
- దేశంలో చెస్ట్ క్లినిక్కులకు ఆస్తమాóతో వచ్చే వారి సంఖ్య 50 శాతానికి పెరిగింది. మారుతున్న ఆహారపుటలవాట్లు, వాయుకాలుష్యం వల్ల ఆస్తమాతో బాధపడేవారి సంఖ్య మున్ముందు 10 కోట్లకు చేరవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. వీటి ప్రకారం పట్టణ ప్రాంత వాసులకు, మహిళలకు, పెద్ద వయస్సు వారికి, ఎలర్జీ లక్షణం ఉన్నవారికి, ధూమపానం చేసేవారికి, సామాజికంగా వెనుకబడిన వారికి, కుటుంబంలో ఆస్తమా ఉన్నవారికి ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తేలింది. దీర్ఘకాలంగా ఇబ్బందులకు గురిచేసే ఈ వ్యాధిని అందుబాటులో ఉన్న ఆధునిక వైద్య చికిత్సతో అదుపులో పెట్టుకోవచ్చు. ఈ వ్యాధి పట్ల గ్లోబల్ ఇనిషియేటివ్ ఆన్ ఆస్తమా సంస్థ ప్రతి ఏటా దీనికి సంబంధించిన నూతన చికిత్సా పద్ధతుల పట్ల అవగాహన కల్పిస్తుంది. చలికాలంలో ఈ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ఇబ్బందికి లోనవుతారు. అందుకే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం..
శరీర కణాల నుంచి ఉత్పత్తి అయ్యే వివిధ రసాయనాల వల్ల శ్వాసనాళాల్లో శ్లేష్మం జమ అవుతుంది. దాంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. దీని వల్ల దగ్గు, ఆయాసం, పిల్లికూత, ఛాతీ పట్టేసినట్టు ఉండటం జరుగుతుంది. తరచుగా తుమ్ములు, ముక్కు దిబ్బడేయడం, నీరు కారటం, కంట్లో దురద, చర్మంపై దద్దుర్లు ఎలర్జిక్ డెర్మటైటిస్, ఎక్జిమా, లాంటి చర్మవ్యాధులు వస్తాయి. శ్వాసకోశమార్గంలో వాపు, శ్వాసకోశ మార్గం కుంచించుకుపోతుంది. ఇలా దీర్ఘకాలిక శ్వాసకోశ ఇబ్బందినే ఆస్తమా అంటారు.
వీరికి చల్లగాలి (చల్లటి వాతావరణం), దుమ్ము దూళి, పొగ పడదు. ఫంగస్, గడ్డి చెట్లు, ఘాటు వాసనలు (రసాయనాలు) పీల్చలేరు. వైరల్ ఇన్‌ఫెక్షన్ల వాతావరణంలో ఇమడలేరు. శారీరక శ్రమ చేయలేరు. వంశపారంపర్యంగా, చర్మానికి సంబంధించి అలర్జీలు ఉన్న వారు ఎగ్జిమాకు సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలి. ముక్కు, గొంతు, ఛాతీ, కఫం, ఎక్స్‌రే పరీక్షల ద్వారా నిర్ధారణ చేసుకోవచ్చు. స్పైరోమెట్రీ (శ్వాస మీటర్ ద్వారా) పరీక్ష కూడా చేయించుకోవాలి.
- ఆస్తమా ఎందుకు? ఎలా వస్తుంది?
ఆస్తమా వంశపారంపర్యంగా సంక్రమించ వచ్చు. దీనినే ఎటోపి అంటారు. ఈ లక్షణాలున్న అందరిలోనూ ఎలర్జీ కానీ, ఆస్తమా కానీ రావాలని లేదు. సాధారణంగా దుమ్ము, ధూళి, డస్ట్‌మైట్, పుప్పొడి, పొగ, చలిగాలి, వైరస్, వ్యాయామం, ఉద్వేగం మొదలైనటు వంటి వాటి వల్ల ఆస్తమా వస్తుంది. శ్వాస నాళాల్లోకి నేరుగా వెళ్ళే ఏరో ఎలర్జెన్స్ ఈ వ్యాధిని కలిగించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఆహారం వల్ల ఆస్తమా రావడం బహు కొద్దిమందిలోనే జరుగుతుంది. చాలా మందిలో ఆస్తమా జలుబుతో మొదలయ్యి తరువాత గొంతునొప్పి, గొంతులో నసగా ఉండడం, స్వరం మారడం జరుగుతుంది. తర్వాత దగ్గు, ఆయాసం, పిల్లి కూతగా మారుతుంది.
