ప్రజాశక్తి-గుర్ల (విజయనగరం జిల్లా) : రాష్ట్రంలో మధ్యాహ్న భోజనం మెనూలో స్వల్ప మార్పులు చేయనున్నట్లు విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. కిచిడికి బదులుగా పప్పు పులుసు చేరుస్తున్నట్లు చెప్పారు. విజయనగరం జిల్లా గుర్ల మండలం నాగళ్ల వలసలో గ్రామ సచివాలయం భవనాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు అమలు తీరుపై గ్రామసభలో మంత్రి సమీక్షించారు. విద్యాభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాలపై గ్రామస్తులు, విద్యార్థులు, తల్లిదండ్రులతో చర్చించారు. ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం అమలు తీరుపై ఆరా తీశారు. కొందరు విద్యార్థులను పిలిచి మధ్యాహ్న భోజనంలో ఇస్తున్న ఆహారం ఎలా ఉందని మంత్రి ప్రశ్నించారు. కిచిడి రుచికరంగా ఉండడం లేదని విద్యార్థులు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో ఇస్తున్న కిచిడి రుచికరంగా ఉండడం లేదని రాష్ట్ర వ్యాప్తంగా ఫిర్యాదులు అందుతున్నాయని చెప్పారు. దీనిపై ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డితో చర్చించి మెనూలో కిచిడికి ప్రత్యామ్నాయంగా పప్పు పులుసు చేర్చే ఆలోచన చేస్తున్నామని తెలిపారు. విద్యా కానుకలో భాగంగా విద్యార్ధులకు సరఫరా చేసిన స్కూల్ బ్యాగులు కొన్ని చిరిగి పోయినట్లు ఫిర్యాదులు వచ్చాయని, వాటి స్థానంలో కొత్తవి సరఫరా చేస్తామని చెప్పారు.










