
అనగనగా కథలు.. బాల్యంలో సృజనను పెంచే మాలికలు.. అమ్మమ్మ, బామ్మా.. తాతయ్యలు లేని చిన్న కుటుంబాల్లో చిన్నారుల చింత తీర్చేది బాలసాహిత్యమే. చిన్ననాడు చందమామ, బాలమిత్ర సాహిత్య పఠనంతో పెద్దయ్యాక సృజనాత్మక రచన చేస్తున్న వారెందరో.. పిల్లల పట్ల ప్రేమతో రాసినవే నాడూ నేడూ మేలైన కథలు.. భాషపై మమకారం పెంచేది బాలసాహిత్యమే.. కథనం ఎంత ముఖ్యమో.. బాలసాహిత్యంలో చిత్రానికీ సమప్రాధాన్యం.. పిల్లల్ని ఆకట్టుకునేది కంటికింపైన బొమ్మలే! ఈ విషయంలో ప్రపంచ బాలసాహిత్యంపై సోవియట్ ప్రచురణలు చేసిన కృషి అద్వితీయం.. అయితే, ఇప్పుడు చదువుల్లోనూ, సాంకేతికంగానూ అనేక మార్పులు వచ్చిన నేపథ్యంలో బాలసాహిత్యం అవసరం ఎంతుంది? అది ఏవిధంగా పిల్లలకు ఉపయోగం? వంటి విషయాలపై బాల సాహితీవేత్తలతో 'స్నేహ' బృందం ముచ్చటించింది. వారి విలువైన మాటల మూటలే ఈ వారం ప్రత్యేక కదంబం.
పిల్లల పట్ల ప్రేమ ఉండాలి
మనం ఎలాంటి విత్తనాలు నాటితే అలాంటి చెట్లే వస్తాయి. బాల్యం నుండే మంచి సాహిత్యం అందిస్తే అలాంటి మంచి వ్యక్తిత్వం గల బాలలు తయారవుతారు. చందమామ అలాంటి సాహితీ సేద్యం చేసింది. దానివల్ల మన భాష, సంస్కృతి, సంప్రదాయాలు, విలువలు బతికాయి. ఇప్పుడు చందమామ లేదు. బాలసాహితీ వేత్తలే ఆ బాధ్యత తీసుకోవాలి.
బాల సాహిత్యంలో భాషా సంకరం లేని రచనలు వస్తాయి. తల్లిభాష తలెత్తుకుని తిరుగుతుంది. బాలసాహిత్యాన్ని ముందు పెద్దలు చదివి, పిల్లలతో చదివించాలి. బాలసాహితీ వేత్తలు రాసినంత మాత్రాన సరిపోదు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పనిగట్టుకుని బాలసాహిత్యాన్ని ప్రోత్సహించాలి. అలాచేస్తే పుస్తక పఠనం తగ్గదు.
కొత్త విషయాలు, మంచి సంగతులు, జీవితానికి, భవిష్యత్తుకి పనికొచ్చే సూత్రాలు తెలుసుకుంటున్నామన్న అభిప్రాయం కలిగితేనే ఎవరైౖనా పుస్తకాలు చదువుతారు. బాల సాహితీవేత్తలు ఈ రహస్యం దృష్టిలో ఉంచుకుని, రచనలు చేయాలి. అప్పుడే ఆ రచనలు పంచతంత్రం, ఈసఫ్ కథల్లా దశాబ్దాల తరబడి నిలిచిపోతాయి. ఆధునిక విజ్ఞాన విషయాలనూ అతి సరళంగా, ఆసక్తికరంగా రాయాలి. అలా రాయాలంటే పిల్లల రచనలు చేసే వారికి నిబద్ధత ఉండాలి. పిల్లల పట్ల, వారి భవిష్యత్తు పట్ల ప్రేమ ఉండాలి. వారే చరిత్రలో నిలిచిపోతారు. వారి రచనలు చిరంజీవులవుతాయి.
