ఏయే తరహాల సహాయాన్ని అందించబోతున్నారన్న విషయం కన్నా ఈ ప్యాకేజికి అవసరమైన ధనాన్ని ఏవిధంగా సేకరించనున్నారన్న విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఇందుకవసరమైన వనరులను సేకరించడానికి సామాన్యుల పైన గాక, సంపన్నుల పైన అదనపు పన్నులు వేయనున్నారు. అధికాదాయ వర్గాలకు ఆదాయపు పన్ను గరిష్ట పరిమితిని 40 శాతానికి పెంచడంతోబాటు అదనంగా సమకూర్చుకున్న ఆస్తులపై పన్ను వేయబోతున్నారు. పెట్టుబడిదారుల లాభాలపై అదనపు పన్నులు వేసి వాటిని కార్మిక వర్గానికి చెల్లించాలన్నది వామపక్షాలు చాలా కాలంగా చేస్తున్న డిమాండ్.
ఇంకా పదవీ స్వీకార ప్రమాణం చేయక మునుపే, అమెరికా నూతన అధ్యక్షుడు జో బైడెన్ 1,90,000 కోట్ల డాలర్ల సహాయ ప్యాకేజిని ప్రకటించాడు. ఇందులో లక్ష కోట్ల డాలర్ల మేరకు కార్మికులకు నేరుగా నగదు చెల్లింపులు ఉంటాయి. 2020లో అమెరికా జిడిపి 20.8 లక్షల కోట్ల డాలర్లు ఉంటుందని అంచనా వేశారు. అంటే బైడెన్ ప్రకటించిన సహాయం ఆ దేశపు జిడిపిలో దాదాపు 10 శాతం అవుతుంది. కరోనా నేపథ్యంలో ఇదివరకే పాత అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన ఒక లక్ష కోట్ల డాలర్ల సహాయ ప్యాకేజికి ఇది అదనం. అమెరికాలో కార్మికులకు నేరుగా ఆర్థిక సహాయం చేసే విధానాన్ని తాత్కాలికంగా కాకుండా కొంతకాలం పాటు కొనసాగించనున్నారని బైడెన్ ప్రకటించిన ప్యాకేజి సూచిస్తోంది. కరోనా మహమ్మారి ప్రభావంతో అమెరికాలో నిరుద్యోగం గత ఏప్రిల్ నాటికి ఏకంగా 15 శాతానికి చేరింది. అక్కడి నుంచి కాస్త కోలుకుని గత డిసెంబరు నాటికి నిరుద్యోగం 6.7 శాతానికి వచ్చింది (ఇది ఆర్థిక వ్యవస్థ కోలుకుంటుందనడానికి సంకేతం అని, అందువలన ఇంక కార్మికులకు ఎటువంటి ఆర్థిక సహాయమూ అవసరం లేదని మితవాద ఆర్థికవేత్తలు వాదించవచ్చు).
కోవిడ్-19 ప్రభావం నుండి కోలుకోడానికి ఈ ప్యాకేజిని ఇస్తున్నట్టు బైడెన్ ప్రకటించాడు. అయితే దాని పరిధి అంతకన్నా ఎక్కువగానే ఉంది. సామాజిక సంక్షేమం కోసం ప్రకటించిన ఖర్చు తక్షణం కోవిడ్-19 నుండి కోలుకోడానికి మాత్రమే పరిమితం కాలేదు. అక్కడి ట్యాక్స్‌పేయర్లకు గత నెలలో 600 డాలర్ల మేరకు మినహాయింపు ఇస్తూ అమెరికన్ కాంగ్రెస్ నిర్ణయం చేసింది. ఇప్పుడు అదనంగా 1400 నుండి 2000 డాలర్ల వరకూ మినహాయింపు ప్రకటించారు. ప్రస్తుతం వారానికి 300 డాలర్ల నిరుద్యోగ భృతి పొందుతున్న 1 కోటి 80 లక్షల మంది ఇకపైన సెప్టెంబరు మాసం వరకూ వారానికి 400 డాలర్ల చొప్పున భృతి పొందుతారు. కనీస వేతనం గంటకు 15 డాలర్లకు పెంచారు. అద్దెలు చెల్లించలేనివారిని ఇళ్ళు బలవంతంగా ఖాళీ చేయించరాదంటూ ఈ ఏడాది జనవరి వరకూ విధించిన మారటోరియాన్ని ఇప్పుడు సెప్టెంబరు మాసాంతం వరకూ పొడిగించారు. ఇవిగాక వ్యాక్సిన్ పంపిణీ, చిన్న వ్యాపారులకు సహాయం, విద్యా సంస్థలకు సహాయం వంటి అంశాలు కూడా ఈ ప్యాకేజీలో చోటు చేసుకున్నాయి.
