Dec 18,2020 21:30

బెర్లిన్‌ : సంపన్న దేశాలు తమ ప్రజల కోసం కరోనా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చుకుంటున్న నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నింటికీ, ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్‌ అందేలా చూడాల్సిన అవసరం వుందని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటానియో గుటెరస్‌ శుక్రవారం నొక్కి చెప్పారు. జర్మనీ పార్లమెంట్‌ను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ, జర్మనీ బయో ఎన్‌ టెక్‌, అమెరికా ఔషధ దిగ్గజం ఫైజర్‌తో కలిసి మార్కెట్‌లోకి తొలిగా వ్యాక్సిన్‌ తీసుకురావడానికి చేసిన ప్రయత్నాలను ప్రశంసించారు. ప్రతి ఒక్క జర్మన్‌ కూడా వారి విజయానికి గర్వపడాలన్నారు. వ్యాక్సిన్లను ప్రజా సంక్షేమానికి ఉపయోగపడేలా చూడడం మనముందున్న సవాలని అన్నారు. ప్రతి ఒక్కరికీ, ప్రతి దేశానికి వీటిని అందుబాటులోకి తేవాల్సి వుందన్నారు. కరోనాపై తప్పుడు ప్రచారాలపై పోరాడుతూ, వ్యాక్సిన్ల పట్ల ప్రజలకు విశ్వాసం కలిగించేలా చర్యలు తీసుకోవడానికి ఐక్యరాజ్య సమితి కట్టుబడి వుందని అన్నారు. శాస్త్రీయ దృక్పథం లేని ప్రజాదరణ పొందిన విధానాలను మనం ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నామని అన్నారు. ఇలా తప్పుడు ప్రచారాలు, తీవ్ర స్థాయి కుట్రలతో పరిస్థితులు చాలా అధ్వాన్నంగా తయారవుతున్నాయన్నారు. కరోనాపై జర్మనీ పోరాడిన తీరును, మెర్కెల్‌ పనితీరును ఆయన ప్రశంసించారు.