Jan 12,2021 07:42

                     అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి అంటే భయపడి వణికిపోయే ప్రభుత్వాలలో ముందు వరుసలో ఉండేది మోడీ ప్రభుత్వమే. అదే సమయంలో శ్రామిక ప్రజల పట్ల అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వాల్లోనూ మోడీ ప్రభుత్వానిదే ప్రథమ స్థానం. ఈ రెండు లక్షణాలూ ఒకే నాణేనికి బొమ్మ, బొరుసు లాంటివి. కరోనా మహమ్మారి కాలంలో మోడీ ప్రభుత్వం అనుసరించిన ఆర్థిక విధానం ఈ రెండు లక్షణాలనూ పూర్తిగా ప్రదర్శించింది.
కరోనా కారణంగా ఆదాయ వనరులు కోల్పోయిన ప్రజానీకానికి సంపన్న దేశాల ప్రభుత్వాలన్నీ సహాయం పేర ప్రత్యేక ప్యాకేజీలు అందించాయి. చివరికి డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం కూడా ఆ దేశ జిడిపిలో 10 శాతం ప్యాకేజీగా ఇచ్చింది. కొన్ని నెలలపాటు ప్రతీ ఇంటికీ నగదు బదిలీ చేసింది. మన దేశంలో దాదాపు అన్ని ప్రతిపక్ష పార్టీలు, ఆర్థికవేత్తలు, పౌర సమాజంలోని వివిధ సంస్థలు, సంఘాలు ఒకే మాటగా ఆదాయపు పన్ను పరిధిలోకి రాని ప్రతి ఇంటికీ తలా రూ.7,000 చొప్పున నెలకు సహాయం అందించమని కోరినప్పటికీ ప్రభుత్వం అటువంటిదేమీ చేయనేలేదు. కొన్ని ప్రత్యేక సమూహాలకు మాత్రం నామమాత్రం సహాయాన్ని ప్రకటించారు. అయితే, అది కూడా వారికెవరికీ ఇంతవరకూ దక్కిన దాఖలాలు లేవు. ఈ కరోనా మహమ్మారి విజృంభణతో అంతకు ముందు పనులు చేసుకునేవారిలో దాదాపు నాలుగో వంతు తమ పనులను కోల్పోయారు. ఎటవంటి ఆదాయమూ లేక నిరాధారంగా మిగిలారు. కాని ఈ ప్రభుత్వం వారికేసి కన్నెత్తి చూడలేదు.
అయితే ప్రభుత్వానికి అందుబాటులో ఉన్న, తేలికగా వినియోగించగలిగిన వనరులు కావలిసినన్ని ఉన్నాయి. మామూలుగా ప్రభుత్వం దగ్గర నిల్వ ఉండవలసిన ఆహార ధాన్యాల కన్నా నాలుగు రెట్లు నిల్వలున్నాయి. ఆ 10 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలతోబాటు ఇటీవలి కాలంలో ఎప్పుడూ పెరగనంతగా విదేశీ మారకపు నిల్వలు ఈ కాలంలో పెరిగాయి. నిరుపయోగంగా ఉన్న ఈ ధన, ధాన్యాల నిల్వలు ఒకవైపు, నిరుద్యోగం, దారిద్య్రం దుర్భర స్థితికి చేరుకున్న వైనం ఇంకొకవైపు ఉన్నాయి. ఆర్థిక శాస్త్రం ఏమాత్రం తెలిసివున్న వారెవరైనా ప్రభుత్వం ఇటువంటి సమయాల్లో మరింత ఎక్కువగా ఖర్చు చేయాలనే చెప్తారు. వనరులను నిరుపయోగంగా ఉంచడం శుద్ధ తప్పనే అంటారు. కాని మోడీ ప్రభుత్వం మాత్రం అలా చేయనేలేదు.
2020 మార్చి నాటికి 47,700 కోట్ల డాలర్ల విదేశీ మారకపు నిల్వలుంటే డిసెంబరు 2020 నాటికి అవి కాస్తా 58,000 కోట్లకు పెరిగాయి. దీనికి కారణమేమిటి? సంపన్న దేశాలలో గణనీయమైన స్థాయిలో సహాయ ప్యాకేజీలను అమలు చేశారు. దానివలన ఆయా దేశాలలో ద్రవ్యలోటు పెరిగింది. ఈ లోటును పూడ్చడానికి అదనంగా కరెన్సీని ముద్రించారు. మరోవైపు ఆ డబ్బును దాచుకోవడం వలన ఎటువంటి వడ్డీ రాకుండా వడ్డీ రేట్లను చాలా తక్కువ స్థాయిలో కుదించారు. దీనివలన మార్కెట్లో డబ్బు ప్రవాహం పెరిగింది. ఎక్కడ ఆ డబ్బును పెడితే లాభం వస్తుందా అని ప్రపంచమంతటా వారు గాలించారు.
