
సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్ అరెస్ట్ అమానుషం. గుజరాత్ ఉగ్రవాద నిరోధక దళం (ఎటిఎస్) పోలీసులు శనివారం ముంబయిలోని సెతల్వాద్ ఇంటిపై గెరిల్లా తరహాలో దాడి చేసి గాయపర్చి బలవంతంగా నిర్బంధించి హుటాహుటిన అహ్మదాబాద్‌కు తరలించారు. 2002 గుజరాత్ అల్లర్ల గురించి తప్పుడు సాక్ష్యాలు చూపించారన్న అభియోగాలపై సెతల్వాద్‌తో పాటు అప్పటి డిజిపి ఆర్.బి. శ్రీకుమార్‌నూ ఎటిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. మత ఘర్షణల సమయాన తమ విధులను నిర్వహించకుండా ఆనాటి ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ పోలీసుల చేతులు కట్టేసేలా వ్యవహరించారని వెల్లడించిన ఐపిఎస్ అధికారి సంజీవ్ భట్ ఇప్పటికే జైలుశిక్ష అనుభవిస్తున్నారు. ఆయననూ తాజా కేసులో నిందితునిగా పేర్కొన్నారు. సెతల్వాద్ అరెస్ట్ కేవలం ఇన్‌స్పెక్టర్ స్థాయి క్రైం బ్రాంచి అధికారి ఫిర్యాదుతోనే జరిగిందని నమ్మే అమాయకులెవరూ లేరు. నాటి గుజరాత్ నరమేధంలో బాధితుల పక్షాన రెండు దశాబ్దాల నుండి సెతల్వాద్ అలుపెరుగకుండా పోరాడుతున్న విషయం దేశం మొత్తానికీ తెలుసు. మోడీ-షా ద్వయం ప్రోద్భలం లేకుండా గుజరాత్ పోలీసులు ఒక్క అడుగు ముందుకేయరు. కాబట్టి సెతల్వాద్ అరెస్ట్‌కు గల కారణం కనుక్కోవడానికి పెద్దగా కష్టపడాల్సిన పని లేదు.
2002 ఫిబ్రవరి 28న అహ్మదాబాద్‌లోని గుల్‌బర్గ్ సొసైటీలో అల్లరి మూకలు సృష్టించిన మారణహోమంలో కాంగ్రెస్ ఎం.పి. ఎV్‌ాసాన్ జాఫ్రి సహా 68 మంది హత్యగావించబడ్డారు. విచారించిన సిట్ మోడీకి, ఇతరులకు సంబంధం లేదని క్లీన్‌చిట్ ఇవ్వగా, న్యాయం కోసం జాఫ్రి భార్య జాకియా జాఫ్రి పలు కోర్టులను ఆశ్రయించారు. 2008లో సుప్రీం కోర్టు సిట్ వేయగా విచారణ చేపట్టి మోడీకి క్లీన్‌చిట్ ఇచ్చింది. సెతల్వాద్‌తో కలిసి జాకియా జాఫ్రి సుప్రీంకోర్టులో సవాల్ చేయగా శుక్రవారం ఆ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టేసింది. వెనువెంటనే హోం మంత్రి అమిత్‌షా స్పందిస్తూ ఇన్నేళ్లపాటు శివునికిమల్లే మోడీ నిందల గరళాన్ని బాధతో గొంతులోనే దాచుకున్నారని, సెతల్వాద్ తదితరులు తప్పుడు ఆరోపణలతో ఇబ్బంది పెట్టారని వ్యాఖ్యానించారు. తదుపరి ఇరవై నాలుగ్గంటల్లోపే సెతల్వాద్ అరెస్ట్ జరిగింది. ఈ పరిణామ క్రమానుగతాన్ని పరిశీలిస్తే ముమ్మాటికీ సెతల్వాద్ అక్రమ నిర్బంధం వెనుక మోడీ-షా ప్రేరణ అర్థమవుతుంది. కాగా విచారణ సందర్భంగా సుప్రీం త్రిసభ్య ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు విస్తుగొల్పుతున్నాయి. సుప్రీం వేసిన సిట్ న్యాయపర అప్పీళ్లకు వెలుపలిది. ఎవరైనా అప్పీలు చేసుకోవచ్చు. ప్రక్రియను దుర్వినియోగపర్చారని, సంచలనం కోసమేనని కోర్టు సందేహాస్పదంగా వ్యవహరించింది. బాధితుల న్యాయ పోరాటాన్ని తక్కువ చేయడంతోపాటు పిటిషనర్ల అరెస్టుకు ప్రేరేపించింది. దాంతో మోడీ-షా రెచ్చిపోతున్నారు.
సెతల్వాద్ అక్రమ అరెస్ట్ వేళ ప్రధాని మోడీ ఎమర్జెన్సీపై మన్ కీ బాత్‌లో, అలాగే జర్మనీ మ్యూనిచ్‌లో ప్రవాస భారతీయుల సమావేశంలో సుభాషితాలు వల్లించడం నేరస్తుడే నేరాలపై గుండెలు బాదుకున్నట్లుంది. నాడు కాంగ్రెస్ దేశంలో అత్యయిక పరిస్థితిని అధికారికంగా ప్రకటించింది. ఎనిమిదేళ్ల మోడీ పాలన యావత్తూ అప్రకటిత ఎమర్జెన్సీ అమల్లో ఉంది. రాజ్యాంగం పౌరులకు ప్రసాదించిన భావ ప్రకటనా స్వేచ్ఛపై దాడి కొనసాగుతున్నది. ప్రభుత్వాన్ని ప్రశ్నించే, నిరసన తెలిపే, భిన్నాభిప్రాయం వెలిబుచ్చే వారిపై దేశ ద్రోహం వంటి కఠినాతి కఠినమైన కేసులు బనాయిస్తోంది. ప్రజాస్వామిక వాదులను, హక్కుల కార్యకర్తలను, జర్నలిస్టులను వేధించడంతోపాటు జైళ్లల్లో నిర్బంధిస్తోంది. నాడు ఎమర్జెన్సీ విధించిన కాంగ్రెస్‌కు ప్రజలు ఎలాగైతే బుద్ధి చెప్పారో అప్రకటిత ఎమర్జెన్సీని పాటిస్తున్న బిజెపికీ అదే గతి పట్టిస్తారు. నియంతృత్వాన్ని నమ్ముకున్న పాలకులకు ఓటమి తప్పదన్నది ప్రపంచ చరిత్ర. ప్రజాతంత్ర భావాలు కలిగిన పౌరులకు, రాజ్యం పాత్రను ప్రశ్నించేవారికి ముప్పు తప్పదని సెతల్వాద్ అరెస్ట్‌తో మోడీ సర్కారు మరోసారి హెచ్చరిక చేసింది. సెతల్వాద్‌పై కక్షపూరితంగా పెట్టిన కేసులను రద్దుచేసి ఆమెను విడుదల చేయాలి. అక్రమ అరెస్ట్‌ను ప్రతి ఒక్కరూ ఖండించాలి. బిజెపి అప్రకటిత ఎమర్జెన్సీపై ప్రజాస్వామ్య వాదులు ఉద్యమించాల్సిన సమయమిది.