
చాలా మందికి టీకాలు అనగానే చిన్న పిల్లలే గుర్తుకొస్తారు. వాళ్ళకి వేసే పోలియో చుక్కలు, ఇంజక్షన్లు, ఇంజక్షన్ల చుట్టూ అయ్యే గడ్డలు, నొప్పి లాంటివి గుర్తొస్తాయి. అయితే మనం తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే పెద్దవారికీ రకరకాల టీకాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. పెద్దవారికి టీకాలేంటి అనుకుంటున్నారా? అయితే ఈ వ్యాసం మీ కోసమే! ఈ నెల చివరి వారం ప్రపంచ ఇమ్మ్యూనైజేషన్ వారంగా జరుపుతున్నారు. అందులో భాగంగా దీనిపై ప్రత్యేక కథనం..
మనకి వచ్చే వందల కొద్దీ వ్యాధులలో కొన్ని ఒకరి నుండి ఒకరికి వ్యాప్తి చెందేవి అయితే, మరికొన్ని వ్యాప్తి చెందలేనివి. ఇలా ఒకరి నుండి మరొకరికి సోకే వ్యాధులను అంటువ్యాధులు అంటాము. పేద దేశాల్లోని ప్రజలకి వచ్చే రోగాల్లో చాలా మట్టుకు ఒకరి నుండి ఒకరికి వ్యాప్తి చెందేవే. అంటువ్యాధులు కలుగజేసే క్రిములలో ప్రధానంగా రెండు రకాలు. చాలావరకు వైరస్ జాతికి చెందినవి అయితే, కొన్ని బాక్టీరియా జాతికి చెందినవి. (రకరకాల పారాసైటులు, ఫంగస్‌లు, ప్రోటోజోవాల వల్ల కూడా అంటువ్యాధులు వస్తాయి. కానీ వీటికి టీకాలు ఉండవు. జబ్బు వచ్చాక మందులు వాడి నయం చేసుకోవాలి. లేదంటే రాకుండా నివారించుకోవాలి.) ఈ వైరస్/ బాక్టీరియాలు మనలోకి జొరబడితే వాటికి వ్యతిరేకంగా మన శరీరంలో రోగ నిరోధక కణాలు ఏర్పడి పోరాడతాయి. ఒక్కోసారి మన రోగ నిరోధక వ్యవస్థ గెలిస్తే ఒక్కోసారి క్రిములే గెలుస్తాయి. అయితే ఈ రెండింటికి మధ్య యుద్ధం క్రిములు మన శరీరంలో ఉన్నంత వరకూ జరుగుతూనే ఉంటుంది. రోగ నిరోధకవ్యవస్థ బలహీనంగా ఉంటే మనకి జబ్బు ముదురుతుంది. లోపల రకరకాల అవయవాలు దెబ్బతింటాయి. అదే రోగ నిరోధక వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటే కొన్నిరోజులు జబ్బు బారిన పడినా తర్వాత కోలుకుంటాము. అంటువ్యాధుల వల్ల చిన్నపిల్లల్లో మరణాలు ఎక్కువగా సంభవిస్తాయి. అందుకే వారికి రెండు సంవత్సరాలు వచ్చేలోపే చాలా వరకు టీకాలు ఇచ్చి, రోగ నిరోధక శక్తిని పటిష్టం చేస్తాము.

- తయారీ విధానం.. విభజన..
టీకాలు తయారుచేసే విధానాన్ని బట్టి వాటిని కొన్ని రకాలుగా విభజించవచ్చు. లైవ్ అటెన్యుయేటెడ్ వ్యాక్సిన్, కిల్డ్ వ్యాక్సిన్, పాలిసాకరైడ్ వ్యాక్సిన్, కాంజుగేట్ వ్యాక్సిన్, వెక్టార్ వ్యాక్సిన్, రికాంబినెంట్ వ్యాక్సిన్ మొదలైనవి. మొన్నటి దాకా మన దేశంలో ఇచ్చిన కోవిడ్ వాక్సిన్లలో ఒకటి కిల్డ్ వ్యాక్సిన్ అయితే, ఇంకోటి వెక్టార్ వ్యాక్సిన్.
- ఈ వారం ప్రత్యేకం.. ప్రధానం..
ఏప్రిల్ చివరి వారం ప్రపంచ ఇమ్యునైజేషన్ వారంగా జరుపుతున్నారు. చిన్న పిల్లలను, పెద్దలని వీలైనంత ఎక్కువగా టీకాల చేత నివారించబడే వ్యాధుల నుండి కాపాడుకోవాలి అనేదే దీని ప్రధాన ఉద్దేశ్యం. కోవిడ్ కాలంలో రకరకాల చట్టాలు, భయాల రీత్యా పిల్లలకి టీకాలు సరిగా అందలేదు. ఒక్క 2021లోనే ప్రపంచ వ్యాప్తంగా 2.5 కోట్ల మంది పిల్లలకి టీకాలు సరిగ్గా అందలేదు. దీన్ని సరిచేయాలంటే అందరికీ టీకాల పట్ల కనీస పరిజ్ఞానం ఉండాలి.
