May 25,2023 16:52
  •  ఎంపీపీ రాయుడు సునీత.

ప్రజాశక్తి - తాళ్లరేవు: తాళ్ళరేవు మండల పరిధిలోని జాతీయ రహదారి 216 పై జరుగుతున్న ప్రమాదాలను నివారించుట కొరకు ఈ నెల 27 శనివారం ఉదయం తొమ్మిది గంటలకు తాళ్ళరేవు మండల పరిషత్ కార్యాలయము నందు అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు ఎంపీపీ రాయుడు సునీత తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడారు. చొల్లంగి నుండి ఎదుర్లంక వంతెన వరకు నిర్మించిన జాతీయ రహదారి రోడ్డు నిర్మాణం ప్రారంభించినప్పటి నుండి ఇప్పటివరకు వందలాది మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించడం జరిగిందని అన్నారు. ఈ రహదారిలో ఒంపులు ఎక్కువగా ఉండటం వలన, వ్యక్తులు, వాహనదారుల నిర్లక్ష్యం వలన, మరెన్నో ఇతర కారణాల వలన ఘోరమైన రోడ్డు ప్రమాదాలు జరిగి వ్యక్తులు చనిపోవడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై హైవే అధికారులు, ఆర్ అండ్ బి అధికారులు, పోలీసు యంత్రాంగం వాహనదారుల సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రజాసంఘాల నాయకులు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు, అందరం కలిసి చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రభుత్వం ద్వారా తీసుకోవలసిన చర్యలతో పాటు ప్రజలలో అవగాహన తీసుకురావడం కోసం మనందరం కృషి చేయాలని అందుకొరకు ఈ సదస్సు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ సదస్సుకు అందరూ హాజరై సూచనలు సలహాలు ఇచ్చి ఐకమత్యంగా రోడ్డు ప్రమాదాల నివారణకు మనందరం కృషి చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు.