ఐక్యరాజ్య సమితి : మయన్మార్‌లో తాజాగా నెలకొన్న పరిస్థితులపై చర్చించేందుకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి మంగళవారం సమావేశమవుతోంది. గత నవంబరులో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు వ్యక్తం చేసిన అభిప్రాయాలకు గౌరవమిస్తూ, చర్యలు తీసుకునే అంశాన్ని పరిశీలిస్తోంది. సోమవారం మయన్మార్‌లో సైన్యం అధికారాన్ని చేజిక్కించుకుంది. ఆంగ్‌సాన్ సూకీతో సహా పలువురు రాజకీయ నేతలను గృహ నిర్బంధంలో వుంచింది. ప్రస్తుత మాసానికి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి అధ్యక్షులుగా వున్న బ్రిటన్ మయన్మార్‌పై గోప్యంగా (జనాంతిక) చర్చలను నిర్వహిస్తోంది. చర్చలు ఎలాంటి అరమరికలు లేకుండా, కూలంకషంగా జరిగేందుకే ఈ జనాంతిక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మయన్మార్‌లో ఐరాస ప్రధాన కార్యదర్శి ప్రత్యేక దూత క్రిస్టిన్ ష్రానర్ బర్గనర్ కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. మయన్మార్ ఆసియన్ పొరుగుదేశాలతో సన్నిహితంగా పనిచేస్తూ శాంతి భద్రతలకు దీర్ఘకాలంగా వున్న ముప్పును పరిష్కరించాలని భావిస్తున్నట్లు భద్రతామండలి అధ్యక్షురాలు, ఐక్యరాజ్య సమితిలో బ్రిటన్ శాశ్వత ప్రతినిధి బార్బారా వుడ్‌వర్డ్ వ్యాఖ్యానించారు. ఈ వారాంతంలో మయన్మార్‌పై చర్చించాల్సి వుందని, తాజా పరిణామాలను దృష్టిలో వుంచుకుని మంగళవారమే చర్చిస్తున్నామని తెలిపారు. గత నవంబరులో ఎన్నికలు జరగడానికి ముందుగానే సెప్టెంబరులో మండలి మయన్మార్‌పై చర్చించింది.
ముఖ్యమంత్రులను విడుదల చేసిన సైన్యం
ఒక నిర్బంధం అనంతరం పలు ప్రాంతీయ, రాష్ట్రాల ముఖ్యమంత్రులను విడుదల చేసినట్లు మయన్మార్ సైన్యానికి చెందిన సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. సోమవారం దేశంలో అధికారాన్ని చేజిక్కించుకునే సమయంలో సైన్యం పలువురు మంత్రులు, రాజకీయ నేతలతో పాటు అధికార నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ నేతలను నిర్బంధంలోకి తీసుకున్న విషయం తెలిసిందే.










