పిల్లలూ, రాత్రి వేళల్లో మెరుస్తూ మిణుగురు పురుగులు కనిపిస్తాయి కదా! మరి అవి ఎందుకు మెరుస్తున్నాయి. వాటికి కారణమేంటో తెలుసుకుందామా!
మిణుగురు పురుగులుఒక రకమైన కీటకాలు. వర్షాకాలం, శీతాకాలాల్లో ఎక్కువగా కన్పిస్తుంటాయి. మిణుగురు పురుగు కాంతి వేడి లేకుండా వెలుగును మాత్రమే ఇస్తుంది. దీనికి కారణం వాటి శరీరంలో జరిగే ఒక రకమైన జీవ రసాయనిక చర్య. పక్షులు, ఇతర జీవుల నుండి తమను తాము రక్షించుకునేందుకు, జత కట్టేందుకు, తమ జాతి జీవులకు సంకేతాలు పంపేందుకు ఇవి కాంతిని విరజిమ్ముతుంటాయి. ఉదాహరణకు : ఒక చోట ఉన్న పురుగు ఒకలా మెరిస్తే వేరే చోట ఉన్న పురుగు మరొకలా మెరుస్తూ మొదటి పురుగుకు సమాధానం ఇస్తుంది.
మిణుగురు పురుగు పొట్ట కింది భాగంలోని కణాల్లో ట్రాన్స్‌ఫెరిన్ అనే ఓ వర్ణద్రవ్యం ఉంటుంది. వెలుగు రావడం అనేది ఆక్సిడేషన్ చర్య వల్లే జరుగుతుంది. టాన్స్‌ఫెరిన్ ఆక్సిజన్‌తో కలిసి ట్రాన్స్‌ఫెరేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో చర్య జరుగుతుంది. ఫలితంగా ఆక్సీట్రాన్స్ ఫెరిన్, శక్తి వెలువడుతుంది. ఈ విధంగా వెలువడిన శక్తి వెలుగుగా మారుతుంది. ఈ కాంతి ఆకుపచ్చ, పసుపు పచ్చల మిశ్రమం. అనంతరం ఆక్సీట్రాన్స్‌ఫెరిన్ తిరిగి ట్రాన్స్‌ఫెరిన్‌గా మారుతుంది. దీనివల్ల తిరిగి చర్య జరిగే వీలు ఏర్పడుతుంది. ఈ కాంతి ఒక కొవ్వొత్తి ఇచ్చే వెలుగుతో పోలిస్తే 40వ వంతు కాంతి మాత్రమే!
మూడు మిల్లీమీటర్ల వరకు పెరిగే ఇవి తేమ ప్రదేశాలైన గుహలు, రాళ్లు, చెట్ల ఆకుల అంచుల్లో ముడుచుకుని నివసిస్తూ ఉంటాయి. ఆహారాన్ని సంపాదించుకోడానికి ఒక వినూత్నమైన పద్ధతిని అవలంబిస్తాయి. తమ శరీరాల నుంచి ఒక రకమైన ద్రవాన్ని స్రవిస్తాయి. ఈ ద్రవం సాలెపురుగు దారాల్లాగా మారి పైనుంచి వేలాడతూ ఉంటాయి. తడిగా, అంటుకుపోయే విధంగా దారాలను వదిలాక ఈ మిణుగురు పురుగులు తమ శరీరాలలో నీలం రంగు కాంతులను వెదజల్లుతాయి. ఆ వెలుగుకు ఆకర్షితమైన చిన్న పురుగులు అక్కడికి వచ్చి, ఆ దారాలకు అతుక్కుపోతాయి. మిణుగురులు వాటిని నిదానంగా భక్షిస్తాయి.