సంపన్న దేశాలతో పోల్చితే భారత దేశంలో వడ్డీ రేట్లు ఎక్కువ. అందుచేత మన దేశంలోకి పెట్టుబడుల రాక ఈ కాలంలో పెరిగింది. మన రిజర్వు బ్యాంకు వాటిని విదేశీ మారకపు నిల్వలకు అదనంగా తోడు చేస్తూ పోతోంది. సంపన్న దేశాలు ఈ సంక్షోభ కాలంలో డబ్బు ప్రవాహాన్ని ప్రపంచవ్యాప్తంగా పెంచాలని ప్రయత్నిస్తున్న ఈ సమయంలో మన ప్రభుత్వం ఈ పరిస్థితిని ఉపయోగించుకుని ప్రభుత్వ వ్యయాన్ని పెంచి వుండాల్సింది. కాని మోడీ ప్రభుత్వం అలా చేయలేదు. విదేశీ మారకపు నిల్వలను ఊరికే పోగేసుకుంటూ వుంది. అంతే.
ఈ విషయంపై ప్రభుత్వ ప్రతినిధుల వాదనలు వేరుగా ఉంటాయి. ప్రభుత్వం విదేశీ మారకపు నిల్వలను వినియోగించడమంటే దిగుమతులను పెంచాలి. ఆ దిగుమతులు చెల్లుబాటు కావాలంటే ప్రభుత్వ వ్యయం పెంచి ప్రజల ఆదాయాలు పెంచాలి. ప్రభుత్వ వ్యయం పెరిగితే ద్రవ్యలోటు పెరుగుతుంది. ద్రవ్యలోటు పెరిగినందువలన మారకం రేటు పడిపోయి మన దేశం నుండి ఎప్పుడైనా హఠాత్తుగా విదేశీ పెట్టుబడులు బైటకు తరలిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. అప్పుడు తప్పనిసరి అవసరాల కోసం కూడా విదేశీ మారక ద్రవ్యం లేకుండా పోతుంది. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది. ఇదీ ప్రభుత్వం తరఫున వకాల్తా పుచ్చుకున్నవారి వాదన.
అయితే హఠాత్తుగా విదేశీ నిల్వలు తరలిపోతాయేమోనన్న భయంతో మొత్తం ఆ నిల్వలన్నింటినీ ఊరికే, ఏ విధంగానూ ఉపయోగించకుండా అట్టిపెట్టుకుంటే మన దేశం విదేశీ నిల్వలను భద్రపరిచే కేంద్రంగా మిగిలిపోతుంది. అవి రిజర్వుగా అట్టిపెట్టినందున వచ్చే వడ్డీ కన్నా మనం ఆ సొమ్ము పంపిన వారికి చెల్లించాల్సి వచ్చే వడ్డీ ఎక్కువ. ఇది ఎలాటిదంటే ఒక బ్యాంకు తన వద్ద డబ్బు డిపాజిట్‌ చేయడానికి వచ్చిన వారినుండి వచ్చిన సొమ్ము మొత్తాన్ని ఎవరికీ అప్పులివ్వకుండా మొత్తంగా తనవద్దనే అట్టిపెట్టుకుందనుకోండి. అప్పుడా బ్యాంకు పరిస్థితి ఏమవుతుంది? విదేశీ నిల్వల విషయంలో వాటిని ఏమీ వినియోగించకుండా ఊరికే ఉంచితే దేశం పరిస్థితీ అంతే.