- రాత్రి వేళల్లో ఇబ్బంది
చలిగాలి పీల్చినప్పుడు దగ్గు ఎక్కువవుతుంది. రాత్రిళ్లు దగ్గు ఆయాసంతో సరిగా నిద్ర పట్టదు. శ్వాస సరిగా అందక గాలి కోసం బయటకు వెళ్లడం, ఫ్యాన్ వేసుకోవడం చేస్తారు. నిద్రలో లేచి కూర్చోవటం చేస్తారు. ఉదయం మూడు గంటల నుంచీ ఆరు గంటల మధ్య దగ్గు, ఆయాసం
ఎక్కువై ఇబ్బంది పడతారు. 24 గంటల్లో ఉదయం 3 నుండి 6 గంటల వరకు చలి అధికంగా ఉండడమే దీనికి కారణం. ఇలా రాత్రి ళ్ళు మాత్రమే ఆస్తమా ఉంటే దాన్ని నాక్టర్నల్ ఆస్తమా అంటారు.
- ఒత్తిడి ఎక్కువైనా...
వ్యాయామం చేస్తున్నపుడు లేదా ఆటలు ఆడుతున్నప్పుడు మాత్రమే కొంతమందిలో ఆస్తమా లక్షణాలు కనిపిస్తాయి. దీన్నీ ఎక్సర్‌సైజ్ ఇండ్యూస్డ్ ఆస్తమా అంటారు. మరికొద్ది మందిలో దగ్గు తప్పించి ఇక ఏ ఇతర లక్షణాలు కనిపించవు. పల్మొనరీ ఫంక్షన్ టెస్ట్ (పి.యఫ్.టి.) వల్లనే వీరిలో ఆస్తమా వ్యాధిని నిర్ధారించవచ్చు. వీరికి కాఫ్ వేరియంట్ ఆస్తమా ఉన్నట్లుగా భావించాలి. అసిడిటీ, గ్యాస్ సమస్య ఉన్నవారిలో ఆస్తమా వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీరిలో మామూలు కంటే ఎక్కువ యాసిడ్ కడుపు నుంచీ గొంతులోకి వచ్చి శ్వాసనాళాల్లోకి ప్రవేశించటం వల్ల ఉబ్బసం వస్తుంది. పనుల ఒత్తిడి ఎక్కువగా ఉన్నవారికి, మానసిక ఆందోళన, ఒత్తిడి సమస్యలు ఉన్నవారికి కూడా ఆస్తమా వస్తుంది. వీరికి కేవలం ఆస్తమా మందులు సరిపోవు. సైకియాట్రి జబ్బులకు ఇచ్చే మందులు వాడాలి.
- మందులు
ఒక్కోసారి వ్యాధి తీవ్రరూపం దాల్చినవారికి నెబ్యులైజర్ ద్వారా ఈ మందులను ఇవ్వొచ్చు. వీటితో తగ్గకపోతే అమెనోఫిల్లిన్, డాక్సోపైలిన్, డెరిఫిలిన్, టెర్బ్యుటలిన్, స్టెరాయిడ్స్ ఇంజక్షన్ రూపంలో వైద్యులు ఇస్తుంటారు. అయితే వీరి శరీరంలో ఉండే ప్రాణవాయువు తగ్గకుండా ఆక్సిజన్ కూడా ఇవ్వాలి. నోటి మాత్రలు, ఇంజక్షన్ల కంటే కూడా వ్యాధిని ఇన్‌హేలర్స్ వల్ల కంట్రోల్ చేసుకుంటే మంచిది. చిన్న పిల్లలూ మందులు వాడొచ్చు. ఇన్‌హేలర్స్‌ను సరిగా వాడగలిగిన వారికి డ్రై పౌడర్ ఇన్‌హేలర్స్ లేదా మీటర్డ్ డోస్ ఇన్‌హేలర్స్‌ను స్పేసర్ ద్వారా ఇవ్వొచ్చు.
- చికిత్స ఇలా ...
గత ముప్పై ఏళ్లలో శాస్త్రవేత్తలు ఆస్తమాకి కొత్త మందులు కనిపెట్టారు. వీటిని శరీరంలోకి, నేరుగా శ్వాస నాళాల్లోకి పంపించటం జరుగుతుంది. ఇలాంటి మందులను ఎయిరోసాల్స్ అంటారు. దాంతో తక్కువ మందును వాడటమే కాకుండా వ్యాధి లక్షణాల నుంచి త్వరగా ఉపశమనం కలుగుతుంది. ఈ మందులు రెండు రకాలు. వ్యాధిని నివారించే మందులు- ప్రివెంటర్స్, ఉపశమనం ఇచ్చే మందులు - రిలీవర్స్. వైద్యుల సూచన మేరకు వీటిని వాడాలి.
- సీజనల్ ఆస్తమా
వర్షాకాలం, చలికాలంలో వ్యాధి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. దీన్ని సీజనల్ ఆస్తమా అంటారు. ఆ రుతువు మొదలవటానికన్నా ఒకటి, రెండు వారాలు ముందే ఇవి మొదలుపెట్టి కొన్ని వారాలు క్రమంగా వాడాలి. కొంతమందిలో ఉబ్బసం లక్షణాలు కొంచెం కనిపిస్తాయి. వీరు ఉపశమనమిచ్చే మందులతో పాటు నివారించే మందులను కొన్ని వారాలు క్రమం తప్పకుండా వేసుకోవాలి. వ్యాధి అదుపులోకి వచ్చిన తర్వాత మందు పరిమాణం కొద్ది కొద్దిగా తగ్గిస్తూ అతి తక్కువ డోస్‌తో వ్యాధి అదుపులో ఉండేటట్లు చూసుకోవాలి.
- పిల్లలు ఎదిగేకొద్దీ ...
తల్లిదండ్రుల్లో ఒకరికి ఆస్తమా ఉంటే పుట్టే పిల్లలకూ వస్తుందని చెప్పలేం. వచ్చే అవకాశం ఎంత ఉందో, రాకుండా ఉండే అవకాశం ఉంది. పుట్టిన పిల్లల వయస్సు నుంచీ ఈ వ్యాధి వస్తుంది. వీరు ఎదిగే కొద్దీ తరచూ జలుబు, దగ్గు, ఆయాసం వస్తుంటాయి. పరుగెత్తేటప్పుడు, మెట్లు ఎక్కుతున్నప్పుడు, ఆడుతున్నప్పుడు కానీ ఆయాసం కనిపిస్తుంది. వీరికి చల్లని నీరు, ఐస్‌క్రీమ్‌లు పెట్టకూడదు. వీరిలో వ్యాధి ఏ స్థాయిలో ఉందనేది ఎక్స్‌రేలో ప్రైమరీ కాంప్లెక్స్ పరీక్షల ద్వారా తెలుస్తుంది. పిల్లల్లో పాసివ్ స్మొకింగ్ వల్ల ఆస్తమా తరచు వస్తూ ఉంటుంది. ఇంట్లోనే పొగతాగే వారు ఉంటే పిల్లలు ఇబ్బంది పడుతుంటారు. నూటికి 90 మంది పిల్లల్లో ఈ వ్యాధి 10 నుండి 12 సంవత్సరాలు వచ్చేసరికి జాగ్రత్తలు పాటిస్తూ మందులు వాడుతుంటే అదే పూర్తిగా తగ్గిపోతుంది.
- ఆహారంలో అపోహలు
ఆస్తమా ఉన్న వారు అన్ని రకాల పోషక ఆహారం తీసుకోవాలి. ఆహారమే ప్రధానంగా ఉబ్బసం కలిగిస్తుందనేది అపోహా. కొన్ని రకాల సిట్రస్ జాతికి చెందిన బత్తాయి, నిమ్మ వంటి పండ్లు, చేపలు, గుడ్డు తెల్లసొన, పాలు, చాక్లెట్లు, వేరుశనగలు కొందరికి పడవు. చాలామంది తీపి, నూనె, పండ్లు, పులుపు, పెరుగు, టమాట తినడం మానేస్తారు. అయితే వీరు ఇలా మానేసిన ఆహార పదార్ధాల వల్ల ఆస్తమా వస్తుందో లేదో అని పరీక్షించుకోవటం అవసరం. ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఇలాంటి పదార్ధాలు తీసుకొని ఆస్తమా లక్షణాలు వస్తున్నాయో లేదో చూసుకోవాలి. ఒకటికి రెండుసార్లు అలాగ చూసుకొని వ్యాధి లక్షణాలు వస్తున్నాయి అనిపించినప్పుడు ఆ ఆహార పదార్ధాలు మానేస్తే మంచిది. సాధ్యమైనంత వరకు విటమిన్లు అన్నీ అందేలా ఆహారం తీసుకోవాలి.
- డాక్టర్ శ్రీనివాస నాయక్