ఏయే తరహాల సహాయాన్ని అందించబోతున్నారన్న విషయం కన్నా ఈ ప్యాకేజికి అవసరమైన ధనాన్ని ఏవిధంగా సేకరించనున్నారన్న విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఇందుకవసరమైన వనరులను సేకరించడానికి సామాన్యుల పైన గాక, సంపన్నుల పైన అదనపు పన్నులు వేయనున్నారు. అధికాదాయ వర్గాలకు ఆదాయపు పన్ను గరిష్ట పరిమితిని 40 శాతానికి పెంచడంతోబాటు అదనంగా సమకూర్చుకున్న ఆస్తులపై పన్ను వేయబోతున్నారు. పెట్టుబడిదారుల లాభాలపై అదనపు పన్నులు వేసి వాటిని కార్మిక వర్గానికి చెల్లించాలన్నది వామపక్షాలు చాలా కాలంగా చేస్తున్న డిమాండ్. బైడెన్ వామపక్ష విధానాల వైపు మొగ్గుతున్నాడని అతడు ప్రకటించిన ప్యాకేజిపై వ్యాఖ్యానిస్తున్నవారు అంటున్నారు. ఈ మొగ్గు హఠాత్తుగా వచ్చినదేమీ కాదు. తన అధ్యక్ష ఎన్నికల ప్రచారం సాగించిన కాలం యావత్తూ ఈ మొగ్గు కనపడిందని ప్రముఖ అమెరికన్ పత్రికలన్నీ వ్యాఖ్యానిస్తున్నాయి. బైడెన్ తన ప్రచారం సందర్భంగా చేసిన వాగ్దానాలను విస్మరించకుండా వాటికి నిజాయితీగా కట్టుబడి ఇప్పుడు నడుచుకుంటున్నాడని మనం భావించాలి.
డెమోక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్ధి రేసులో తనతో పోటీ పడిన బెర్నీ శాండర్స్ లాగా బైడెన్ ఏమీ వామపక్షవాది కాదు. తాను వామపక్షవాదినని బైడెన్ ఎప్పుడూ చెప్పుకోలేదు. ఒబామా అధ్యక్షుడుగా ఉన్న కాలంలో ఉపాధ్యక్షుడిగా పని చేసిన బైడెన్ సైద్ధాంతికంగా ఒబామా భావాలనే కలిగివున్నాడు. అవి వామపక్ష భావజాలానికి చాలా దూరం కూడా. మరి ఇప్పుడు అతని కొత్త వైఖరిని ఎలా అర్ధం చేసుకోవాలి? ఒకవేళ ఎన్నికల్లో గెలుపు కోసం అటువంటి వైఖరిని తీసుకున్నాడని అనుకుందామా అంటే ఎన్నికల అనంతరం మాట మార్చి వెనకడుగు వేసేందుకు అవకాశం ఉందికదా. కాని ఆ విధంగా చేయలేదే?
పెట్టుబడిదారీ సంక్షోభం నెలకొన్న కాలంలో బైడెన్ ఎన్నిక అయ్యాడు. అతను ఇప్పుడున్న పరిస్థితే అతని వైఖరిలో మార్పుకు కారణం. అసలు ఏ సంక్షోభమూ లేదు అని బూకరించడానికి పూనుకుంటే ఆ వైఖరి అతనికే ఎదురుతిరుగుతుంది. గత ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ ఆ విధంగానే తన ప్రచారంలో దబాయించడానికి పూనుకుంది. ఆ ప్రచారం ఎదురుతిరిగి ఆమె ఓటమిపాలైంది. అదే ట్రంప్ గెలుపుకు దోహదపడింది. ట్రంప్ ఆ ఎన్నికల్లో గెలిచాడంటే అప్పుడు అమెరికన్ ఓటర్లంతా ఒక్కసారిగా మితవాదులుగా మారిపోయారని కాదు. అప్పుడు నెలకొన్న సంక్షోభం గురించి, దాని ఫలితంగా శ్రామిక ప్రజలు అనుభవిస్తున్న కష్టాల గురించి ఉదారవాద బూర్జువా వర్గం తన ప్రచారంలో ఏ ప్రస్తావనా చేయలేదు. అసలు సంక్షోభం అంటూ ఒకటున్నదన్న వాస్తవాన్ని అప్పటి తమ ప్రచారంలో పరిగణన లోకి తీసుకోనేలేదు. ఈ మారు బైడెన్ ఆ తప్పునే తిరిగి చేయదల్చుకోలేదు. సంక్షోభం ఉండడం ఒక వాస్తవమని, అది తీవ్రంగా ఉందని, కరోనా మహమ్మారి రాకముందు నుంచీ, దానితో నిమిత్తం లేకుండానే ఈ సంక్షోభం నెలకొందని అతను గుర్తించాడు. కరోనా రావడం ఆ సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేసిందే తప్ప సంక్షోభానికి కారణం కరోనా కాదని బైడెన్ గుర్తించాడు.