వ్యాక్సిన్‌లు అందుబాటులోకి రావడం వల్ల ప్రతి ఏడాది 20 నుండి 30 లక్షల మంది ప్రాణాలు కాపాడుకోగల్గుతున్నాము అంటే అతిశయోక్తి కాదు. చాలా వైరస్‌లు, బ్యాక్టీరియాలు కలుగజేసే ప్రాణాంతకమైన వ్యాధులు నివారించడానికి ఇప్పుడు వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నాయి. ప్రపంచంలో ఎంతో మంది మరణానికి కారణమైన స్మాల్‌పాక్స్ (చిన్న అమ్మవారు) రోగాన్ని మనం ఈ రోజు అసలు చూడట్లేదు అంటే అది వ్యాక్సిన్ ఫలితమే. వ్యాక్సిన్ ఫలితంగా పోలియో కేసులు కూడా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు మాయమయ్యాయి. ఇదివరకు ధనుర్వాతం వల్ల వందల సంఖ్యలో మాత శిశు మరణాలు చూసేవాళ్ళం. మనందరికీ తెలిసిన టీటీ వ్యాక్సిన్ విస్తృతంగా అందుబాటులోకి రావడం వల్ల ఈ మరణాలు పదుల సంఖ్యకు తగ్గాయి.
- ఏ వ్యాధులకు అందుబాటు..
క్షయ వ్యాధి, పోలియో, ధనుర్వాతం, హెపటైటిస్ బీ, మీసల్స్, మంప్స్, రుబెల్లా, రోటా వైరస్, పేర్చుసిస్, నిమోనియా, హేమోఫిలస్, మెదడువాపు మొదలైన వ్యాధులకు టీకాలు అందుబాటులో ఉన్నాయి. ఈ వ్యాధుల్ని అరికట్టడానికి చిన్న పిల్లలందరికీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సిన్లు ఉచితంగా ఇస్తారు. కొన్ని వ్యాక్సిన్‌లు మాత్రం ఇప్పటికీ ప్రైవేటులోనే అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు, టైఫాయిడ్ వ్యాక్సిన్, ఫ్లూ వ్యాక్సిన్, చికెన్ పాక్స్, హ్యూమన్ పాపిల్లోమా వ్యాక్సిన్‌లు ప్రైవేటులో డబ్బులు కట్టి వేయించాల్సి ఉంటుంది.
- పెద్దలకు ఏ వ్యాక్సిన్‌లు..
టీడాప్: ధనుర్వాతం, డిఫ్తీరియా, పేర్చుసిస్ వ్యాధులు నివారించబడతాయి. ఇదివరకు కేవలం టీటీగా అందుబాటులో ఉండేది. ఇప్పుడు డీటీ/ టీడాప్‌గా అందుబాటులో ఉంది. దెబ్బ తాకినప్పుడే కాకుండా ఏ సమయంలో అయినా తీసుకోవచ్చు. అయితే ఒకసారి తీసుకుంటే దీని ప్రభావం పదేళ్ల వరకూ ఉంటుంది. కాబట్టి మీరు టీటీ ఇంజెక్షన్ తీసుకుని, పదేళ్లు దాటితే ఇప్పుడు ఇంకో డోసు తీసుకోవాల్సి ఉంటుంది.
చికెన్ పాక్స్ / వారిసెల్లా: చిన్న పిల్లలు/యుక్త వయసులో ఉన్నవారు తప్పక తీసుకోవాల్సిన వ్యాక్సిన్. ఇదివరకు ఎప్పుడు చికెన్ పాక్స్ వ్యాధికి గురికాని వారు కూడా ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. రెండు డోసులుగా తీసుకోవాల్సి ఉంటుంది.
జోస్టర్ : ఇది అరవై ఏళ్ళు పైబడిన పెద్దవారు/షుగర్ వ్యాధి/కిడ్నీ/ గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు కచ్చితంగా తీసుకోవాల్సిన వ్యాక్సిన్. చికెన్ పాక్స్ కలగజేసే వారిసెల్లా వైరస్ శరీరంలోని నాడీకణాల్లో వెళ్లి దాక్కుంటుంది. వృద్ధాప్యం, లేదంటే శరీరంలో రోగ నిరోధకశక్తి తగ్గినపుడు ఈ వైరస్ మళ్లీ ఆక్టివేట్ అయ్యి, జోస్టర్ అనే జబ్బు కలిగిస్తుంది. దీనివల్ల ఛాతీ చుట్టూ, పొట్ట చుట్టూ చికెన్ పాక్స్ మాదిరి గుల్లలు వస్తాయి. ఈ గుల్లలు తొందరగానే తగ్గినా, వాటివల్ల వచ్చే నొప్పి నెలల నుండి ఏళ్ల తరబడి ఉంటుంది. దాన్నే పోస్ట్-హెర్పెటిక్ న్యూరాల్జియా అంటారు. దీన్ని నివారించడానికి జోస్టర్ వ్యాక్సిన్ తీసుకోవాలి. ఒక డోసు తీసుకుంటే సరిపోతుంది.