- చొక్కాపు వెంకట రమణ
కేంద్ర బాల సాహిత్య
అకాడమీ పురస్కార గ్రహీత,
92465 20050
నేటి బాల సాహిత్యం
తెలుగు బాలసాహిత్యం తొలి నుంచి నీతులు ప్రధానంగా నడిచింది. కుమార శతకం, కుమారీ శతకం... నీతి కథా మంజరి వంటివి ప్రధానంగా చాలాకాలం బాల పఠనీయ సాహిత్యంగా ఉన్నాయి. నేటికీ పిల్లల కోసం చేసే రచనలు పిల్లల నడవడికను ప్రభావితం చేసేవి. నీతి ప్రధానంగా ఉండాలనే రచయితలే ఎక్కువశాతం. వినోద ప్రధానంగా పరమానందయ్య శిష్యులు, తెనాలి రామకృష్ణ కథలు మాత్రమే మిగిలాయి. అనువాద రచనల్లోనూ పిల్లల అద్భుత సాహస గాథలు ఎక్కువభాగం లేకపోవడం శోచనీయం. నేటి పిల్లలకు భాష ఒక సమస్య. కాగా వారి పాఠ్యాంశాల బరువు మరో సమస్యగా తయారైంది. బాల సాహిత్యం చదివే పిల్లల సంఖ్య చాలా తగ్గిపోయింది. బడిలోని కథల పుస్తకాలను పిల్లల చేత చదివించే టీచర్లు మృగ్యమయ్యారు. బడి పిల్లల చేత కథలు రాయించి, సంకలనాలు తేవడం మంచి చొరవ అయినా ఆ కథలలో కొత్తదనం, ఊహలు లేకపోవడం పెద్దల సృజన లేమిని ప్రతిఫలిస్తోంది. చరవాణిలో పాఠాలు నేర్చుకునే స్థితిలో పిల్లలకు అద్భుత ఊహాలోకం పరిచయం చేయాల్సిన పని రచయితలది. మాట్లాడే పక్షులు, జంతువులు, నది, ఆకాశం, కొండ అన్నీ బాలలకు నచ్చేవే. వాటిని ఎలా అల్లగలమనేది రచయితల మేధకు పరీక్ష. అంత సమాచారాన్ని అందంగా అద్భుతంగా సాహసాలతో తీర్చిదిద్దడం నేటి రచయితల బాధ్యత. పర్యావరణం, ప్రకృతి సంరక్షణ వంటివే నేటి అవసరం.
- మంజులూరి కృష్ణకుమారి, బాలసాహితీవేత్త
సోవియట్ సాహిత్య ప్రభావం
ఇప్పుడు రాస్తున్న అనేకమంది కవులు, రచయితలపై సోవియట్ సాహిత్య ప్రభావం చాలా ఉంది. నేను మరుగున పడుతున్న అనేక సోవియట్ పుస్తకాలను వెలుగులోకి తీసుకొస్తున్న క్రమంలో అనేకమంది రచయితలు, అసంఖ్యాకమైన పాఠకులు సోవియట్ పుస్తకాలు తమపై వేసిన బలమైన ప్రభావాన్ని, ఆయా పుస్తకాలు తమ జీవితాల్లో మిగిల్చిన గొప్ప జ్ఞాపకాల్ని చెప్పుకొచ్చారు. మనకు రష్యన్ రచయితలు తెలిసినంత బాగా ఇతర ప్రపంచదేశాల రచయితల గురించి తెలియదు. సోవియట్ పుస్తకాల వల్ల అసంఖ్యాకమైన తెలుగు పాఠకులకు టాల్‌స్టారు, గోర్కీ వంటి మహా రచయితలు చిన్నతనంలోనే పరిచయమయ్యారు. ఆ రచయితలు పిల్లల కోసం రాసిన కథలను సోవియట్ ప్రచురణ సంస్థ ప్రపంచ భాషలలోకి అనువదించి, ప్రపంచ వ్యాప్తంగా అందరికీ అందుబాటులో తెచ్చింది. అందువల్ల అలాంటి రచయితల రచనలు ఇవాళ మనం వెతుక్కుని మరీ చదవగలుగుతున్నాం.
కథలు, బొమ్మలు ప్రదర్శించాలి
బాలసాహిత్యానికి ఆదరణ ఎప్పుడూ ఉంటుంది. కాకుంటే మనం ఎంత మెరుగైన సాహిత్యాన్ని, బొమ్మల పుస్తకాల్ని వారికి అందిస్తున్నాము అన్నది ముఖ్యం. ఈ విషయంలో 'మంచి పుస్తకం' లాంటి ప్రచురణ సంస్థలు చాలా ముందడుగు వేశాయి. అనేక స్కూళ్లలో సైన్స్‌ల్యాబ్ ప్రదర్శనలు నిర్వహించాలి. పిల్లలు గీసిన బొమ్మలు, వాళ్ళు రాసిన కథలు ప్రదర్శనకు నిలపగలగాలి. అప్పుడు గొప్ప ప్రయోజనం ఉంటుంది.
