హవానా : కోవిడ్ - 19 మహమ్మారిపై పోరులో ఇతర దేశాలకు సహకరించేందుకు అన్నివిధాలుగా సిద్ధంగా ఉన్నామని క్యూబా ప్రధాని మాన్యుయేల్ మర్రేరో క్రుజ్ పేర్కొన్నారు. ఇందులో భాగంగా కరోనాను ఎదుర్కోనే క్రమంలో తాము తీసుకున్న చర్యల గురించి యురేషియన్ ఎకనామిక్ యూనియన్(ఇఇయు)తో పంచుకుంటామని తెలిపారు. కజకిస్తాన్ రాజధాని నూర్‌సుల్తాన్‌లో శుక్రవారం ఆన్‌లైన్‌లో జరిగిన యురేషియన్ ఇంటర్‌గవర్నమెంటల్ కౌన్సిల్ సమావేశాన్ని ఉద్దేశించి మాన్యుయేల్ ప్రసంగించారు. ఈ సమావేశంలో యురేషియన్ సభ్యదేశాలకు చెందిన ప్రతినిధులు, ఇతర పరిశీలకులు పాల్గన్నారు. సవాళ్లను ఎదుర్కొనేందుకు దేశాల మధ్య సంఘీభావం, బహుపాక్షికత, సహకారం ఎంత అవసరమో ఈ కరోనా వైరస్ ప్రభావం స్పష్టం చేసిందని మాన్యుయేల్ అన్నారు. ఇఇయు ప్రతిపాదించిన ఇంటిగ్రేషన్ ప్రాజెక్టులను ముందుకు తీసుకొచ్చేందుకు క్యూబా కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. క్యూబా ప్రధానంగా వైద్య సహకారం, బయో టెక్నాలజీ, వ్యాక్సిన్ ఉత్పత్తి విషయంలో మద్దతు అందించగలదని వివరించారు.
2025 వరకు యురేషియా ఎకనామిక్ ఇంటిగ్రేషన్ అభివృద్ధికి వ్యూహాత్మక మార్గాలను అమలు చేయడంలో సాయపడేందుకు తమ దేశం సుముఖంగా ఉందని మాన్యుయేల్ ప్రకటించారు. ఇది తమ దేశ ఆర్థిక, సామాజిక అభివృద్ధి ప్రణాళికా2030కు పూర్తిగా అనుగుణంగా ఉందని అన్నారు. ఇంధన, పారిశ్రామిక, రవాణా, పర్యాటకం, ఆర్థిక రంగాలపై దృష్టి సారించిన యురేషియన్ కార్యక్రమాలపై పాల్గంటామని పేర్కొన్నారు. ఇఇయు లక్ష్యాలను చేరుకోవడంలో తమ సామర్ధ్యం మేర శక్తివంచన లేకుండా కృషి చేస్తామని మాన్యుయేల్ ఈ సందర్భంగా హమీఇచ్చారు.