మన దేశానికి వచ్చిన విదేశీ నిల్వలలో ఒక సగం దాచిపెట్టి తక్కిన సగాన్ని ఖర్చు చేస్తే ఏమవుతుంది? ఒక లెక్క వేసి చూద్దాం. మార్చి నెలాఖరు నుండి డిసెంబరు నెలాఖరు వరకు మధ్య కాలంలో మన దేశంలోకి వచ్చిన విదేశీ నిల్వల విలువ రూ. 6.7 లక్షల కోట్లు. దీనిలో సగాన్ని, అంటే రూ. 3.35 లక్షల కోట్లు-విదేశాల నుండి దిగుమతుల కోసం ఖర్చు చేశామనుకుందాం. అలా దిగుమతి అయిన సరుకుల వలన మన దేశంలో జిడిపి పెరుగుతుంది. మన జిడిపిలో దిగుమతుల శాతం 15. ఆ లెక్కన చూసినప్పుడు దిగుమతులు రూ. 3.35 లక్షల కోట్లు పెరిగితే జిడిపి రూ. 22 లక్షల కోట్లు పెరుగుతుంది. ప్రభుత్వం ఒక రూపాయి ఖర్చుపెడితే అది మార్కెట్‌లో రెట్టింపు డిమాండ్‌ను సృష్టిస్తుంది (ఉదాహరణకు-రూ. 7000 ఒక కుటుంబానికి ప్రభుత్వం సహాయం చేసిందనుకోండి. ఆ సొమ్ముతో ఆ కుటుంబం సరుకులు కొంటుంది. ఆ మేరకు మార్కెట్లో అదనంగా సరుకులకు డిమాండ్‌ పెరుగుతుంది. తిరిగి ఆ మేరకు సరుకులు తయారు చేయడానికి పెట్టుబడి వస్తుంది. వాటిని తయారు చేసే కార్మికుడికి ఆ మేరకు జీతం వస్తుంది. ఆ జీతంతో అతడు మళ్ళీ సరుకులు కొంటాడు. ఇలా ప్రభుత్వ ఖర్చుకి కనీసం రెట్టింపు డిమాండ్‌ ఏర్పడుతుంది). ఇప్పుడు పెరిగిన జిడిపి రూ. 22 లక్షల కోట్లను అందుకోడానికి ప్రభుత్వం రూ. 11 లక్షల కోట్ల అదనపు వ్యయం చేస్తే చాలు.
ప్రభుత్వం రూ. 11 లక్షల కోట్లు అదనంగా ఖర్చు చేస్తే జిడిపి రూ. 22 లక్షల కోట్లు పెరుగుతుంది. ఈ క్రమంలో ప్రభుత్వానికి అదనంగా పన్నుల రూపంలో రూ. 3.3 లక్షల కోట్లు సమకూరుతుంది (జిడిపి-పన్నుల ఆదాయం నిష్పత్తి 15 శాతం జుమారుగా ఉంటుంది). అంటే ఇక ప్రభుత్వం అదనంగా రూ. 7.7 లక్షల కోట్ల ద్రవ్యలోటుకు సిద్ధపడాలన్నమాట (మొత్తం అదనపు వ్యయం రూ. 11 లక్షల కోట్లు-పన్నుల ద్వారా ఆదాయం రూ. 3.3 లక్షల కోట్లు= రూ.7.7 లక్షల కోట్లు). ఇది 2019-20 జిడిపిలో 3.5 శాతం. ఇప్పుడు బడ్జెట్‌లో నిర్ణయించిన ద్రవ్యలోటు 4 శాతానికి ఈ 3.5 శాతాన్ని కూడా కలిపితే మొత్తం ద్రవ్యలోటు అప్పుడు 7.5 శాతం అవుతుంది.
ఈ లెక్క చాలా ఎక్కువ జాగ్రత్తలు తీసుకుని వేసినది. చాలామంది మన ద్రవ్య లోటు 12 శాతం దాకా పెంచడం మంచిదని వాదిస్తున్నారు. ఇక్కడ మనం పరిగణన లోకి తీసుకోవలసిన అంశం ద్రవ్యలోటును ఎంతవరకూ పెంచుకోవచ్చునన్నది కాదు. అసలు మోడీ ప్రభుత్వం అదనపు ప్రభుత్వ వ్యయాన్ని ఏ మేరకైనా సరే చేపడుతుందా లేదా అన్నదే అసలు విషయం. ఈ ప్రభుత్వం అటువంటి అదనపు వ్యయాన్ని పిసరంతైనా చేయడానికి సిద్ధపడలేదు. కేవలం నాలుగు గంటల నోటీసు ఇచ్చి అత్యంత క్రూరమైన, నిరుపయోగమైన లాక్‌డౌన్‌ను మాత్రం అత్యంత నిర్లక్ష్యపూరితంగా ప్రకటించింది. తాను చాలా తేలికగా ప్రజలకు సహాయం అందించగలిగినప్పటికీ ఏ సహాయమూ అందించలేదు. కోట్లాది శ్రమజీవులు దీని ఫలితంగా పనులను, ఆదాయాలను కోల్పోయారు.
