Jun 22,2023 09:37

రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో కలిపి దాదాపు 62,063 పాఠశాలలున్నాయి. ఇందులో ప్రాథమిక, ప్రీ-ప్రైమరీ, ఎలిమెంటరీ, సెకండరీ, సీనియర్‌ సెకండరీ పాఠశాలలు ఉన్నాయి. భారతదేశంలోని గ్రామీణ ప్రైవేట్‌ పాఠశాలల్లో చేరిన పిల్లల వాటా గురించి 2018లో నిర్వహించిన సర్వే ప్రకారం...7 నుండి 10 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలలో దాదాపు 39.5 శాతం మంది గ్రామీణ ఆంధ్రప్రదేశ్‌ లోని ప్రైవేట్‌ పాఠశాలల్లో చేరారు. అలాగే 11 నుండి 16 సంవత్సరాల వయసున్న పిల్లలు 32 శాతానికి పైగా ప్రైవేటు పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్నారు. పైలెక్కలను చూస్తే ప్రాథమిక, మాధ్యమిక విద్యలో ప్రైవేటు పాఠశాలల పాత్ర గణనీయమైనదని అర్థమవుతుంది. ఇంత ప్రాముఖ్యత గలిగిన ప్రైవేటు పాఠశాలలు విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రమాణాలు పాటిస్తున్నాయో లేదో చూసుకోవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. కానీ ప్రైవేటు పాఠశాలల నిర్వహణ పట్ల ప్రభుత్వం ఉదాసీనతతో వ్యవహరిస్తున్నది.
ఈ ప్రైవేటు పాఠశాలలు విద్యా హక్కు చట్టాన్ని బాహాటంగానే ఉల్లంఘిస్తున్నాయనేది జగమెరిగిన సత్యం. పోయిన సంవత్సరం మొదటిసారిగా, రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్‌ అన్‌ఎయిడెడ్‌ పాఠశాలల్లో నర్సరీ నుండి పదో తరగతి వరకు, ప్రైవేట్‌ ఎయిడెడ్‌ జూనియర్‌ కాలేజీలలో ఇంటర్మీడియట్‌ కోర్సుల కోసం 2023-24 వరకు ఫీజులను నిర్ణయించింది. ప్రభుత్వం ప్రాథమిక విద్య అయిన నర్సరీ నుండి 5వ తరగతి వరకు పంచాయతీలలో రూ. 10,000, మునిసిపాలిటీలలో రూ. 11000, మునిసిపల్‌ కార్పోరేషన్లలో రూ. 12000గా నిర్ణయించింది. అలాగే మాధ్యమిక విద్య అయిన 6 నుండి 10వ తరగతులకు పంచాయితీలలో రూ.12000, మునిసిపాలిటీలలో రూ.15000, మునిసిపల్‌ కార్పోరేషన్లలో రూ. 18000గా నిర్ణయించింది. కానీ ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు బాహాటంగానే ఈ ఫీజు నియమాలను ఉల్లంఘిస్తున్నాయి. పంచాయితీలలో సాధారణంగా ప్రైవేటు పాఠశాలలు తక్కువగా ఉంటాయి, మండల కేంద్రాలలోనే ప్రైవేటు పాఠశాలలు కేంద్రీకృతం అయ్యి విద్యార్థులను బస్సుల ద్వారా పాఠశాలలకు రవాణా చేస్తూ ఉంటాయి. మండల కేంద్రాలలో సరాసరి ప్రతి ప్రైవేటు పాఠశాల నర్సరీ, 5వ తరగతి విద్యార్థుల నుండి రూ. 10,000 వేల నుండి రూ. 25,000 వరకు వసూలు చేస్తున్నాయి. అలాగే మాధ్యమిక విద్య అయిన 6 నుండి పదవ తరగతులకు రూ. 20,000 నుండి రూ.60,000 వేల వరకు వసూలు చేస్తున్నాయి. దీనికి అదనంగా ప్రైవేటు పాఠశాలల్లో పుస్తకాలు బహిరంగంగానే అమ్మకాలు జరుగుతున్నాయి. ప్రాథమిక తరగతుల విద్యార్థుల నుండి రూ.3 వేల నుండి రూ.5 వేల వరకు, అలాగే మాధ్యమిక విద్యార్థుల నుండి రూ.5 వేల నుండి రూ.10 వేల వరకు పుస్తకాలు అమ్ముతున్నాయి. వేల రూపాయల పుస్తకాలను అంత చిన్న వయసులోనే ఎందుకు కొనిపిస్తున్నారో తెలియక తల్లిదండ్రులు సతమతమవుతున్నారు. డిగ్రీ వంటి పైచదువులకు కూడా పుస్తకాల ఖర్చు సంవత్సరానికి రూ. 3000కు మించదు. అలాంటిది పాఠశాల స్థాయిలోనే తల్లిదండ్రుల నుండి ఈ ప్రైవేటు యాజమాన్యం ఫీజులకు అదనంగా వేలకు వేల రూపాయలను పుస్తకాల పేరుతో దోచుకుంటున్నాయి.
