Dec 15,2020 18:23

శరీరంలో హార్మోన్ల అసమతుల్యత కారణంగా అవాంఛిత రోమాలు వస్తుంటాయి. ఈ సమస్యను వైద్య పరిభాషలో 'హిర్స్యు టిస్మ్‌' అంటారు. కొందరిలో ఇది వంశపారం పర్యంగానూ రావచ్చు. ఈ సమస్య పరిష్కారానికి కొన్ని ఇంటి చిట్కాలను పాటించవచ్చు.
- వేరుశనగ లేదా నువ్వుల నూనెను పెసర పిండిలో కలిపి ఆ మిశ్రమాన్ని అవాంఛిత రోమాలపై రుద్దడం వల్ల కొంతమేర తుగ్గుముఖం పడతాయి.
- ఈ సమస్య ఉన్నవారు 'ఈ' విటమిన్‌ పుష్కలంగా లభించే ఆహారాన్ని తీసుకోవాలి. శరీరానికి తగినంత నీరు తాగాలి.
- బాగా మగ్గిన అరటి పండు గుజ్జు, రెండు చెంచాల ఓట్‌మీల్‌ కలిపి ఆ మిశ్రమాన్ని రోమాల మీద రాసి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా వారానికి 2 సార్లు చేస్తే అవాంఛిత రోమాల సమస్య తొలగిపోతుంది.
-  ముఖానికి పసుపు రాసుకొని రుద్ది కడుగుతుంటే అవాంఛిత రోమాల బెడద తగ్గుతుంది.
- గుడ్డులో ఉండే తెల్లసొనను చెంచా మొక్కజొన్న పొడిలో కలిపి ముఖానికి రాయాలి. ఆరిన తర్వాత నీటితో కడిగితే అవాంఛిత రోమాలు సులభంగా తొలగిపోతాయి.
- శనగపిండి, పసుపును సమపాళ్లలో కలిపి ముఖానికి పేషియల్‌ మాదిరిగా పట్టించి ఆరిన తర్వాత నీటితో కడిగితే రోమాల పెరుగుదలను నియంత్రించవచ్చు.
- ఆహారంలో పైటో ఈస్ట్రొజన్స్‌ ఉండేలా చూసుకొంటే హార్మోన్ల సమస్య తగ్గుతుంది. సోయా, నువ్వులు, అవిసె గింజలు, పొద్దు తిరుగుడు గింజలు, వెల్లుల్లి, ఎండు ద్రాక్ష, ఖర్జూరం వంటివి ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.