కరోనా, లాక్‌డౌన్ ప్రభావం విజయనగరం పట్టణ పేదలపై ఏ విధంగా పడిందో చూద్దాం. విజయనగరం జిల్లా కేంద్రం ఈ మధ్యనే కార్పొరేషన్‌గా మారింది. 2011 జనాభా లెక్కల ప్రకారం సుమారు 3 లక్షల మంది జనాభా వున్న నగరం. వెనుకబాటుకు తోడు ఫ్యాక్టరీల మూత..మరోవైపు కరోనా..పట్టణ ప్రజల్ని, వారి జీవితాల్ని అతలాకుతలం చేశాయి. పట్టణంలో సుమారు 5 వేలు పాజిటివ్ కేసులుంటే 4 వేల పైన పేదవాళ్ళే. జూట్ మిల్లుల్లో ఉపాధి కోల్పోయిన వారు హోటళ్లు, బట్టల షాపులు, ఎటిఎం, ప్రైవేట్ స్కూళ్లు, ఆసుపత్రుల దగ్గర సెక్యూరిటీ గార్డులుగా చేరి కుటుంబాలను పోషించుకున్నారు. కరోనా దెబ్బకు హోటళ్లు, సినిమా థియేటర్లు, షాపులు, షాపింగ్ మాల్స్, విద్యా సంస్థలు, హాస్పటల్స్, కళ్యాణ మండపాలు మూతపడ్డాయి. దీంతో అందులో పని చేసే వేలాది మంది కార్మికులకు ఉపాధి లేకుండా పోయింది. వీటిపై ఆధారపడి రవాణా రంగం ఆటో, క్యాబ్‌లు, టాటా ఏసి, లారీ, వ్యాన్లు తదితర వాహనదారులకు పని లేకుండా పోయింది. ముఠా కళాశీ, స్వర్ణకారులు వాయిద్యకారులు, ఇంటిపని వారు, చెప్పులు కుట్టుకునేవారు, మ్యాంగో సరఫరా చేసేవారు, వంట మాష్టర్లు, మేదర్లు, కుమ్మర్లు, వీధి భాగోతాలు వేసే కళాకారులు, జానపద కళాకారులు, పాత ఇనుప సామాన్లు, గాజు సీసాలు సేకరించి అమ్మేవారు, పాత సామాన్ల షాపుల్లో పని చేసేవారు, హోమ్ నీడ్స్ ఇంటింటికి వెళ్ళి అమ్మేవారు, కుటీర పరిశ్రమల్లో చేగోడీలు, పప్పు ఉండలు, జీడిపప్పు తయారీ కంపెనీల్లో పనిచేసేవారు, సిల్వరు కంపెనీల్లో పని చేసే కార్మికులు, టైలర్లు, ఫొటోగ్రాఫర్లు ఇలా సుమారు 60 పైన వృత్తులు చేసుకొని బతికే ప్రజలు ఉపాధి లేక రోడ్డున పడ్డారు. గుడిలో పూజార్లకి దక్షిణతో పాటు కొబ్బరికాయ రూపంలో ఉపాధి ఉండేది. అది పోయింది.
భవన నిర్మాణ కార్మికులలో 10,000, తోపుడుబళ్ల వ్యాపారులు 10,000, ముఠా కళాసీలు 4000, వంట పనివారు 5000, ఆటోడ్రైవర్లు 8000, లారీ ట్రాన్స్‌పోర్టు 2000, ప్రైవేటు స్కూళ్ల టీచర్లు 3000, ఇంటి పనివారు 4000 ఉపాధి కోల్పోయారు. పైన తెల్పిన వివిధ రకాల వ్యాపకాలన్నీ కరోనా కాలంలో నిలిచిపోవడంతో మరో 38 వేల మందికి పైగా ఉపాధి కోల్పోయారు. ఉపాధి పోయి 5 నెలలైంది. యజమానులు జీతాలివ్వడంలేదు. చేతిలో ఉన్నదంతా ఖర్చైపోయింది అప్పులు దొరకడంలేదు. వీరి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇంజనీరింగ్ చదివి మేథమెటిక్స్ చెప్పే రవి పెయింటింగ్ కూలికి పోతున్నాడు. అక్కడకూడా పని దొరకడం లేదు.
షాపింగ్‌మాల్స్, బట్టలషాపులు రెండు నెలలు పూర్తిగా మూతపడ్డాయి. ఆ కాలానికి ఒక్క రూపాయి జీతం ఇవ్వలేదు. 3 నెలలుగా ఒక పూట నడుస్తున్నాయి. అందులోనూ రోజు తప్పించి రోజు ఒక్కో కార్మికునికి ఒక పూట మాత్రమే పని ఉంటుంది. అంటే ఒక కార్మికునికి నెల రోజుల్లో కేవలం 15 పూటలు అంటే 7 రోజులు మాత్రమే పని ఉంటుంది. ఆ కార్మికునికి రోజు కూలి 300 అంటే 2100 మాత్రమే నెల మొత్తం వస్తుంది. అది అద్దెకు కూడా చాలదు. ఇక కుటుంబ పోషణ అగమ్యగోచరమే.
భవన నిర్మాణ కార్మికులకు కరోనా కాలం 5 నెలలు.. అంతకు ముందు ఇసుక సమస్యతో 5 నెలలు.. మొత్తం 10 నెలలుగా పనే లేదు. ఏం చేయాలో తెలీక బ్రాందీ షాపుల ముందు మహిళా కూలీలు సైతం క్యూలో నిలబడి మందుకొని బ్లాక్‌లో అమ్ముకునే ఉపాధి వెతుక్కు న్నారు. వీరికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సహాయం, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.10 వేల సహాయం భవన నిర్మాణ సంక్షేమ బోర్డు ద్వారా నేటికీ అందలేదు.
ట్యాక్సీ, టాటా ఏసి, క్యాబ్, లారీ తదితర మోటారు వాహనాలు నడుపుకొని బతికేవారి పరిస్థితి మరీ దుర్భరం. లాక్‌డౌన్ కారణంగా రోడ్డు పైకి వచ్చి వాహనం తిప్పే పరిస్థితి లేదు. రోడ్డు మీదకు వచ్చి ఆటో వేస్తే ఎక్కేవారు ఇద్దరే. ఎక్కువ మంది ఎక్కితే కేసులు. వచ్చేది తక్కువ, కేసులకు కట్టేది ఎక్కువ. అద్దె ఆటోల పరిస్థితి మరీ దారుణం. అద్దె కట్టలేని పరిస్థితి. ఫైనాన్స్ కట్టే ఆటోలు, ఫైనాన్స్ కట్టకపోతే ఫైనాన్స్‌వాడు తీసుకుపోతారు. ఇవి కొన్ని ఉదాహరణలు.
పేదల పోరుబాట..అండగా ప్రజా సంఘాలు...