హెపటైటిస్ బీ : ఈ వ్యాధి ఒకరి నుండి మరొకరికి అసురక్షిత సంపర్కం ద్వారా లేదా అసురక్షితమైన రక్తం ఎక్కించడం వల్ల లేదా గర్భిణీ మహిళ నుండి శిశువుకు సంక్రమించే అవకాశం ఉంటుంది. ఈ వైరస్ బారిన పడితే లివర్ సంబంధిత సమస్యలు, క్యాన్సర్ వంటివి వస్తాయి. వైద్య రంగంలో పని చేసేవారు, ల్యాబ్ టెక్నీషియన్‌లు, తరుచుగా ఇంజక్షన్‌లు వేసే వారు కచ్చితంగా తీసుకోవాల్సిన టీకా హెపటైటిస్ బీ. దీనిని మూడు డోసులుగా తీసుకోవాల్సి ఉంటుంది.
ఫ్లూ : ప్రతి సంవత్సరం వచ్చే ఫ్లూ బారిన పడి చాలా మంది ఆసుపత్రి పాలవుతుంటారు. యాభై సంవత్సరాలపై బడిన ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిన వ్యాక్సిన్ ఇది. ప్రతి సంవత్సరం కొత్త స్ట్రైన్లు వస్తుంటాయి కాబట్టి.. ప్రతి ఏడాదీ వేసుకోవాలి. షుగర్ వ్యాధి, గుండె / కిడ్నీ సంబంధిత వ్యాధులు ఉన్నవారు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు కూడా ప్రతి సంవత్సరం తీసుకోవాలి.
నీమోకొకల్ : న్యుమోనియా జబ్బుని నివారిస్తుంది. అరవై ఏళ్ళు పైబడిన ప్రతి ఒక్కరూ వేసుకోవాల్సిన వ్యాక్సిన్. ఒక డోసు వేసుకుంటే సరిపోతుంది. అరవై ఏళ్ల లోపు వారికీ అవసరాన్ని బట్టి, రోగ నిరోధక శక్తిని బట్టి ఒకటి లేదా రెండు డోసులు వేస్తారు.
ఎంఎంఆర్ : మీసల్స్, మంప్స్, రుబెల్లా వ్యాధులు నివారించబడతాయి. యాభై సంవత్సరాల లోపు వారందరు తీసుకోవచ్చు. అవసరాన్ని బట్టి యాభై సంవత్సరాలు పైబడిన వారికీ ఇస్తారు. ఒక డోసు తీసుకుంటే సరిపోతుంది.
హెపటైటిస్ ఏ, మెనింగోకొకల్ : ఏ వయసు వారికైనా అవసరాన్ని బట్టి, రోగ నిరోధక శక్తిని బట్టి వేస్తారు.
టైఫాయిడ్ : ఆహారాన్ని తయారుచేసే పనిలో ఉన్న వారికి/ హోటల్‌లో పని చేసేవారికీ ఇది తప్పనిసరి. దూర ప్రయాణాలు చేసే వాళ్ళు/తీర్థ యాత్రలకు వెళ్లే వారు కూడా తీసుకుంటే మంచిది. మూడు సంవత్సరాలకి ఒకసారి ఒక డోసు తీసుకోవాల్సి ఉంటుంది.
హెచ్‌పీవీ : జననాంగాలలో వచ్చే వ్యాధులను, క్యాన్సర్‌ను నివారిస్తుంది. 9 నుండి 26 సంవత్సరాల వారికి ఇస్తారు. లైంగిక జీవితం ప్రారంభించబోతున్న వారికి ఈ వ్యాక్సిన్ చాలా ఉపయోగం. మూడు డోసులు తీసుకోవాల్సి ఉంటుంది.
