Jan 22,2021 06:44

అమెరికా 46వ అధ్యక్షునిగా జో బైడెన్‌ ప్రమాణ స్వీకారం ఉత్కంఠ భరిత వాతావరణం మధ్య జరిగింది. సరిగ్గా రెండు వారాల క్రితం పరిపాలనా కేంద్రం కేపిటల్‌ హిల్‌పై ట్రంప్‌ అనుయాయులు దాడి చేయడం, భద్రతా దళాలతో సహా ఎవరైనా ఎప్పుడైనా హింసకు పాల్పడవచ్చుననే హెచ్చరికలు ప్రపంచాన్ని దిగ్భ్రమకు గురి చేశాయి. మొత్తానికి 78 ఏళ్ల బైడెన్‌ బుధవారంనాడు అమెరికా అధికార పీఠాన్ని అధిష్టించారు. ట్రంప్‌ నిరంకుశ చర్యలను తెగనాడడం, జాత్యహంకార పోకడలకు భిన్నంగా వ్యవహరించడం మంచిదే! కరోనా విపత్తును ఎదుర్కోవడంలో అత్యంత బాధ్యతారహితంగా వ్యవహరించిన ట్రంప్‌ శైలికి భిన్నంగా వంద రోజులపాటు అందరూ మాస్కు ధరించాలని ప్రకటించడం ద్వారా జో ప్రజలకు సముచిత సందేశాన్నిచ్చారు. కరోనా విపత్తు ముంచుకొస్తున్నా లెక్క చేయకుండా 'నమస్తే ట్రంప్‌' పేరిట నెత్తికెత్తుకున్న ప్రధాని మోడీ కి బైడెన్‌ గెలుపు చెంపపెట్టు వంటిది. అధ్యక్షునిగా బైడెన్‌ తొలి ప్రసంగంలోనే 'ఐకమత్యంతో కలిసి ముందుకెళ్లాల్సి ఉందని' చెప్పడంలోనే అమెరికన్‌ సమాజం ట్రంప్‌ పాలనలో, ముఖ్యంగా ఎన్నికల ఉద్రిక్తతలతో ఎంతగా విభజితమయిందో బోధపడుతుంది. అందుకనే ఇది ఒక వ్యక్తి విజయం కాదనీ, విభజనపై ప్రజాస్వామ్యం సాధించిన విజయమని చెప్పవలసి వచ్చింది. ప్యారిస్‌ పర్యావరణ ఒప్పందం, డబ్ల్యుహెచ్‌ఓ తదితర సంస్థల నుండి బయటకు పోవాలని ట్రంప్‌ తీసుకున్న నిర్ణయాలతో సహా అనేక అంశాల్లో పూర్వపు పరిస్థితిని నెలకొల్పుతామని బైడెన్‌ ప్రకటించడం ఆహ్వానించదగినది.


'శ్వేత జాతి అహంకారాన్ని తప్పకుండా ఓడిస్తామని' చెప్పడం ద్వారా అమెరికాకు వలస వచ్చిన ప్రజల విశ్వాసాన్ని పొందడానికి బైడెన్‌ ప్రభుత్వం కృషి చేస్తుందని విదితమవుతోంది. వలసవాద నిబంధనల మార్పుతో విదేశీ నిపుణులకు ఊరట కల్పించారు. ముఖ్యంగా భారతీయ వృత్తి నిపుణులకు ఇది ఎంతో ప్రయోజనకరం. ముస్లిం దేశాల నుండి వలసదారుల రాకపై ఆంక్షల సడలింపు, మెక్సికో గోడ నిర్మాణానికి బ్రేకులు వేయడం తదితర నిర్ణయాలతో అభివృద్ధి చెందుతున్న దేశాలకు చెందిన వలసదారులకు సానుకూల సంకేతాలిచ్చినట్టయింది. అమెరికాను అన్ని రంగాల్లో ఉన్నతంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని, కరోనా వల్ల లక్షల ఉద్యోగాలు పోయాయని, ఆర్థిక రంగం కుదేలైందంటూనే ఇలాంటి కష్టకాలంలో శక్తియుక్తులన్నీ ప్రోది చేసుకుని ముందుకు సాగాలని బైడెన్‌ చెప్పడం అమెరికన్‌ యువతీయువకుల ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై ఆశావహ దృక్పథాన్ని కల్పించడానికే!


అమెరికా తొలి ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్‌ ఎన్నిక కావడంతో సహా బైడెన్‌ పరిపాలనా బృందంలో అత్యధిక సంఖ్యలో భారతీయ అమెరికన్లు వుండడం మంచిదే. అయితే భారతీయ అమెరికన్లలో అత్యధికులు డెమొక్రటిక్‌ పార్టీకి అనుకూలంగా ఉంటున్న చారిత్రక వాస్తవాన్ని మరువరాదు. గతంలోకన్నా ఇపుడు కొంత ఎక్కువ దామాషాలో పదవులు లభించాయి. ఈ కారణంగా భారత అమెరికా ఆర్థిక, వాణిజ్య, రాజకీయ సంబంధాల్లో పెను మార్పులు వస్తాయని ఎవరనుకున్నా అది అత్యాశే అవుతుంది. అంతర్గత పాలనాంశాల్లో కొన్ని సర్దుబాట్లు, దిద్దుబాట్లు తప్ప మౌలికంగా అమెరికన్‌ పాలక వర్గాల స్వభావంలో ఎలాంటి మార్పు రాలేదన్న విషయాన్ని సదా గుర్తుంచుకోవాలి. వారి సామ్రాజ్యవాద వైఖరిలో మార్పు లేదు. వెనిజులా తాజా ఎన్నికలలో ప్రజల తిరస్కారానికి గురైన తిరుగుబాటుదారుడు గైడోను ఆ దేశ అధ్యక్షుడిగా గుర్తించనున్నట్టు అమెరికా కొత్త విదేశాంగ మంత్రి ప్రకటించడం అందుకు ఒక సూచిక. అటు బైడెన్‌ ప్రమాణ స్వీకారం జరుగుతుండగానే గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయిల్‌ దాడులు యథావిధిగా కొనసాగుతూనే ఉన్నాయి. కాబట్టి ట్రంప్‌ ఓడిపోయి, బైడెన్‌ అధికారానికి రావడం తోనే అద్భుతాలు జరిగిపోవు. అమెరికన్‌ పాలకుల యుద్ధోన్మాదం కొనసాగుతూనే ఉంటుంది. బహుళజాతి కార్పొరేట్‌ సంస్థలకు సేవ చేయడంలోనూ డెమొక్రటిక్‌, రిపబ్లికన్‌ పార్టీల మధ్య ఎలాంటి తేడా లేదన్నది గమనార్హం.