మే 20 నుండి 23 వరకు తోపుడు బళ్ళ కార్మికులకు రూ.10 వేలు ఇవ్వాలని కోరుతూ వందల మందితో వార్డు సచివాలయాల దగ్గర నిరసనలు, 24న సమ్మె, ఆఫీసు ముట్టడి చేశాం. మే 23 నుండి 27 వరకు భవన నిర్మాణ కార్మికుల పోరాటంలో 2000 మంది వార్డు, సచివాలయాల దగ్గర పాల్గన్నారు. మే 29న 2000 మందితో కలెక్టరేట్ గర్జన కార్యక్రమం చేపట్టాం. పోరాటం ఫలించింది. మెప్మా ద్వారా తోపుడుబళ్ళ వాళ్ళకు రూ.10,000 సూక్ష్మ రుణం ఇస్తామని, భవన నిర్మాణ కార్మికులకు ఆదుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే 2000 మంది తోపుడుబళ్ళ కార్మికులు, 2000 మంది భవన నిర్మాణ కార్మికులకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేయించాం. మే 30 నుండి జూన్ 4 వరకు పట్టణంలో మహిళలకు ఉపాధి కల్పించాలని, ఇంటి పని కార్మికులకు రూ.10 వేల చొప్పున ఇవ్వాలని డిమాండు చేస్తూ వందలాది మందితో సచివాలయాల దగ్గర నిరసనలు... జూన్ 4న కలక్టరేట్ ముట్టడి చేశాం. పట్టణ పౌర సంక్షేమ సంఘం, ఐద్వా ఆధ్వర్యంలో జరిగిన ఈ పోరాటంతో లేబర్ అధికార్లు కదిలి ఇంటిపనివారల సర్వే చేపట్టారు. 2800 మందిని రిజిస్ట్రేషన్ చేశారు. 'స్నేహ' ఇంటి పనివారి సంఘంలో 300 మంది సభ్యులుగా చేరారు. వారికి గుర్తింపు కార్డులు ఇచ్చాం. కళ్యాణ మండపాలు మూతపడడం, శుభకార్యాలు ఆగిపోవడంతో పని కోల్పోయిన 'వంటపని' కార్మికులను కూడగట్టి పోరాడాం. విడివిడిగా వున్న వీళ్ళందరిని ఒక్కటి చేసి విజయనగరం జిల్లా కుక్ మాష్టర్లు, హెల్పర్లు మరియు కార్మికుల సంఘం ఏర్పరిచాం. వయస్సు పైబడిన దళితులు ఎక్కువమంది రిక్షా తొక్కే పనిలో ఉన్నారు. వీరందరికి రాష్ట్ర ప్రభుత్వం ఏమీ ఇవ్వలేదు. ఆదుకోలేదు. దీంతో వీరిని కదిలించి పోరాడాం. ఇప్పుడు అందరిని సంఘంలో చేర్పించాం. ఆటో కార్మికులకు సంఘాలు ఏర్పాటు చేశాం. ఈ పోరాటాల ఫలితంగా వీరంతా సంఘటితమయ్యారు. ప్రభుత్వం ప్రకటించిన సహాయం అందకపోతే మరో పోరాటానికి సిద్ధం చేయక తప్పదు.
'మాన్సాస్ కోటలో ఆకలి కేకలు'
మాన్సాస్ విద్యా సంస్థలకు ఎంతో ప్రతిష్ట ఉంది. కాని గత 5 నెలలుగా మార్చి నుండి నేటి వరకు టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్‌కి జీతాలు ఇవ్వలేదు. తక్షణమే జీతాలు చెల్లించాలని పట్టణ పౌర సంక్షేమ సంఘం జూలై 23న కార్యక్రమం చేపట్టింది. జూలై 27 కలెక్టర్‌కు వినతిపత్రం, ఆగష్టు 7 కలెక్టరేట్ వద్ద ధర్నా, చివరికి ఆగష్టు 15న కోట ముందు భిక్షాటన కార్యక్రమం చేపట్టాం. దీంతో నాన్ టీచింగ్ స్టాఫ్ మద్దతు తెలిపారు. భిక్షాటనకు వచ్చారు. టీచింగ్ స్టాఫ్ విడిగా ఆందోళన చేశారు. భిక్షాటన కార్యక్రమంతో పాటుగా 'మాన్సాస్ కోటలో ఆకలి కేకలు' నినాదం అందరినీ ఆకర్షించింది. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నుండి మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు వరకు పోరాటాన్ని బలపర్చాల్సి వచ్చింది. చివరికి ఆగష్టు 19న కలెక్టరు కలగజేసుకొని రూ.3 కోట్ల 10 లక్షలు రిలీజ్ చేసి అందరికి జీతాలు ఇవ్వక తప్పలేదు. భవిష్యత్ పోరాటాలకు ఇది మరింత బలాన్నిస్తుంది.
రెడ్డి శంకరరావు
(వ్యాసకర్త విజయనగరం నగర సిపిఎం కార్యదర్శి)