పైన పేర్కొన్న వ్యాక్సిన్‌లన్నీ వైద్యుల ఆమోదం తర్వాతే తీసుకోవాలి. గర్భిణీ స్త్రీలు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, హెచ్‌ఐవీ బారిన పడిన వారు, స్టెరాయిడ్‌లు వాడుతున్న వారు నిపుణులైన వైద్యుల సలహా మేరకే వ్యాక్సిన్‌లు తీసుకోవాలి. చిన్న పిల్లలకు వేయవలసిన వ్యాక్సిన్‌లు అన్నీ కచ్చితంగా షెడ్యూల్ ప్రకారం ఇవ్వాలి. మధుమేహం, బీపీ, గుండె, కిడ్నీ సంబంధిత వ్యాధులు ఉన్నవారు తప్పకుండా వ్యాక్సిన్‌ల గురించి తెలుసుకోవాలి. సంబంధిత వైద్యుల సలహా మేరకు వారు వేసుకోవాలి. దీని వల్ల చాలా రోగాల బారి నుండి తప్పించుకునే వీలుంటుంది. అనవసరమైన ఆసుపత్రి ఖర్చులు కూడా తగ్గించుకోవచ్చు.
అయితే అంటురోగాలను నివారించడానికి వ్యాక్సిన్‌లు ఒకటే మార్గం కాదు. మనం మన పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. వీలైనంత వరకూ శుభ్రమైన మంచినీరు తాగడం, బాగా ఉడికించిన ఆహారాన్ని తినడం చేయాలి. రోజువారీ ఆహారంలో పళ్ళు, కూరగాయలు, ఆకుకూరలు ఉండేలా చూసుకోవాలి. పొగ తాగడం, మందు తాగడం వంటివి ఎంత తొందరగా మానేస్తే రోగ నిరోధకశక్తి అంత మెరుగుపడుతుంది. ఆరోగ్యకరమైన, సురక్షితమైన లైంగిక చర్యల వల్ల లైంగిక వ్యాధుల బారి నుండి తప్పించుకోవచ్చు. తినే ముందు, మల, మూత్ర విసర్జన తర్వాత చేతులు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలాంటి అలవాట్ల వల్ల అంటురోగాలు రాకుండా కాపాడతాయి. రోజూ వ్యాయామం చేయడం, సరిపడా నిద్రపోవడం కూడా మనలోని రోగ నిరోధక శక్తి పెరగడానికి తోడ్పడుతాయి. ప్రజలు నివసించే పరిసరాలు శుభ్రంగా ఉంచడం, అంటు రోగాలు ప్రబలకుండా చూసుకోవడం, ఆహరం కలుషితం కాకుండా నిఘా పెట్టడం, పిల్లలందరికీ సరైన సమయానికి టీకాలు అందేలా చేయడం, వారికి ప్రభుత్వ బడుల్లో పోషకాహారం అందించడం, ప్రజలకు టీకాల పట్ల విస్తృతమైన అవగాహన కలిగించడం ప్రభుత్వం యొక్క కనీస బాధ్యత. పెద్దవారికి అవసరమైన టీకాలు ఉచితంగా ఇవ్వడంపైనా ప్రభుత్వాలు తమ దృష్టిని సారించాలి.

- వ్యాక్సిన్ అంటే ఏంటి? ఎలా పనిచేస్తుంది?
రోగాలను కలుగజేసే క్రిములని నిర్వీర్యం చేసి లేదా చంపేసి మన శరీరంలోకి ఎక్కించడాన్నే వ్యాక్సినేషన్ అంటాము. అలా నిర్వీర్యం చేసిన పదార్థాన్ని వ్యాక్సిన్ లేదా టీకా అంటాము. టీకాలలో ఉండే నిర్జీవ/నిర్వీర్య పదార్థాలు మనకు రోగం కలిగించలేవు.. కానీ మనలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. రోగం వచ్చినపుడు మన శరీరం ఎలాంటి కణాలు ఉత్పత్తి చేసి యుద్ధం చేస్తుందో, సరిగ్గా అలాంటి కణాలే టీకాలు ఇచ్చినపుడు ఉత్పత్తి అవుతాయి. అంటే టీకాలు ఇచ్చి, మనం శరీరానికి రోగం వచ్చినపుడు ఎలా యుద్ధం చేయాలో నేర్పిస్తున్నాం అన్నమాట. టీకా సరైన డోసుల్లో తీసుకున్నాక మన శరీరం రోగాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటుంది. ఈ రోగ నిరోధక శక్తిలో ముఖ్యమైనవి బీ లింఫోసైట్ కణాలు, టీ లింఫోసైట్ కణాలు. ఇందులో జ్ఞాపకశక్తి ఉండే కణాలు కూడా ఉంటాయి. వీటిని మెమరీ సెల్స్ అంటాము. రోగం వచ్చినపుడు ఆ క్రిములను గుర్తించి, నాశనం చేయడంలో ఇవే కీలకమైనవి.
డాక్టర్ దేశం పిఆర్ , ఎంబీబీఎస్, ఎండి
ప్రజారోగ్య నిపుణులు
9490057793