వర్క్‌షాపులకు విస్తరించాలి
పిల్లలకు తెలివితేటలు పెంచే పుస్తకాల కోసం చూస్తున్నారు. వయసుకు మించిన తెలివితేటలు, వ్యక్తిత్వ వికాసం అనర్థదాయకం. వాటి బదులుగా వారికి మంచి అనుభవాన్నిచ్చే కథలూ, కల్పనలూ బొమ్మల పుస్తకాలు అందుబాటులోకి తేవాలి. ఇవాళ మంచి పుస్తకాలకు కొదవలేదు. కానీ వాటిని పిల్లల దగ్గరకు చేర్చే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేరు. ఈ పరిస్థితిని అధిగమించాలి. పిల్లల కోసం ప్రత్యేకంగా పుస్తక ప్రదర్శనలు, వాళ్ళ కథలు రాయడానికి, బొమ్మలు గీయడానికి తరచుగా స్కూలు ఆవరణ దాటుకుని, బయట వర్క్‌షాపులు నిర్వహించాలి. ఇవన్నీ చేయగలిగితే మనం మరింత ఆరోగ్యకరమైన వాతావరణంలోకి అడుగుపెట్టగలం.
- అనిల్ బత్తుల, బాల సాహిత్య ప్రచారకుడు
సృజనాత్మక రచనాసక్తి పెంచాలి
'ఇస్తినమ్మ కథనాలు.. పుచ్చుకొంటినమ్మ కథనాలు' అన్న చందాన మొదలయ్యాయి ఈ సృజనాత్మక రచనా తరగతుల ప్రయత్నాలు. బడిలో సృజనాత్మకతను ప్రోత్సహించడం అంటే మన దృష్టి ప్రధానంగా రంగులవైపు పడుతుంది. కాగితాల్ని నలుపుచేసే అక్షర రమ్యత మనకు చటుక్కున తట్టదు. చిత్రకళా ప్రదర్శనలు, వేదిక మీద ప్రదర్శించే కళలకు ఉన్నంత ఆదరణ రచనా కళపై మనకు లేదు. కథ అన్నది సృజనాత్మాక రచనలో ఒక ఒరవడి మాత్రమేనని విజ్ఞులు గ్రహించాలి. సృజనశీలత తార్కిక దృష్టితో కూడిన శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందిస్తుంది. అంతర్ దృష్టినీ, ముందుచూపునీ కలిగిస్తుంది. కానీ నేటి తరగతిగదుల్లో ప్రశ్నా జవాబులు భట్టీపట్టడం తప్ప, పక్కచూపు చూసే అవకాశం ఎక్కడిది? సృజనాత్మక రచన అంటే కేవలం కాల్పనిక కథారచన కాదు. సృజనశీలతను ప్రకటించే ఏ రచనైనా సృజనాత్మక రచనే. నిత్య జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను తొలగించుకోవడానికి ఎప్పటికప్పుడు మనం సృజనాత్మకంగా ఆలోచించాలి. పిల్లల పాఠాలు అటు తెలివితేటలతో పాటు సృజనశీలతను పెంపొందించేలా ఉండాలి.సొంత ఆలోచన ప్రకటించుకొనే అవకాశం లేనిదే, స్వతంత్ర భావనలకు ఆస్కారం ఉండదు. మొదట పిల్లలు సొంతంగా, స్వతంత్రంగా వ్యక్తపరుచుకోగల వాతావరణం కల్పించగలగాలి. నెల్లూరులో మేము స్థాపించిన 'ప్రభవ' మూడు దశాబ్దాలుగా రాష్ట్రవ్యాప్తంగా చదువు, ప్రకతి, తెలుగు, ప్రపంచ సాహిత్యాలలో కృషి చేస్తోంది. బడి అయినా.. ఇల్లు అయినా.. పిల్లల్లో రచనాభివృద్ధి బలవంతంగా నేర్పే విషయం కాదు. రచనల పట్ల వారిలో ఆసక్తి పెరగాలి. ఇంకా పిల్లల ఇష్టాలను గౌరవించాలి. సహజంగానే కొందరు పిల్లలు పాఠకులు కావచ్చు. మరికొందరు వక్తలు కావచ్చు. ఇంకొందరు రచయితలు కావచ్చు. చిత్రకారులు కావచ్చు. పత్రకారులు కావచ్చు. ఈ వైవిధ్యాన్ని పెద్దలు గుర్తించగలగాలి. వారిలో సహజసిద్ధంగా ఉండే సృజనాత్మకతకు పెద్దలు ఆటంకం కాకుండా ఉంటే చాలు. పిల్లలు చేయవలసింది.. చదవగలిగినన్ని పుస్తకాలు చదవడమే. చూడగలిగినన్ని సినిమాలు చూడడమే. రాయగలిగినన్ని రచనలు రాయడమే. ఆయా సృజనాత్మక వ్యవహారాలను ఎలాంటి సంకోచాలూ సంశయాలూ లేకుండా.. నిర్భయంగా పిల్లలు అమలు చేసుకోగల వాతావరణాన్ని కల్పించాలి.
