Jul 29,2022 19:33

'ప్రపంచంలో ఏదేని ఒక భౌగోళిక ప్రదేశంలో వ్యాపిస్తున్న వైరస్‌లు, అంటువ్యాధులు ప్రపంచంలోని మిగిలిన ప్రాంతాలను హెచ్చరిస్తున్నాయి. నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ నిర్మూలనా లక్ష్యాలు సాధించేందుకు నిర్ధిష్ట ప్రయత్నాలు జరగడం లేదు. ప్రజారోగ్య నిర్వహణలో నిరంతర కసరత్తుకు ప్రముఖ ప్రాధాన్యత ఇవ్వాలి. లేనిపక్షంలో ప్రతి దశలో ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉంటార'ని ప్రముఖ వైద్య నిపుణులు వైరాలజిస్ట్‌ డాక్టర్‌ గగన్‌దీప్‌ కాంగ్‌, అంటువ్యాధుల నిపుణులు డాక్టర్‌ చంద్రకాంత్‌ లహరియా అంటున్నారు.

ప్రపంచ దేశాలను అల్లకల్లోలం చేస్తున్న కరోనావైరస్‌ వరసగా నాలుగోసారి ప్రపంచంపై విరుచుకుపడుతున్న వేళ ఊహించని ఉపద్రవంలా మంకీపాక్స్‌ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గత జూన్‌లో లండన్‌లో మురికినీటి వైరస్‌ల బహుళ రూపాలను కనుగొనే ప్రక్రియలో భాగంగా చేసిన పరిశోధనల్లో అక్కడ పోలియో వ్యాపించే ప్రమాదముందని వైద్య అధికారులు గుర్తించారు. అయితే ఇప్పటికే లండన్‌ ప్రజల్లో అధికశాతం మంది పోలియో నియంత్రణ టీకాలు వేసుకుని ఉన్నందున సాధారణ ప్రజలకు ఈ ప్రమాదం తక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. కానీ రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి వైరస్‌ సోకే ప్రమాదం లేకపోలేదు. దీంతో వారి వివరాలు వెంటనే నమోదు చేయాలని యుకె హెల్త్‌ సెక్యూరిటీ ఏజెన్సీ వైద్య అధికారులను ఆదేశించింది.
            ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే గత రెండు దశాబ్దాలుగా ప్రపంచంలో ఏదో ఒక మూల పాత వ్యాధుల వ్యాప్తి తరచూ కనపడుతోంది. వీటిలో హెచ్‌ఐవి ఇన్ఫెక్షన్లు, సార్స్‌, లైమ్‌ వ్యాధి, ఎస్చెరిచియా కోలి, హాంటావైరస్‌, డెంగ్యూ జ్వరం, వెస్ట్‌ నైల్‌, జికా వైరస్‌లు ఇప్పటికే కనిపిస్తున్నాయి. ఇవన్నీ గతంలో క్షీణించిన వైరస్‌లే. మళ్లీ ఇప్పుడు కనిపిస్తున్నాయి. అభివృద్ధి చెందేవిగానూ ఉంటున్నాయి.
         ప్రజారోగ్య నిర్వహణలో అలసత్వం, రోగనిరోధకతను తప్పించుకునే దిశగా సూక్ష్మజీవులు రూపాంతరం చెందడం, వ్యాక్సిన్‌ సమీకరణలు, పరిశోధనలో మందగమనం కారణంగా వైరస్‌లు మళ్లీ మళ్లీ పునరావృతం జరుగుతుండవచ్చు. ప్రస్తుతం ప్రముఖంగా వార్తల్లో వినిపిస్తున్న మంకీపాక్స్‌ వైరస్‌ ఆ జాబితాలోదే. ఒకదాని తరువాత మరొకటి పాత ఇన్ఫెక్షన్లు ఇంత దూకుడుగా విజృంభిస్తున్నందున వ్యాక్సిన్‌ అభివృద్ధి, పరిశోధనలు వేగవంతం చేయడాన్ని హెచ్చరిస్తున్నట్లుగా భావించాలి.
          మన చుట్టూ ఎన్నో వైరస్‌లు, బాక్టీరియాలు ఉంటాయి. వాటితో కలసి జీవిస్తుంటాం. అయితే నిఘా వ్యవస్థల ద్వారా వైరస్‌ వ్యాప్తి చెందిన వారిని ముందస్తుగా గుర్తించడం వల్లనే సమర్థవంత నియంత్రణ చర్యలు చేపట్టగలం. ప్రస్తుతం వ్యాక్సిన్‌ ప్రక్రియ పూర్తిగా స్తంభించిన తరుణంలో రోగనిరోధకశక్తి పూర్తిగా బలహీనపడి పాత వైరస్‌లు విజృంభించే అవకాశం ఉంది. అంతరించిపోయాయనుకున్న అంటువ్యాధులు తిరిగి రావడానికి ఇది అనువైన కాలం. అందుకే ప్రజారోగ్య నిర్వహణ నిరంతర కసరత్తుగా ఉండాలి. లేనిపక్షాన ప్రతి దశలో ప్రజారోగ్యం ప్రమాదంలో పడుతుంది.
             ప్రపంచాన్ని కలవర పెడుతున్న మంకీపాక్స్‌ గురించి చెప్పాలంటే వ్యాధిని గుర్తించడం, నిర్ధారణ చేయడం, సోకిన వ్యక్తుల ప్రథమ కాంటాక్టులను వేగంగా గుర్తించడం, గాయాలన్నీ నయమయ్యే వరకు వైరస్‌ సోకిన వ్యక్తిని ఇతరులకు దూరంగా ఉంచడం వంటి వాటిపై ప్రజలు, వైద్యులు అప్రమత్తంగా ఉండాలి. అందుబాటులో ఉన్న టీకాలు, ఔషధాలు ఉపయోగించాలి. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ప్రజారోగ్య చర్యలు, సహాయక చికిత్సలు వేగవంతం చేయాలి. రోగనిర్ధారణ, ఐసోలేషన్‌ వంటివాటిపై ఆయా దేశాలు అవలంబిస్తున్న చర్యలే వ్యాధి తీవ్రతను తగ్గించేవిగా ఉంటాయని వైరాలజిస్ట్‌ ప్రొఫెసర్‌, గగన్‌దీప్‌ కాంగ్‌ ది వెల్‌కమ్‌ ట్రస్ట్‌ రీసెర్చ్‌ లాబొరేటరీ, గ్యాస్ట్రో ఇంటెస్టినల్‌ సైన్సెస్‌ విభాగం, క్రిస్టియన్‌ మెడికల్‌ కాలేజ్‌ వెల్లూరు ఆ నిర్వహణా చర్యలను సమర్ధిస్తున్నారు.

