా తన సామ్రాజ్యవాద ఆధిపత్య సాధనకు యుఎన్‌ఓ ను సాధనంగా ఉపయోగించుకుంటున్నదని ఆరోపణలు వెల్లువెత్తాయి. యుఎన్‌ఓ (ఐరాస) ప్రత్యేక సంస్థలైన అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎమ్‌ఎఫ్‌), ప్రపంచ బ్యాంక్‌ (ఐబిఆర్‌డి), ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్యూటిఓ), సామ్రాజ్యవాద దేశాల ప్రయోజనాలు నెరవేర్చే సంస్థలుగా మారాయి. ప్రపంచీకరణ పేరుతో 'సామ్రాజ్యవాద ప్రపంచీకరణ' జరిగిందని క్యూబా మాజీ అధ్యక్షుడు ఫైడల్‌ క్యాస్ట్రో యుఎన్‌ఓ జనరల్‌ అసెంబ్లీ సమావేశంలోనే పేర్కొన్నారు. అమెరికా తన ఆధిపత్య రాజకీయాలలో భాగంగా...ఇరాన్‌, ఇరాక్‌, లిబియా, ఆఫ్ఘనిస్తాన్‌ మొదలైన దేశాల ఆంతరంగిక వ్యవహారాలలో జోక్యం చేసుకోవడమేకాక, యుఎన్‌ఓ ద్వారా ఆంక్షలు విధిస్తున్నది. ప్రస్తుత కరోనా సంక్షోభంలో కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అనుసరిస్తున్న విధానాలు, బెదిరింపులు, ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి బయటకు వెళ్లిపోవడం మొదలైన అంశాలన్నీ అమెరికా సామ్రాజ్యవాద ధోరణిని తెలియచేస్తున్నాయి.
                                                         ఐక్యరాజ్య సమితి నిర్మాణం
                 జూన్‌26, 1945లో శాన్‌ఫ్రాన్సిస్కోలో 51 దేశాల ప్రతినిధులు సమావేశమై ఐరాస ఒప్పందంపై సంతకాలు చేయటంతో...1945 అక్టోబర్‌ 24న ఐరాస ఆవిర్భవించింది. రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో మిత్ర రాజ్యాల నాయకులు రూజ్‌వెల్ట్‌, స్టాలిన్‌, చర్చిల్‌ మొదలగు వారు ప్రపంచ ప్రజల మద్దతు కూడగట్టడానికి...హిట్లర్‌, ముస్సోలినీ ఫాసిజాన్ని ఓడించటానికి...నానాజాతి సమితి కంటే బలమైన ప్రపంచ సంస్థను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి...అనేక సమావేశాలలో చర్చించాకనే యుఎన్‌ఓ ఏర్పాటు జరిగింది.
                 ఐరాస లో వున్న ఆరు అంగాలలో భద్రతా మండలి కీలకమైనది. భద్రతా మండలిలో మొత్తం 15 దేశాలు ఉంటాయి. ఐదు దేశాలకు శాశ్వత సభ్యత్వం వుండగా, పది దేశాలు అశాశ్వత సభ్యత్వం కలిగినవి. ఇవి రెండేళ్లకోసారి ఎన్నిక ద్వారా సభ్యత్వం పొందుతుంటాయి. శాశ్వత దేశాలైన అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌లకు 'వీటో' అధికారం ఉంటుంది. 'వీటో' అంటే 'తిరస్కరించుట' అని అర్ధం. ఐరాస ఆవిర్భావ సమయంలో సోవియట్‌ యూనియన్‌ ఒక్కటి సోషలిస్ట్‌ రాజ్యంగా ఉన్నది. మిగిలిన పెట్టుబడిదారీ దేశాల నుండి రక్షణ కోసం 'వీటో కోసం' సోవియట్‌ యూనియన్‌ పట్టుబట్టింది. సోవియట్‌ యూనియన్‌ 1945 నుండి 1990 వరకు అనేక సందర్భాలలో అభివృద్ధి చెందుతున్న భారతదేశం కోసం వీటో అధికారాన్ని ఉపయోగించింది. సూయజ్‌ కాలువ సంక్షోభం, క్యూబా సంక్షోభం, పాలస్తీనా సమస్య, దక్షిణాఫ్రికాలో జాతి వివక్షత మొదలైన అంశాలతో అమెరికా తదితర సామ్రాజ్యవాద దేశాలు తీసుకున్న వైఖరికి భిన్నంగా సోవియట్‌ యూనియన్‌ స్పష్టంగా ప్రజా ఉద్యములకు అండగా నిలబడింది. అవసరమైనప్పుడు వీటో అధికారాన్ని వినియోగించింది.