ఇలా బాహాటంగా చట్టాలను ఉల్లంఘిస్తున్నప్పటికీ ప్రభుత్వం, అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఎక్కడైనా విద్యార్థి సంఘం నాయకులు విషయాలను గుర్తించి ఆందోళన చేసినట్లైతే అధికారులకు రాజకీయ నాయకుల నుండి వత్తిళ్లు వస్తాయి. అధికారుల ఉదాసీనతపై చర్యలు తీసుకుంటామని చెప్పి ఏదోరకమయిన రాజీ కుదురుస్తున్నారు.
విద్యా హక్కు చట్టం ప్రకారం 1 నుండి మూడు కిలో మీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రైవేటు పాఠశాలలు 25 శాతం పేద విద్యార్థులకు ఉచిత విద్య చెప్పాలని చట్టం చెబుతున్నాగానీ ఎక్కడా అమలు చేయటం లేదు. నూతన విద్యావిధానం పేరుతో ప్రాథమిక పాఠశాలలను కూడా ప్రభుత్వం దుర్మార్గంగా దగ్గరలో ఉన్న జిల్లా పరిషత్‌ పాఠాశాలల్లో కలిపి పేద పిల్లలు బడికి దూరం అయ్యేలా చేస్తున్నది. విద్యార్థులను ఆటోలలో తరలించకూడదని చట్టం చెబుతున్నా సెవెన్‌ సీటర్‌ ఆటోలలో పాఠశాలలకు తీసుకువెళ్తున్నారు. ఇలా ప్రయాణ సమయాలలో ప్రమాదాలు జరిగిన ఉదంతాలు ఎన్నో వున్నాయి. ప్రమాదం జరిగినపుడు కొంత హడావుడి చేసే అధికారులు చివరగా యాజమాన్యానికే మద్దతు తెలిపి ఏ చర్యా తీసుకోకపోవటమో లేదా నామమాత్రపు చర్యలు తీసుకోవటమో పరిపాటిగా మారింది.
ఇక ప్రైవేటు పాఠశాలల్లో పని చేసే ఉపాధ్యాయుల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఉపాధ్యాయులకు మండల కేంద్రాలలో రూ. 5000 నుండి గరిష్టంగా రూ. 13000 వరకు జీతం చెల్లిస్తున్నారు. ఈ చాలీచాలని జీతాలతో ఉపాధ్యాయులకు కుటుంబ పోషణ కష్టంగా మారింది. కరోనా కాలంలో ఎంతో మంది ఉపాధ్యాయులు కూలిపనులకు వెళ్ళటం వంటి దృశ్యాలు ప్రజలందరినీ కలచివేశాయి. ఉపాధ్యాయుల మీద ప్రేమతో పూర్వపు విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు ఆదుకున్నాయి తప్పితే ప్రభుత్వం గానీ పాఠశాల యాజమాన్యం గానీ ఆదుకున్నది శూన్యం. విద్య అనేది వ్యాపారం కాదు ధార్మికమైనదిగా ఉండాలని విద్యా హక్కు చట్టం చెబుతున్నా బహిరంగంగా వ్యాపారమయం అయ్యింది. విద్యా హక్కు చట్టం ప్రకారం ఫీజుల సొమ్ము మొత్తంలో 95 శాతం ఉపాధ్యాయుల జీతాలు, విద్యార్థుల సదుపాయాలకు ఉపయోగించాలని యాజమాన్య లాభం 5 శాతానికి మించకూడదని చెబుతున్నా ఎవరూ పాటించటం లేదు. ఉపాధ్యాయులకు వేసవి సెలవులలో కూడా జీతం చెల్లించాలని చట్టం చెబుతున్నప్పటికీ యాజమాన్యం వారు అడ్మిషన్ల కోసం ఊరూరా తిరిగి విద్యార్థులను చేర్చితేనే ఇస్తామని మెలిక పెడుతున్నారు. వారికి టార్గెట్లు పెట్టి ఉపాధ్యాయులను ఇబ్బంది పెడుతున్నారు.
