- కనీస వేతనం రూ. 26 వేలు అమలు చేయాలి
- కాకినాడలో అడ్డుకున్న పోలీసులు
ప్రజాశక్తి- యంత్రాంగం : ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం రూ. 26 వేలు అమలు చేసి ప్రతి నెలా ఐదో తేదీలోపు వేతనాలు, బిల్లులు చెల్లించాలని, ప్రభుత్వమే వంట గ్యాస్ సరఫరా చేయాలని, ప్రమాద బీమా వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యాన రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం మధ్యాహ్న భోజన పథకం కార్మికులు ధర్నాలు చేపట్టారు. ర్యాలీలు నిర్వహించారు. తమ సమస్యలపై స్పందన కార్యక్రమంలో కలెక్టర్లకు, డిఆర్‌ఒలకు వినత పత్రాలు అందజేశారు.
కాకినాడలో ధర్నా చేసేందుకు వస్తున్న కార్మికులను అడ్డుకునేందుకు పోలీసులు విఫలయత్నం చేశారు. తొలుత కచేరిపేటలోని సుందరయ్య భవన్ నుంచి ర్యాలీగా బయలు దేరిన మధ్యాహ్న భోజన పథకం కార్మికులను అడ్డుకొని సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వా శేషబాబ్జి, జిల్లా కోశాధికారి మలకా రమణలను అరెస్టు చేశారు. ఈ సమయంలో కార్మికులకు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. కలెక్టరేట్‌వైపు దూసుకెళ్తున్న కార్మికులను డిఎస్‌పి ఆధ్వర్యంలో పోలీసులు అడ్డుకుని ఇంద్రపాలెం లాకులవద్దనున్న అంబేద్కర్ విగ్రహం వద్దకు తరలించారు. అక్కడే కార్మికులు బైటాయించి నిరసన తెలిపారు. సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జి బేబిరాణి మాట్లాడారు. శాంతియుత ఆందోళనలను పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. రాజమహేంద్రవరంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.అనంతరం కలెక్టర్ డాక్టర్ మాధవీలతకు వినతిపత్రం అందించారు.
విశాఖలోని జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన ధర్నాలో మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ (సిఐటియు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయా రమాదేవి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం కార్మికుల పట్ల తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. 20 సంవత్సరాల నుంచి ఈ పథకంలో పనిచేస్తున్నా కనీస వేతనం ఇవ్వకపోవడం దారుణమన్నారు.
అనకాపల్లి కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు గూనూరు వరలక్ష్మి మాట్లాడుతూ మార్కెట్‌లో పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెనూ ఛార్జీలను పెంచి ఇవ్వాలని, మధ్యాహ్న భోజన పథకానికి బడ్జెట్ కేటాయింపులు పెంచాలని డిమాండ్ చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో, రంపచోడవరం ఐటిడిఎ వద్ద ధర్నా చేశారు.
అన్నమయ్య జిల్లా రాయచోటిలో, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లా, శ్రీకాకుళం, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లా భీమవరం, కర్నూలు, నంద్యాలలో, కృష్ణా జిల్లా మచిలీపట్నం కలెక్టరేట్లు వద్ద, విజయవాడ అలంకార్ సెంటర్లోని ధర్నాచౌక్‌లో కార్మికులు ధర్నా నిర్వహించారు.