కేవలం కార్పొరేట్-అనుకూల విధానాలనే అమలుచేస్తూ, అధిక లాభాలను ''వేటాడే ఆటవిక ప్రవృత్తి''తో పెట్టుబడులు పెట్టి ఆర్థిక వ్యవస్థను పెట్టుబడిదారులే అభివృద్ధి చేసేస్తారన్న ఆశలు పెట్టుకుంటే ఏమీ ఉపయోగం లేదని తేలిపోయింది. అందుచేత ఈ సంక్షోభం నుంచి బైటపడేందుకు ఏదోవొకటి చేయాలి. ప్రజల కొనుగోలు శక్తి పడిపోయినందువలన మొత్తం డిమాండ్ పడిపోయి ఈ సంక్షోభానికి దారి తీసింది. కరోనా కాంలో ఆ డిమాండ్ మరింత పడిపోయి మరింతగా సంక్షోభం ముదిరింది. కాబట్టి శ్రామిక ప్రజలకు నేరుగా సొమ్ము బదలాయించడం ప్రస్తుతం ముందున్న మార్గం. అంటే సంపద పున: పంపిణీ చేపట్టడం. అది వామపక్షవాదుల ఎజండా. కాని అదొక్కటే మార్గం. అందుచేతనే, బైడెన్, తనకు సైద్ధాంతికంగా ఎంత సెంటరిస్టు దృక్పథం ఉన్నా, వామపక్ష విధానం వైపు మొగ్గవలసి వచ్చింది.
అమెరికా లోని కార్పొరేట్లకు బైడెన్ ప్యాకేజి ఏమాత్రమూ రుచించదు. తొందరలోనే అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి తన అసంతృప్తిని ఏదోవిధంగా తెలపడం ఖాయం. పెట్టుబడిదారీ ప్రపంచంలోకెల్లా మొనగాడుగా ఉన్న అమెరికా దేశపు కరెన్సీకి బలం చాలా ఎక్కువ. అది బంగారం తో సమానంగా చాలామంది పరిగణిస్తారు. ఇటువంటి ప్రత్యేక సానుకూలత ఇతర అభివృద్ధి చెందిన సంపన్న పెట్టుబడిదారీ దేశాలకు సైతం లేదు. అయితే, బైడెన్ ఇప్పుడు చేపట్టిన విధానాన్నే గనుక ఎక్కువ కాలం కొనసాగించితే డాలరుకు ఉన్న ఆ సానుకూలత కాస్తా పోతుంది. ఆ పరిస్థితిలో బైడెన్ ముందు రెండే దారులుంటాయి. ఒకటి- తన ప్రస్తుత వామపక్ష ధోరణినే మరింత బలంగా కొనసాగించడం. రెండు- అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి ఆధిపత్యానికి తలొగ్గి వారి ఆదేశాలను అమలు చేయడం.
అక్కడ బైడెన్ అనుసరించిన విధానాన్ని ఇక్కడ మన దేశంలో మోడీ అనుసరిస్తున్న విధానంతో పోల్చి చూడండి. పెట్టుబడిదారులు సైతం పెద్దగా అభ్యంతరం పెట్టని, అంతగా పట్టించుకోని మేరకైనా శ్రామిక ప్రజలకు ఆర్థికంగా సహాయం చేయడానికి మోడీ సిద్ధపడలేదు. ప్రజల విషయంలో అంత నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించాడు. నిజానికి ప్రస్తుత అసాధారణ పరిస్థితుల్లో ఎంతో కొంత మేరకు ప్రజలను ఆదుకోడానికి ప్రభుత్వం గనుక అదనపు వ్యయం చేపడితే దానికి అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి కూడా అభ్యంతరం చెప్పదు. కాని మోడీ ప్రభుత్వం కార్పొరేట్ల సేవలో ఎంతగా మునిగిపోయిందంటే అది ప్రజలను ఆదుకోవలసిన తన బాధ్యత పట్ల పూర్తి నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. దాని పర్యవసానంగా దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభం ప్రజల పాలిట ప్రాణ సంకటంగా మారింది. ఆ ప్రజలలో అది పెద్ద భాగంగా ఉన్న రైతులు ఇప్పుడు దుర్భరమైన చలిలో సైతం ఢిల్లీ సరిహద్దుల్లో తమ నిరసనలను కొనసాగిస్తున్నారు.