                                               ఐరాస పున:వ్యవస్థీకరణ - ఆవశ్యకత

ఐరాస భద్రతా మండలి నిర్ణయాధికారం వున్న సంస్థ. సాధారణ సభ (జనరల్‌ అసెంబ్లీ) ఆమోదించిన నిర్ణయాలను భద్రతా మండలి ఆమోదించాలి. ఆ సమయంలో శాశ్వత దేశాలు ఏవీ ఆ నిర్ణయాన్ని వీటో చేయరాదు. 1945లో ఐరాస 51 సభ్య దేశాలతో, భద్రతా మండలి 5+10 దేశాలతో ఏర్పడింది. ఇప్పుడు 2020లో సభ్య దేశాల సంఖ్య 193కి పెరిగింది. భద్రతా మండలి 5+10 గానే కొనసాగుతున్నది. భద్రతా మండలిలో వున్న 5 శాశ్వత దేశాలలో విశాలమైన ఆఫ్రికా ఖండానికి, దక్షిణ అమెరికా ఖండానికి ప్రాతినిధ్యమే లేదు. అందువలన శాశ్వత సభ్యత్వ దేశాల సంఖ్యను 10కి, అశాశ్వత సభ్యత్వ దేశాల సంఖ్యను 15కి పెంచాలని నిపుణులు కోరుతున్నారు. ఇప్పుడున్న శాశ్వత దేశాలతో పాటుగా భారత్‌, బ్రెజిల్‌, దక్షిణాఫ్రికా, జపాన్‌, జర్మనీలకు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని కోరుతున్నారు. దీనికోసం భారత్‌, బ్రెజిల్‌, జపాన్‌, జర్మనీలు జి-4 అనే చిన్న గ్రూప్‌గా ఏర్పడి పని చేస్తున్నాయి. దీనితో పాటు ప్రాధాన్యత కోల్పోయిన వీటో అధికారం బదులుగా...ముఖ్యమైన అంశాలపై సాధారణ సభ, భద్రతా మండలిలో మెజారిటీ-మైనారిటీ నిర్ణయాలు వోటింగ్‌ ఆధారంగా జరగాలని...అంతర్జాతీయ సంబంధాల నిపుణులు కోరుతున్నారు.
                                                 

                                                           అమెరికా ఆధిపత్య ధోరణులకు అడ్డుకట్ట
21వ శతాబ్ది ప్రపంచంలో ఆర్థికంగా, రాజకీయంగా ఎన్నో మార్పులు సంతరించుకున్నాయి. 1990వ దశకంలో 'ప్రపంచీకరణ' విధానాలు ప్రారంభించిన, సమర్థించిన దేశాలే ఇప్పుడు 'రక్షిత విధానాలు' కావాలంటున్నాయి. యూరోపియిన్‌ యూనియన్‌ నుండి బ్రిటన్‌ బయటకు రావలసిన (బ్రెగ్జిట్‌) పరిస్థితులు ఏర్పడ్డాయి. ఫ్రాన్స్‌ కూడా అనేక సందర్భాలలో అమెరికా విధానాలను వ్యతిరేకిస్తున్నది. అయినప్పటికి మిలటరీ, ఆర్థిక, సాంకేతిక రంగాలలో అమెరికా తన ఆధిపత్య విధానాలను కొనసాగిస్తున్నది. అమెరికా ధోరణులకు అడ్డుకట్ట వేయటానికి చైనా, రష్యా, భారత్‌, బ్రెజిల్‌ వంటి దేశాలు ఐరాస లో కూడా ఐకమత్యంతో పని చేయవలసిన అవసరమున్నది. దీనికోసం ఐరాస, భద్రతా మండలిలో ప్రజాస్వామీకరణకు అవసరమైన సంస్కరణలు, పునర్‌వ్యవస్థీకరణ చేపట్టాలి. సంస్కరణలకు అడ్డుపడే అమెరికా యత్నాలను తిప్పికొట్టాలి.
                                                                      బహుళపక్ష వేదిక
ప్రపంచ ప్రజలు, అన్ని ఖండాలు, అన్ని ప్రాంతాల అభిప్రాయాలను ప్రతిబింబించే బహుళపక్ష వేదికగా ఐరాస రూపొందాలి. సమకాలీన ప్రపంచంలో ఎదురవుతున్న సవాళ్లు-ముఖ్యంగా ప్రపంచ శాంతి, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు సాధించే...అణు నిరాయుధీకరణ, పర్యావరణం, ఉగ్రవాదం ఎదుర్కొనే సంస్థగా ఐరాస ను రూపుదిద్దాలి. కొందరి గుప్పిట్లో ఉండే సంస్థగా కాకుండా అందరి సంస్థగా మార్పు చెందాలి. ముఖ్యంగా ప్రపంచంలో సామ్రాజ్యవాద దోపిడి, విధానాల వలన దేశాల మధ్య అసమానతలు, ఆకలి, నిరుద్యోగం వెంటాడుతున్నాయి. ఉగ్రవాదం కూడా సామ్రాజ్యవాద విధానం వలనే పెరుగుతున్నది. ఒక అంతర్జాతీయ వ్యవహారాల నిపుణుడు 'అగ్రవాదమే ఉగ్రవాదం' అని వ్యాఖ్యానించాడు. ప్రపంచంలో అనేక చోట్ల అమెరికా అనుసరించిన అగ్రవాద విధానాలే ఉగ్రవాదానికి కారణమయ్యాయి. ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా ఖండాల లోని అభివృద్ధి చెందుతున్న దేశాలు గతంలో 'అలీనోద్యమం' పేరుతో తమ గళాన్ని వినిపించేవి. ఇప్పుడు ఈ దేశాలన్నీ ఐరాస ని వేదికగా చేసుకొని ఐకమత్యంతో యుఎన్‌ఓ ని బహుళపక్ష వేదికగా రూపొందించే విధంగా కృషి జరగాలి.

( వ్యాసకర్త శాసనమండలి సభ్యులు,

కె.ఎస్‌. లక్ష్మణరావు
సెల్‌ : 9440262072 )