Jan 25,2021 20:50

ది హేగ్‌ : కరోనా వైరస్‌ కొత్త ముప్పుతో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల సరిహద్దుల వద్ద సోమవారం నుండి ఆంక్షలు మరింత కఠినతరం చేశారు. పలు దేశాల సరిహద్దులు మూతపడ్డాయి. కరోనా కారణంగా విధించిన ఆంక్షల పట్ల ఆగ్రహం వ్యక్తం కావడంతో వారాంతంలో నెదర్లాండ్స్‌లో ఘర్షణలు తలెత్తాయి. బ్రిటన్‌, దక్షిణాఫ్రికాల్లో తలెత్తిన కొత్త కరోనా స్ట్రెయిన్‌ పట్ల ఆందోళనలు మరింత తీవ్రమవుతున్న నేపథ్యంలో ఫ్రాన్స్‌, ఇజ్రాయిల్‌, స్వీడన్‌లతో పాటు అమెరికా కూడా ఆంక్షలను నిర్దిష్ట స్థాయి వరకు విధించనుంది. గత రెండు మాసాల్లో న్యూజిలాండ్‌లో మొదటి కేసు నమోదైంది. పొరుగు దేశాల నుండి వచ్చే సముద్ర, వైమానిక మార్గాల్లో వచ్చే వారు తప్పనిసరిగా పిసిఆర్‌ టెస్ట్‌ నెగెటివ్‌ రిపోర్టు అందచేయాలని ఫ్రాన్స్‌ ఆదివారం నుండి కోరుతోంది. పొరుగున గల నార్వే నుండి మూడు వారాల పాటు ఎవరినీ రానివ్వబోమని స్వీడన్‌ తెలిపింది. ఓస్లోలో బ్రిటీష్‌ స్ట్రెయిన్‌ కేసులు మరిన్ని బయటపడడంతో ఈ చర్య తీసుకుంది. అరుదైన సందర్భాల్లో మినహా గగనతల సరిహద్దులను వారం రోజుల పాటు మూసివేస్తున్నట్లు ఇజ్రాయిల్‌ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు.
నెదర్లాండ్స్‌లో కరోనా కర్ఫ్యూ పట్ల ఆగ్రహించిన ప్రజలు పోలీసులతో ఘర్షణ పడ్డారు. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఆదివారం లూటీలు జరిగాయి. వందలాది మంది ధర్నాలకు సిద్దం కావడంతో ఆమెస్టర్‌డామ్‌లో పోలీసులు జల ఫిరంగులను ఉపయోగించారు. ఇంద్‌హౌవిన్‌లో 30 మందిని అరెస్టు చేసినట్లు నగర మేయర్‌ విలేకర్లకు తెలిపారు. 2019 డిసెంబరులో బయటపడిన తర్వాత కరోనాతో ఇప్పటివరకు 21 లక్షల మంది మరణించారు. దాదాపు పది కోట్లకు చేరువలో కేసులు నమోదయ్యాయి.