- చంద్రలత
విద్యావేత్త, రచయిత్రి, 'ప్రభవ' నిర్వాహకులు
బాలసాహిత్యంతోనే మాతృభాష పరిరక్షణ
నేడు ఎక్కువమంది ఆంగ్లభాష విద్యాభ్యాసం మీద మోజు చూపిస్తున్నారు. ఇలాంటి తరుణంలో మాతృభాషను పరిరక్షించుకోవాలి. అందుకు బాలసాహిత్యం ఓ ఆశాకిరణం. బాల సాహిత్యాన్ని అందరం ప్రోత్సహించాల్సిన, ఆదరించాల్సిన అగత్యం నేడు వచ్చింది.
బాలసాహిత్య విషయంలో తల్లిదండ్రుల పాత్రను గమనిస్తే పిల్లలు శైశవదశలో ఉన్నప్పుడు మాత్రమే బాలసాహిత్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. తరువాత దాని గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. వాస్తవానికి బాలసాహిత్య పఠనం పిల్లల్లో ఊహాశక్తిని పెంచుతుంది. అది వారి విద్యాభ్యాసానికి ఉద్దీపనంగా ఉపయోగపడుతుంది. విద్యార్థి సొంత ఆలోచనలతో ముందుకు వెళ్లడానికి దారిని సుగమం చేస్తుంది. ఓ తల్లిదండ్రులారా! అల్లరి చేస్తున్న పిల్లలను బుజ్జగించడానికి మాత్రమే బాలసాహిత్యం లేదు. దాని ప్రయోజనం విస్తృతమైనది. పిల్లలను బాధ్యతాయుత పౌరులుగా పెంచడానికి, నీతిమంతులుగా తీర్చిదిద్దడానికి, మన మాతృభాషను రక్షించుకోవడానికి బాల సాహిత్యం ఎంతో సాయపడుతుంది. మన ప్రభుత్వాలు మనసుపెట్టి ఆలోచిస్తే బాల్యాన్ని బంగారుమయం చేయగలవు. మనసుంటే మార్గం ఉంటుంది. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాలల అకాడమీ ఉండేది. బాలసాహిత్య గ్రంథ ప్రచురణ చేపట్టి, బాల్యానికి, భాషకు పట్టం గట్టింది. మళ్లీ ఆ సంస్థ రెండు రాష్ట్రాల్లో ప్రాణం పోసుకోవాలి. ఆ దిశగా ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలి.
సాహిత్య, సాంస్కృతిక సంస్థలే కాకుండా సమాజ శ్రేయస్సుకు ఏర్పాటైన ప్రతి సంస్థా బాలసాహిత్య వికాసానికి సాయమందించాలి. అలాగనుక చేస్తే ఒక ఆదర్శ సమాజాన్నే ప్రపంచానికి చూపగలం. సంస్థలు బాలల గ్రంథాలయాల ఏర్పాటులోనూ బాలసాహిత్య శిక్షణా శిబిరాలు నిర్వహించడంలోనూ ముందుకు వస్తే మంచి ఫలితాలు సమాజానికి అందగలవు.
ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి
బాలసాహిత్య పుస్తక ముద్రణ, పంపిణీ ప్రభుత్వం చేపట్టాలి. విరివిగా బాలల గ్రంథాలయాలను ఏర్పాటు చేయాలి. మాతృభాషలో వ్యాసరచన, చర్చా కార్యక్రమాలు చేపడుతుండాలి. తెలుగు భాషా బోధనకు ఎక్కువ పీరియడ్లు కేటాయించాలి. పాఠశాలల్లో సాయంత్రం గ్రంథ పఠనాన్ని పిల్లలకు తప్పనిసరి చెయ్యాలి.
