May 24,2023 13:48
  • డాక్టర్ టి.వి .నారాయణ రావు ,ప్రముఖ ఫిజీషియన్

ప్రజాశక్తి-గుంటూరు : మధుమేహ బాధితులకు తొలి దశలో ఆహార నియమాలు, వ్యాయామం కొంతకాలం తర్వాత నోటి ద్వారా తీసుకునే మాత్రలు, ఆ నోటి మందులు కూడా జీవితాంతం పనిచేయవని, ఏదో ఒక దశలో ఇన్సులిన్ తీసుకోక తప్పదని, ఆ విషయాన్ని ప్రతి ఒక్క మధుమేహ బాధితులు గుర్తించాలని ప్రముఖ ఫిజీషియన్ డాక్టర్ టి.వి. నారాయణరావు అన్నారు. మంగళవారం రాత్రి స్థానిక జి ఎం ఏ హాల్లో ,ఐఎంఏ గుంటూరు శాఖ ఆధ్వర్యంలో "మధుమేహ చికిత్సలో మందులు -- ఇన్సులిన్ "అనే అంశంపై నిర్వహించిన వైద్య విద్యా కార్యక్రమంలో డాక్టర్ నారాయణరావు పాల్గొని ప్రసంగించారు. సభకు ఐ.ఎం. ఏ. గుంటూరు శాఖ అధ్యక్షులు డాక్టర్ ఆవుల శ్రీనివాస్ అధ్యక్షత వహించారు .డాక్టర్ నారాయణరావు ప్రసంగాన్ని కొనసాగిస్తూ ముఖ్యంగా టైప్-2 మధుమేహం నియంత్రణలో తొలి దశలో ఆహార నియమాలు ,వ్యాయామం కీలక పాత్ర పోషించినా.... కొంతకాలం తర్వాత నోటి ద్వారా తీసుకునే మందులు తీసుకోక తప్పదన్నారు .ఆ మందులు కూడా చాలాకాలం తర్వాత పనిచేయడం మానేస్తాయన్నారు .నేడు ఎన్ని రకాల కొత్త మందులు వచ్చిన అవి పరిమిత కాలమే రక్తం లోని షుగర్ శాతాన్ని సమర్ధవంతంగా నియంత్రించగలమన్నారు. ఆయా బాధితులు వ్యక్తిగత జాగ్రత్తలు ,ఆరోగ్యం ,ఆహారం, వ్యాయామం, మందుల మోతాదులపై ఆయా మందుల పనితీరు ఆధారపడి ఉంటుందన్నారు .జీవితాంతం మందులతోనే మధుమేహంను నియంత్రించడం సాధ్యం కాదన్నారు. అలా మందులనే గుడ్డిగా వాడటం వల్లనే గుండె, మెదడు ,నేత్రాలు ,కిడ్నీలు సమస్యలు ఎదురై  చాలామంది తీవ్ర అనారోగ్య ,ఆర్థిక నష్టాలకు గురి అవుతున్నారన్నారు. అర్ధంతరంగా మరణాలు కూడా సంభవిస్తున్నాయన్నారు. అందువలనే మధుమేహ బాధితులు వైద్యుని పర్యవేక్షణలో ఇన్సులిన్ తీసుకోవడానికి ముందుకు రావాలన్నారు .మధుమేహంకు అన్నిటికన్నా ఉత్తమ చికిత్స ఇన్సులిన్ మాత్రమే అన్నారు. ప్రజలు ఇన్సులిన్ పై గల అపోహలను తొలగించుకోవాలన్నారు. ఇన్సులిన్ కు  అలవాటు పడిన వారికి తీసుకోవటం ఏమాత్రం కష్టం కాదన్నారు . స్వయంగానే తీసుకోవచ్చునన్నారు. అందుకు సంసిద్ధం కావాలన్నారు. సకాలంలో సరైన చికిత్స పొంది ,షుగర్ శాతాన్ని నియంత్రించకపోతే దుష్ఫలితాలు తప్పవన్నారు. అప్పుడైనా ఇన్సులిన్ వాడక తప్పదు అన్నారు. వైద్యుని పర్యవేక్షణలో అవసరమైన చికిత్స తో మధుమేహంను నియంత్రణలో ఉంచుకుంటే సాధారణ జీవితం పొందవచ్చును అన్న వాస్తవాన్ని ప్రతి ఒక్క మధుమేహ బాధితులు గుర్తించాలని డాక్టర్ టీవీ నారాయణరావు అన్నారు .నోటి ద్వారా తీసుకునే మందులతో మధుమేహం నియంత్రణ అనే అంశంపై డాక్టర్ వి. వి. రామ్ కుమార్ మాట్లాడుతూ మధుమేహ బాధితులు యాంత్రికంగా రోజు మందులు వేసుకుంటున్నామన, షుగర్ తగ్గే ఉంటుందంటే ప్రయోజనాలు లేదన్నారు. మందులు ఎలా పని చేస్తున్నాయో తరచు సుగర్ పరీక్ష చేయించుకోవాలన్నారు. వాడుతున్న మందులకు కాంప్లికేషన్లు ఏమైనా వస్తున్నాయేమోనని చూసుకోవాలన్నారు .అందుకే షుగర్ కంట్రోల్ లో ఉన్న ....నెల  నెలా వైద్యుని పర్యవేక్షణలో ఉండి ,కాంప్లికేషనులను తొలి దశలోనే గుర్తించాలన్నారు. అప్పుడే ఇతర అవయవాల  పరిరక్షణ సాధ్యమవుతుందన్నారు. సభానంతరం డాక్టర్ టివి నారాయణరావుకు ప్రముఖ ఫిజీషియన్ డాక్టర్ వైవిఎస్ ప్రభాకర్ ,డాక్టర్ రామ్ కుమార్ కు ప్రముఖ చెస్ట్ ఫిజీషియన్ డాక్టర్ జి బాబురావు ప్రశంసా పత్రాలను అందజేశారు కార్యక్రమంలో ఐఎంఏ గుంటూరు శాఖ ఉపాధ్యక్షులు డాక్టర్ టి. సేవ కుమార్,సంయుక్త కార్యదర్శి డాక్టర్ డి.అమర లింగేశ్వర రావు ,అధిక సంఖ్యలో ఐఎంఏ వైద్యులు పాల్గొన్నారు.