Aug 08,2023 16:04

'శ్రీ ఫలం' అని పిలువబడే ఉసిరికాయలో ఎన్నో ఔషధ విలువలు ఉన్నాయి. విటమిన్‌ 'సి' పుష్కలంగా ఉన్న ఫలం. ఇది ఆయుర్వేద వైద్యంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. తల వెంట్రుకల మొదలు కాలి గోళ్లు వరకు ఉసిరి మానవ శరీరానికి అద్భుతంగా ఉపయోగపడే సర్వరోగ నివారిణి. ప్రతి రోజూ ఒక ఉసిరికాయను తింటే అన్ని రకాల పైత్యాలు తగ్గుతాయి. కఫం తగ్గుతుంది. మేథస్సు పెరుగుతుంది. మూల వ్యాధులు తగ్గిపోతాయి. శారీరక బలం పెరుగుతుంది. మధుమేహం వ్యాధి తగ్గుతుంది. డయాబెటిస్‌తో బాధపడేవారికి ఉసిరికాయ అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో అవసరమైన విటమిన్‌ ''సి'' అధికంగా ఉంటుంది. ఉసిరికాయ ఇన్సులిన్‌ ఉత్పత్తి చేసే కణాలను పెంచుతుంది. షుగర్‌ వ్యాధితో బాధపడుతున్న వారు ఉదయాన్నే ఒక మంచి ఉసిరి కాయ తినడంతో నియంత్రణలో ఉంటుంది. ఉసిరికాయ, తేనె, కరక (త్రిఫల) చూర్ణాన్ని ఆవు నెయ్యితో కలిపి ప్రతి రోజూ తీసుకుంటే మధుమేహ వ్యాధి తగ్గుతుంది. విటమిన్‌ సి ఆరోగ్యానికి చాలా మంచిది. కంటి జబ్బులు రాకుండా నిరోధిస్తుందని పరిశోధనల్లో తేలింది. మహిళల్లో వచ్చే కాటరాక్ట్‌ నివారించడానికి దోహదం చేస్తుంది. అంతర్గతంగా ఉండే యాంటీ యాక్సిడెంటల్‌ పోషకాలు వయసు పెరుగుతుండటం వల్ల వచ్చే దృష్టి లోపాలు తగ్గిస్తాయి. రోజు 140 మి.గ్రా. విటమిన్‌ సి మనకు అవసరం. కృత్రిమంగా లభించే 100 మి.గ్రా., విటమిన్‌ సి, ఒక్క ఉసిరిలోనే లభిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

నిమ్మ-కమలాలకన్నా 10 నుంచి 20 రెట్లు అధికంగా ఉసిరిలోనే విటమిన్‌ సి ఉంది. ఉసిరిలోని గాలిక్‌, ఇలాగిక్‌, గ్లూకోజ్‌లు ఆరోగ్యాన్ని పెంపొందించటంతోపాటుగా రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. ఉసిరిలోని క్రోమియం శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను నిరోధిస్తుంది.రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. రోగనిరోధక శక్తిని, జీవక్రియను పెంచడానికి సహాయపడుతుంది. జలుబు, దగ్గుతో సహా వైరల్‌, బ్యాక్టీరియా వ్యాధులను నివారిస్తుంది. గుండె జబ్బుల్ని తగ్గిస్తుంది. బిపి రోగులు రోజు ఒక ఉసిరికాయ తింటే తగ్గుతుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఉసిరికాయ మురబ్చా లేదా రసాన్ని కలిపి రోజుకు రెండు, మూడు సార్లు తీసుకుంటే జీర్ణకోశవుల్లోని నులిపురుగులు, బద్దె పురుగులు, కొంకి పురుగులు, ఏలిక పాములు వంటివి నశిస్తాయి. అలసట, నీరసం వంటివి తగ్గుతాయి. ఉసిరికాయ రసం-తేనె కలిపి ప్రతిరోజూ ఉదయం పూట తీసుకుంటుంటే ఉబ్బసము, స్కర్వీ వ్యాధి, రక్తహీనత (ఎనీమియా) వంటివి తగ్గుతాయి. సాధారణ జలుబు, జ్వరం, అలసట వంటివి ఉన్నవారు కూడా ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ ఉదయం తీసుకుంటూ ఉంటే వాటిని తగ్గించొచ్చు.