- బెలగాం భీమేశ్వరరావు
కేంద్ర సాహిత్య అకాడమీ బాలసాహిత్య పురస్కార గ్రహీత
పత్రికల, సంస్థల ప్రోత్సాహం కావాలి
ఆధునిక కాలంలో అలవాట్లు, అభిరుచులు మారుతున్నాయి. సాంకేతికత అభివృద్ధి చెందడంతో పత్రికలూ కాలానుగుణంగా మారుతున్నాయి. నేడు అంతరిక్షానికి ఉపగ్రహాలను ప్రయోగిస్తూ అద్భుతాలు సృష్ట్టిస్తున్నారు. శాస్త్ర విజ్ఞానం పెరిగి, మానవుని మేధాశక్తికి ఎదురులేదని అనేక సందర్భాలలో చాటుతున్నారు. అభూత కల్పనలు నిండిన సాహిత్యానికి పరిమితం కాకుండా హేతువాదం, శాస్త్ర దృక్పథం పెంచే రచనలను ప్రోత్సహించే పనిలో నిమగమయ్యాయి పత్రికలు. దిన, వార, మాసపత్రికల్లో బాలసాహిత్యానికి కొన్ని పేజీలు కేటాయిస్తున్నారు.
ప్రభుత్వ పరంగా విద్యాశాఖ విద్యార్థులకు పాఠశాల గ్రంథాలను అందిస్తోంది. సర్వశిక్షా అభియాన్ బాలల కోసం బాలల చేత, పెద్దల చేత బాల సాహిత్యం రాయించి, ముద్రించి అందించింది. జాతీయ పుస్తక నిధి కూడా మేలిమి కథలను వివిధ భాషల్లోకి అనువదించి, అందుబాటులో ఉంచింది. ఉభయ రాష్ట్రాలలో ఎన్నో సాహిత్య సంస్థలు బాలసాహిత్య సేవ చేస్తున్నాయి. ప్రభుత్వాలు నగదు పురస్కారాలు ఇచ్చి, రచయితలను మరింత ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
కథలు చదివి, వినిపించాలి
పిల్లలు తెలివైనవారిగా ఎదగాలంటే మంచి కాల్పనిక కథలు చదివి, వినిపించాలి. భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి గ్రహీత ఐన్‌స్టీన్ చెప్పినట్టు.. అమృత భాండాగారాలైన పుస్తకాలను పిల్లలకు పరిచయం చెయ్యాలి. శరీర ఆరోగ్యం కోసం వ్యాయామం అవసరమైనట్టే మానసిక వికాసానికి పుస్తక పఠనం అవసరాన్ని గుర్తించాలి. కథలు, పాటలు, పద్యాలు, పొడుపు కథలు, సామెతలు ద్వారా పిల్లల్లో బాలసాహిత్యం పట్ల అనురక్తిని కలిగించాలి. పుస్తక పఠనం అందించే ప్రయోజనంతో భాషలోని మధురిమలు తెలుస్తాయి. ఇంకా పిల్లల్లో మానసిక వికాసం కలగడంతోపాటు నైతిక విలువల పట్ల ఆదరణ పెరుగుతుంది. ప్రభుత్వం తరుపున బాలల విజ్ఞాన, వినోద, వికాసాలే ధ్యేయంగా పనిచేసే బాలల అకాడమీలను పునరుద్ధరించాలి. బాలోత్సవాలను ప్రభుత్వమే అన్ని జిల్లాలలో ఏడాదికి రెండుసార్లు నిర్వహించాలి. సాహిత్య సంస్థలకు ఆర్థిక చేయూత అందిస్తూ చక్కని కార్యక్రమాలు జరిగేలా పోటీ వాతావరణం సృష్టించాలి.
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కార గ్రహీత
గేయ రచనలు రావాలి
నేడు బాలల అకాడమీలు, శిక్షణా తరగతులు లేవు. అయినా వెనుకటి బాలసాహిత్యం చదివి, అవగాహన చేసుకొని, సరికొత్త బాలసాహిత్యం సృష్టిస్తున్న బాలసాహిత్య రచయితలు పుట్టుకొస్తూనే ఉన్నారు. బాలల అకాడమీ లేనిలోటును పుస్తక ప్రచురణ కర్తలు పూరిస్తూనే ఉన్నారు. పిల్లల కథలు, నవలలు, విజ్ఞాన విషయాలు ప్రచురిస్తున్నారు. 'తానా'లాంటి విదేశీ సంస్థలు పిల్లల నవలల పోటీలు నిర్వహించి, బహుమతులు అందిస్తూ బాలసాహిత్య వికాసానికి దోహదపడుతున్నాయి.