ఈ ప్రభుత్వం ఎందుకు ఈ విధంగా చేసింది? కేవలం అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి విధించిన ద్రవ్యలోటు హద్దులను దాటే ధైర్యం లేనందువల్లనే, తన పిరికితనం వల్లనే మోడీ ప్రభుత్వం ఈ విధంగా చేసింది. ఎఫ్‌ఆర్‌బిఎం చట్టం ఈ అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడిని సంతృప్తి పరిచేందుకే చేశారు. కేంద్ర ప్రభుత్వానికి 3 శాతం ద్రవ్యలోటు పరిమితిని ఆ చట్టం విధించింది. ఇదే తరహా చట్టాలు ఇతర దేశాలలోనూ ఉన్నాయి. కాని ఆ ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కారణంగా చూపించి తమ ద్రవ్యలోటు పరిమితులను అధిగమించి ఖర్చు చేశాయి. ఆ విధంగా చూపించి ఖర్చు చేయగలిగే ధైర్యం మన ప్రభుత్వానికి లేకపోయింది. కనీసం ప్రజలు పడుతున్న తీవ్రమైన బాధలు కూడా ఈ ప్రభుత్వాన్ని కాస్తంతైనా కదిలించలేకపోయాయి. ప్రజలకూ, అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడికీ మధ్య ఈ మహమ్మారి కాలంలో తలెత్తిన వైరుధ్యంలో ప్రభుత్వం ప్రజల వైపున నిలవకుండా అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి వైపున నిలబడింది. కనీసం ఒక నిరసన కూడా తెలపలేదు.
మోడీ ప్రభుత్వ నిర్లక్షం అక్కడితో ఆగలేదు. ఏ ప్రజాస్వామ్య దేశంలోనైనా అధికార పార్టీ ప్రజలను పట్టించుకోకపోతే ఎన్నికల్లో ఓటమిపాలౌతానన్న భయంతో ఉంటుంది. సంపన్న దేశాల ప్రభుత్వాలు, చివరికి డొనాల్డ్‌ ట్రంప్‌ తో సహా, అందుకే తమ తమ ప్రజలకు గణనీయంగా సహాయ ప్యాకేజీలు అందించారు. వారికి ఏదో ప్రజలపై చాలా ప్రేమ ఉండినందువల్ల కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థల ఒత్తిళ్ల వలన ఆ విధంగా చేశారు. కాని మోడీ ప్రభుత్వం ఆవిధంగా కూడా చేయలేదు. అంటే ఈ ప్రభుత్వానికి ప్రజాస్వామ్య వ్యవస్థలంటే ఏమాత్రమూ లెక్కలేదు.
సరిగ్గా సమయం చూసి ఏదోవిధంగా హిందూత్వ ఎజెండాను ముందుకు తేవడం, ఎన్నికల ముందు, తర్వాత ప్రతిపక్ష పార్టీల నుండి ఫిరాయింపులను ప్రోత్సహించడం, అందుకు విపరీతంగా డబ్బును ఉపయోగించడం బిజెపి బాగా నేర్చింది. మత విద్వేషాలను రెచ్చగొట్టి రక్తపుటేరులను పారించడానికి అదేమీ వెనుకాడదు. రాజకీయాన్ని ఎంతగా ఒక సరుకుగా మార్చిందంటే ప్రజలు ఎవరికి ఓటు చేసినా, గెల్చిన వారిని కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని మాత్రం ఆ పార్టీయే ఏర్పాటు చేస్తోంది.
అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడిని ఎదుర్కోలేని పిరికితనం, ప్రజల పట్ల నిర్లక్ష్య వైఖరి, బాధ్యతా రాహిత్యం, ఎన్నికలను తొత్తడం చేసి ప్రజాస్వామ్యాన్నే అపహాస్యం చేయడం-ఈ లక్షణాలతో మోడీ ప్రభుత్వం ప్రపంచంలోకెల్లా అత్యంత మితవాద, అభివృద్ధి నిరోధక ప్రభుత్వంగా ఉందని చెప్పాలి.

prabhat

                                                                     

                                                      ప్రభాత్‌ పట్నాయక్‌,(స్వేచ్ఛానుసరణ)