చట్ట ఉల్లంఘనకు పాల్పడుతున్న ఈ సంస్థలు విద్యార్థులకు మంచి చదువు అందిస్తున్నాయా అంటే అదీ లేదు. కార్పోరేటు కంపెనీలకు మానవ యంత్రాలను తయారు చేసే విధంగా పని చేస్తున్నాయి. విద్యార్థులకు సామాజిక అంశాలను నేర్పటం లేదు. కెరీరిజం వంటి వ్యక్తిగత పోకడలను విద్యార్థుల మెదళ్లలోకి ఎక్కించి పంపిస్తున్నాయి. మానసిక ఉల్లాసం, శారీరక దారుఢ్యం కోసం అవసరమైన క్రీడలను విద్యార్థులకు నామమాత్రంగా అందిస్తున్నాయి. 10వ తరగతికి దగ్గరయిన విద్యార్థులకు 8వ తరగతి నుండి 365 రోజులు పాఠాలను బట్టీ పట్టిస్తున్నాయి. టీం వర్కు, సహకారం వంటి అంశాలను నేర్పకపోవటం వలన ఉద్యోగ సమయాలలో, అలాగే సమాజంలోకి వచ్చిన తరువాత వారు సమిష్టి కార్యక్రమాలను సరిగా నిర్వహించలేకపోతున్నారు. ఒత్తిడికి తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న విద్యార్థులను అనేకమందిని చూస్తున్నాం. ఎక్కువగా ప్రైవేటు సంస్థలలో చదువుతున్న వారే బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఈ సంస్థలు సున్నితమయిన బాల్యాన్ని, వారి సృజనాత్మకతను నాశనం చేస్తున్నాయి. తల్లిదండ్రుల దగ్గర ఉన్న సొమ్మును ప్రాథమిక, మాధ్యమిక విద్య సమయంలోనే మొత్తం లాగేసుకుంటే పైచదువులకు అవసరమైన సొమ్ము వారి దగ్గర మిగలడంలేదు. అందుకే మన దగ్గర ఎక్కువ మంది విద్యార్థులను ఫీజు రీయంబర్స్‌మెంటు ఉన్న ఇంజనీరింగు లోనే చేరుస్తున్నారు. సాధారణ మండల కేంద్రాలలో ఇద్దరు పిల్లలు ఉన్న కుటుంబం వారి చదువు కోసం సంవత్సరానికి రూ. 50000 నుండి రూ.100000 వరకు వెచ్చించాల్సి వస్తుందంటే అతిశయోక్తి కాదు. ఒక సాధారణ రైతు, కార్మికుడికి ఆఖరికి మధ్యతరగతి ఉద్యోగికి ఈ ఖర్చు కత్తి మీద సాము లాగా మారుతుంది. ఈ కారణంగా ఆ కుటుంబాలు తీసుకునే ఆహారం, కుటుంబ సదుపాయలను తగ్గించుకుంటున్నాయి. ఆహారం తగ్గించుకోవటం వల్ల పిల్లలలో ఎదుగుదల తగ్గి శారీరకంగా బలహీనంగా ఉన్న భావిపౌరులు సమాజంలోని నెట్టబడుతున్నారు.
ప్రభుత్వాలు ఏటికి ఏడు స్వాతంత్య్ర ఆకాంక్షలను తుంగలో తొక్కుతూ విద్యకు కేటాయించాల్సిన నిధులను తగ్గిస్తున్నాయి. చట్ట ఉల్లంఘనలపై ఉదాసీనత ప్రదర్శిస్తూ ప్రైవేటీకరణకు సహకరిస్తున్నాయి. విద్యార్థులపై, ప్రజలపై భారాలు మోపుతున్నాయి. ప్రపంచబ్యాంకు, ఐ.ఎం.ఎఫ్‌ సంస్థల ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వం ఉచిత విద్యను అందించే బాధ్యత నుండి తప్పుకుంటున్నది. 90 శాతానికి పైగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు లేవని 2019లో ప్రజాసంఘాలు పల్నాడు ప్రాంతంలో నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. నాడు-నేడు కార్యక్రమం రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను కల్పించింది. ఇది ఆహ్వానించదగ్గ విషయం. అయితే వాటిని సక్రమంగా నిర్వహించటానికి అవసరమైన నిధులను అందించవలసిన బాధ్యత ప్రభుత్వం మీద వుంది. 85 శాతానికి పైగా పాఠశాలల్లో భర్తీ చేయవలసిన పోస్టులున్నాయి. ప్రభుత్వం ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టులు నింపకుండా మీనమేషాలు లెక్కిస్తున్నది. పరోక్షంగా ప్రైవేటు పాఠశాలల్లో మరింతమంది విద్యార్థులు చేరటానికి సహకరిస్తున్నది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నయా ఉదార విధానాలకు తల వంచకుండా విద్యకు జిడిపి లో కనీసం 6 శాతం నిధులు కేటాయించి ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలి. చట్ట ఉల్లంఘన చేస్తున్న ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి. అప్పుడే భారాల నుండి ప్రజలు ఉపశమనం పొందగలుగుతారు. అమ్మ వడి లాంటి సంక్షేమ పథకాలు కొంత ఉపశమనం కలిగిస్తాయే తప్ప భారాల నుండి దూరం చేయవు. విద్యార్థులు, ప్రజలు సంఘటితమై ఉచిత విద్యను ప్రాథమిక హక్కుగా ప్రభుత్వాలకు గుర్తు చేసి, విద్యని తప్పనిసరిగా పూర్తి ప్రభుత్వ రంగంలోనే ఉండేలా ప్రభుత్వం మెడలు వంచి సాధించుకోవాలి.


వ్యాసకర్త : అంజనేయరాజు, డివైఎఫ్‌ఐ పల్నాడు జిల్లా కార్యదర్శి)