కానీ గేయ రచనలను మాత్రం ప్రచురణకర్తలు ప్రోత్సహించడం లేదు. లయతో కూడిన గేయం-పిల్లలకు కోయిల పాటలా తీయగా ఉంటుంది. ఊయల తూగులా హాయిగా ఉంటుంది. 'జో అచ్యుతానంద - జోజో ముకుందా, చందమామ రావే- జాబిల్లి రావే' పాటలతోనే పిల్లల ఎదుగుదల మొదలవుతుంది. పాటల రచయితలూ కొద్దిమంది ఇప్పుడూ ఉన్నారు. అయితే వారి పాటలు చందోబద్ధంగా ఉండడం లేదు. లయాత్మకంగా ఉంటున్నాయి. చందోబద్ధంగా వుంటేనే పాటకు నిండుదనం వస్తుంది.
గేయ రచనల ప్రచురణకు ఆసక్తి చూపాలని కోరుతున్నా. బాలసాహిత్య వికాసం ప్రకాశవంతంగానే ఉందని భావిస్తున్నా.
- 'బాలబంధు' అలపర్తి వెంకట సుబ్బారావు
కేంద్ర సాహిత్య అకాడమీ బాలసాహిత్య పురస్కార గ్రహీత
94408 05001
బాలల నాటికలు విరివిగా రావాలి
బాలసాహిత్యానికి ఒక నిర్దిష్టమైన లక్ష్యం, ప్రయోజనం ఉండాలి. ఏ ప్రక్రియ అయినా ముందుగా పిల్లలతో చదివించడం ప్రధాన లక్షణంగా ఉండాలి. ఉదాహరణకు కథను తీసుకుంటే పిల్లలు చదవడం మొదలుపెట్టి ఒక వాక్యం చదవగానే మరో వాక్యానికి మనసును లాక్కుపోగలిగేలా ఉండాలి. పిల్లల ఊహా ప్రపంచానికి ఎల్లలను చెరిపేస్తూ అలౌకిక పాత్రలతో, అద్భుత సన్నివేశాలతో, అవలీల సరళ పదాలతో ఆకట్టుకునే సంఘటనలతో కథ సాంతం ఉత్సాహంగా చదివించగలగాలి. కథ ముందు పిల్లలకు వినోదం కలిగించాలి. తర్వాత విజ్ఞానం అందిస్తూ వారిని వికాసం వైపు నడిపించాలి. ప్రస్తుతం కథ, గేయం, వ్యాసం, నాటికలు మొదలైన ప్రక్రియల్లో బాల సాహిత్యం వస్తోంది. కథ ప్రక్రియలో విరివిగా వస్తూంటే.. నాటికల రూపంలో చాలా తక్కువగా వస్తోంది. ఇందుకు కారణం బాలల నాటికలు రాసే రచయితలు తక్కువగా ఉండటం అని చెప్పవచ్చు. నాటికల రూపంలో బాలసాహిత్యం విరివిగా రావాలి. రేపటి పౌరులను మంచి సంస్కారవంతులుగా తీర్చిదిద్దే దోవలో నాటికల పాత్ర చాలా వుంది. ఆరేళ్ళు పైబడిన పిల్లల్లో గ్రహణశక్తి అపారంగా ఉంటుంది. లేత ప్రాయంలోనే వారి మనో క్షేత్రలో బాల సాహిత్యం ద్వారా నిజాయితీ, సత్యం, ధర్మం, శాంతి, సహనం, మానవత వంటి మౌలిక గుణాలను విత్తనాలుగా నాటాలి. పిల్లలు పెరిగే కొద్దీ ఆ మౌలిక గుణాలు సంస్కార రూపంలో వికసిస్తాయి. అలాంటి బాల సాహిత్యం ఎల్లప్పుడూ పిల్లలకు అందుబాటులో ఉంచవలసిన బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మీద ఉంది.
