Jan 31,2021 20:17

న్యూఢిల్లీ : మధ్యాహ్న భోజన పథకం దేశంలో లక్షలాది మంది పాఠశాల విద్యార్థులకు జీనాధారమని ఐరాస ప్రపంచ ఆహార కార్యక్రమం (డబ్ల్యూఎఫ్‌పి) భారత విభాగం స్పష్టం చేసింది. పాఠశాలలు పునప్రారంభించిన వెంటనే ఈ పథాకాన్ని వెంటనే అమలు చేయాల్సి అవసరం ఉందని తెలిపింది. మధ్యాహ్న భోజన పథకంపై దేశవ్యాప్తంగా సుమారు 10 కోట్ల మంది పాఠశాల విద్యార్థులు అధారపడి ఉన్నారని ఐరాస డబ్ల్యూఎఫ్‌పి భారత డైరక్టర్‌ బిషో పరజులి తెలిపారు. ఈ పథకం విద్యార్థుల ఆహార భద్రతకు, వారికి పోషకాహారం అందించడానికి ఉపయోగ పడుతుందని చెప్పారు. కోవిడ్‌ నిబంధనలతో ఈ పథకానికి అంతరాయం కలిగించడం విద్యార్థులపై దీర్ఘకాలిక ప్రతికూల ప్రభావం ప్రదర్శిస్తుందని ఒక ఐరాస అధ్యయనం వెల్లడించినట్లు పరజులి తెలిపారు. ముఖ్యంగా బాలికలు పాఠశాలలకు దూరంగా ఉండటం, లేదా పాఠశాలల నుంచి తొందరగా నిష్క్రమించడం వంటి ప్రమాదాలు ఎక్కువగా ఉన్నట్లు ఈ నివేదిక పేర్కొనట్లు తెలిపారు. లాక్‌డౌన్‌ సమయంలో విద్యార్థులు అనుభవించిన పేదరికాన్ని పరిష్కరించడానికి మధ్యాహ్న భోజన పథకం సహాయ పడుతుందని చెప్పారు. అలాగే తల్లిదండ్రులు తమ పిల్లల్ని ముఖ్యంగా బాలికల్ని పాఠశాలకు తిరిగి పంపించడానికి ఈ పథకం ప్రోత్సాహం ఇస్తుందని తెలిపారు.
కోవిడ్‌ ా19 నిబంధనలతో గత ఏడాది మార్చి నుంచి దేశవ్యాప్తంగా పాఠశాలలు మూసివేసిన సంగతి తెలిసిందే. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పుడిప్పుడే పాఠశాలలను తెరవడం ప్రారంభిస్తున్నారు.