పాత వైరస్‌లే మళ్లీ విజృంభిస్తున్నాయా?
            ఈ మధ్యకాలంలో కొత్త కొత్త వైరస్‌లు విజృంభించడంలో ప్రధాన కారణం వాతావరణ మార్పులని కొంతమంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దానిపై స్పందిస్తూ.. 'వ్యాధుల పుట్టుకకు అనేక కారణాలు ఉంటాయి. అటవీ నిర్మూలన, వాతావరణ మార్పు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, ప్రణాళిక లేని పట్టణీకరణ, యాంటీమైక్రోబయాల్స్‌ విచక్షణారహిత వినియోగం, ప్రత్యక్ష అడవి జంతువుల విక్రయాలు వంటివి. ఇవన్నీ నియంత్రించగలిగే అంశాలే. ఇప్పటికే యాంటీబయాటిక్స్‌ మితిమీరిన వినియోగం భారీ మూల్యం చెల్లించింది. అతిగా పేరుకుపోయిన యాంటీబయాటిక్స్‌ వ్యాధిని కలిగించే సూక్ష్మజీవులు ఔషధాలకు నిరోధకంగా మారడానికి దారితీస్తున్నాయి. ఇది ఎక్కడికి దారితీసిందంటే ఒకప్పుడు చికిత్సకి లొంగి, నియంత్రించబడే వ్యాధులే తీవ్రరూపం దాల్చుతున్నాయి. నియంత్రణ కోసం కొత్త ప్రోటోకాల్స్‌ పాటించాల్సి వస్తోంది' అంటున్నారు లహరియా.
            ఇప్పుడు మనకు వ్యాపిస్తున్న వైరస్‌లన్నీ ప్రయాణ సమయంలో వ్యాపించినవేనని తేటతెల్లమవుతోంది. దీంతో ప్రయాణ వేళల్లో కొత్త ప్రోటోకాల్స్‌ పాటించడంపై ప్రభుత్వాలు దృష్టి పెడుతున్నాయి. ఇప్పటికే అంతర్జాతీయ ప్రయాణాలపై కొత్త ఆంక్షలు అమలు చేస్తున్నారు. అయినా మంకీపాక్స్‌ వ్యాప్తి చెందుతుందంటే అర్థం కోవిడ్‌ సమయంలో ప్రభుత్వాలు చేసిన వాగ్దానాలు నెరవేర్చలేదని స్పష్టమవుతోంది. ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలి. అలాగే ప్రతి ఒక్కరూ నియంత్రణా చర్యలు చేపట్టాలి. ప్రయాణాలు ఎక్కువగా చేసేవారు తగు జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణం చేసే ప్రాంతంలో వైరస్‌ వ్యాప్తిపై అవగాహన ఉండాలి. రోగనిరోధక శక్తిని పొందే ఆహారాలు, ఔషధాలు తీసుకోవాలి. మహమ్మారి కట్టడిచేసే అతిప్రధాన సూచన భౌతికదూరం పాటించడం, మాస్కులు ధరించడం, శరీర పరిశుభ్రతను కాపాడుకోవడం వంటివి దైనందిన జీవితంలో భాగం కావాలి.