- దాసరి వెంకట రమణ, కేంద్ర బాల సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత
వ్యక్తిత్వ నిర్మాణ పునాదులు
మనమెప్పుడూ.. బంగారు బాల్యం అంటుంటాము కదా! తల్లిదండ్రుల, పెద్దల ఆలనలో ఆటలూ, పాటలూ, కథలే.. బాల్యాన్ని బంగరుమయం చేసేవి. కథలు వింటూ అద్భుతమైన ఊహా ప్రపంచంలో విహరిస్తారు పిల్లలు. అందులో హాస్యం, దు:ఖం, వీరత్వం, సాహసం, భయం, సంబరం అన్నీ అనుభూతులుంటాయి. చెప్పేవారి చతురత, స్వరమూ ఆ ధ్వని పిల్లల మనసులో చాలా కాలం నిలిచిపోతుంటాయి. స్వయంగా చదవగలిగే స్థాయి రాగానే పిల్లలు సహజంగా ఇష్టపడేది తెలుగు పుస్తకాలే. ఎందుకంటే భాషకు సంబంధించిన పుస్తకాల్లోనే వాళ్ళను ఆకట్టుకునే కథలుంటాయి. అది కావ్య భాగమో, పద్యమో, గేయమో, నాటకమో, ప్రబంధమో ఏదైనా.. అందులో ఆకట్టుకునే కథ దాగి ఉంటుంది. పిల్లలను అది అమితంగా అలరిస్తుంది. చదివింపజేస్తుంది.. ఆలోచింపజేస్తుంది.. వెంటాడుతుంది.. ఒకరికొకరు ఊరిస్తూ చెప్పుకునే తాయిలమే అవుతుంది. కథలో ప్రతినాయకుడు ఓడిపోతే పిల్లలు సంబరపడిపోతారు. కథలోని ఉపాయాలు, యుక్తులు, సాహసాలకు అచ్చెరువొందుతారు. పిల్లల దైనందిన జీవితంలో వాటిని అన్వయించుకుంటారు. కథలోని భాషా, నానుడులూ, సామెతలూ నిత్య వ్యవహారంలో పిల్లలు వాడతారు. కథలు చదివిన అనుభవం అనుభూతి తర్వాత కాలంలో కథలు సృష్టించడానికి, రచనలు చేయడానికి దోహదపడతాయి. కథలు పిల్లల వ్యక్తిత్వ నిర్మాణంలో పునాదులుగా ఉపయోగపడ్తాయి.
- సమ్మెట ఉమాదేవి, బాలసాహితీవేత్త
ఏడో గదిలోకి తీసుకెళ్దాం!
చాలామందిలాగే నా బాల్యం 'చందమామ' బాలల పత్రికతో ముడిపడి ఉండేది. అప్పట్లో జానపద సీరియల్స్‌కి 'చిత్రా'గారు, పౌరాణిక సీరియల్స్‌కి 'శంకర్'గారు, చందమామ ముఖచిత్రాలు వడ్డాది పాపయ్యగారు వేసేవారు. కథలో పాత్రలకు దీటుగా చిత్రాగారు తన కుంచెను ఝళిపించేవారు. పిల్లల కథల పుస్తకాలలో కథల్నీ బొమ్మల్నీ విడివిడిగా చూడలేము. ఉదాహరణకు రష్యన్, చైనా పిల్లల కథల పుస్తకాలలో పేజీ నిండుగా పెద్ద బొమ్మ ఉండి, దాని కింద రెండు లైన్ల కథ ఉంటుంది. దీనిని బట్టి బాలసాహిత్యంలో చిత్రకారుల పాత్ర ఎంత ఉందో అర్థమవుతోంది. బొమ్మలు చూస్తూ కథ చదవడం పిల్లలకు ఒక అద్భుతమైన అనుభూతి. పిల్లల కోసం బాల సాహిత్యం విరివిగా రావాలి. వాళ్ళు రంగురంగుల పుస్తకాల పూదోటలో రెక్కలు కట్టుకున్న సీతాకోకచిలుకల్లా అద్భుతంగా, ఆనందంగా మానసికోల్లాసంతో ఎదగాలి. బాల సాహిత్యంలో ఎవరి పాత్ర ఎంత అనే ప్రశ్నే లేదు. చిత్రకారుడు, రచయిత తలుచుకుంటే ఎన్ని అద్భుతాలైనా సృష్టించవచ్చు. స్టార్‌వార్స్‌లో