కేవలం నాలుగు గంటల వ్యవధిని మాత్రమే ఇచ్చి లాక్‌డౌన్ ప్రకటించడమే కాదు, అద్దెలు కట్టలేని వారిని ఇళ్ళ నుండి బలవంతంగా ఖాళీ చేయించకుండా ట్రంప్ మాదిరిగా కనీసం మారటోరియం అయినా విధించలేదు మోడీ ప్రభుత్వం. దీని వలన చాలామంది వలస కార్మికులు ఒక్కసారిగా పనులు కోల్పోయి, ఆదాయాలు కోల్పోయి, చివరకు తల దాచుకునేందుకు గూడు కూడా లేనివారయ్యారు. అందుకే కాలినడకన వందలాది మైళ్ళ దూరాన ఉన్న తమ స్వగ్రామాలకు తరలిపోవలసి వచ్చింది. అక్కడ ట్రంప్ ఇచ్చినపాటి ఆర్థిక సహాయాన్ని కూడా ఇక్కడ మోడీ చేయలేదు. రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, సంస్థలు అందరూ కుటుంబానికి నెలకు కనీసం రూ.7000 చొప్పున కొన్ని నెలల పాటు ఇవ్వాలని చేసిన విజ్ఞాపనలన్నీ చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టే అయిపోయాయి.
ఎట్టకేలకు రెండు దఫాలుగా ''సహాయ ప్యాకేజి''ని ప్రకటించారు. తీరా చూస్తే ఆ ప్యాకేజిలో ప్రకటించినవాటిలో అత్యధిక భాగం అంతకు ముందే బడ్జెట్లో ప్రకటించినవే. మొత్తం రూ.20 లక్షల కోట్ల ప్యాకేజిలో ఏదో రూపంలో ప్రజలకు ఆర్థిక సహాయంగా అందేది రు.1.9 లక్షల కోట్లు మాత్రమే (కొంతమంది అది రూ.1.65 లక్షలకు మించదని అంచనా వేశారు. అంటే అది జిడిపి లో కేవలం ఒక శాతం!).
అయితే ఈ మొత్తం కూడా వాస్తవంగా అమలు కాలేదు. 2020 ఏప్రిల్ నుండి నవంబరు మధ్య మొత్తం ప్రభుత్వ వ్యయం 2019లో అదే కాలంలో చేసిన వ్యయంతో పోల్చితే కేవలం 4.7 శాతం మాత్రమే పెరిగింది. ఈ కాలంలో ద్రవ్యోల్బణం రేటు చూస్తే 6 శాతం ఉంది. అంటే కరోనా కష్ట కాలంలో ప్రజలను ఆదుకోవడానికి గణనీయంగా తన వ్యయాన్ని పెంచవలసి వుండగా దానికి బదులు వాస్తవ వ్యయాన్ని మోడీ ప్రభుత్వం తగ్గించింది.
ప్రభుత్వ వాస్తవ వ్యయాన్ని తగ్గించే పెడధోరణిని ప్రదర్శించడంతోబాటు, కేంద్రం అదే కాలంలో రాష్ట్రాలకు న్యాయంగా జిఎస్‌టి పరిహారంగా అందించాల్సిన మొత్తాన్ని చెల్లించకుండా ఎగనామం పెట్టింది. మొత్తంగా చూసినప్పుడు ఈ కరోనా మహమ్మారి కాలంలో ప్రపంచంలోని అన్ని దేశాలలో ప్రభుత్వ వ్యయం గణనీయంగా పెరిగితే, మన దేశంలో మాత్రం గణనీయంగా తగ్గింది! ఈ ప్రభుత్వానికి సవ్యంగా ఆలోచించడం కూడా తెలియదని, ప్రజల పట్ల ఏమాత్రమూ బాధ్యత లేదని స్పష్టం అవుతోంది. జో బైడెన్ ప్రభుత్వానికి, మోడీ ప్రభుత్వానికి కొట్టవచ్చినట్టు తేడా ఎంత ఉందో చూడండి !
(స్వేచ్ఛానుసరణ)
ప్రభాత్ పట్నాయక్