లుక్ స్కరు వాకర్ స్పేస్ షిప్ చేయని విన్యాసాలు లేవు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పిల్లల సాహస గాథలు ఇంగ్లీష్ సాహిత్యంలో ఉన్నాయి. తెలుగు పిల్లలు అడ్వెంచర్స్ కావాలంటే ఇంగ్లీష్ సాహిత్యం మీద ఆధారపడాలా? మన వాళ్ళకి మనం సాహస కథలు ఇవ్వలేమా? తిప్పి తిప్పి కొడితే మనకు 'బుడుగు' తప్ప వేరే క్యారెక్టర్ కనిపించదు. రకరకాల విచిత్ర జంతువులు, ఒంటి కన్ను రాక్షసులు, మాంత్రికులే కాదు రెక్కల గుర్రాలూ మనవే. ఏడు తలల నాగేంద్రుడు ఏ గుహలో పడుకున్నాడో అతనిని నిద్ర లేపండి. ఏనుగుని సైతం ఎత్తుకుపోయే గండ బేరుండాలు మనకు ఉండనే ఉన్నాయి. దీనివల్ల పిల్లలు పాడైపొయేదేమీ ఉండదు. మహా అయితే వారిలో సృజనశక్తి పెరుగుతుంది. తమ ఊహల్లో కొత్త లోకాలను చూడగలుగుతారు. ఇప్పుడు రాయకపోతే ఇకముందు పిల్లల కోసం ఏమీ ఉండదు. చెప్పినంత కాలం నీతి కథలు చెప్పాము. మన జానపద హీరోలను ఏడోగదిలోకి మాత్రం వెళ్ళకు అంటే.. ఏడో గదికే వెళ్ళి సాహసాలు చేయడమేకాక, రాకుమారినీ దక్కించుకొనేవారు. ఇప్పుడా రాకుమారుడికి ఏడోగది కరువైంది. మీరు చేయవలసిందల్లా ఆ ఏడోగది చూపించటమే.
- చైతన్య పైరపు, ప్రసిద్ధ చిత్రకారులు
సామాజిక మాధ్యమంలోనూ..
బాలసాహిత్య విస్తృతికి, వికాసానికి సామాజిక మాధ్యమాలు ఎంతో దోహదపడు తున్నాయి. అందులో వాట్సప్, ఫేస్‌బుక్, ఇ-బుక్స్, యూట్యూబ్ ప్రముఖపాత్ర పోషిస్తున్నాయి. సామాజిక మాధ్యమాల్లో బాలల వ్యక్తిత్వ వికాసాన్ని, విజ్ఞానాన్ని అందించే అనేక కథలు, గేయాలు, పాటలను స్వయంగా రచయితలే ప్రచురించుకుంటున్నారు. బాలసాహిత్యం కోసం గతంలోలా కష్టపడాల్సిన అవసరం లేదు. కొన్ని బాల పత్రికలు ఆన్‌లైన్‌లో లింక్ ఓపెన్ చేసి, చదువుకునే అవకాశాన్ని కల్పించాయి. ఇలా బాలలకు అనేక రూపాల్లో సామాజిక మాధ్యమం ద్వారా బాల సాహిత్యం లభిస్తుంది.అయితే దీనికి ప్రభుత్వం కొంత సహకరిస్తే మరింత ప్రయోజనం చేకూరుతుంది. నేడు పిల్లలకు ఎలాగూ ఆన్‌లైన్ క్లాసులు జరుగుతున్నాయి. అందువల్ల సెల్‌ఫోన్, కంప్యూటర్ల మీద విద్యార్థులకు అవగాహన కలిగింది. ప్రతి బడిలోనూ కంప్యూటర్ ఉంది. యానిమేషన్ ద్వారా కథలు పిల్లలకు అందించాలి. కాకుంటే పిల్లలకు ఊహా ప్రపంచానికి దూరం చేస్తాం. ఒంటికన్ను రాక్షసుడు అంటే ఒక్కో పిల్లవాడు ఒక్కోరకంగా ఊహించుకుంటాడు. కానీ యానిమేషన్ ద్వారా దృశ్యాన్ని చూసే పిల్లవానికి ఊహించుకునే అవకాశం ఉండదు. వాట్సాప్ గ్రూపులు నడిపే రచయితలు బాలసాహిత్యం పిల్లలకు చేరువయ్యేలా చూడాలి.
- పైడిమర్రి రామకృష్ణ
కోశాధికారి, బాలసాహిత్య పరిషత్
6 42583