
- 'న్యాయస్థానం మీద ప్రజలు విశ్వాసం కోల్పోతే సమాజం చాలా ప్రమాదంలో పడుతుంది' అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇటీవల అన్న మాటలు ఎంతో విలువైనవి. ప్రజలకు న్యాయస్థానం మీద విశ్వాసం కలగాలంటే బిల్కిస్ బానో కేసులో నిందితులను తిరిగి జైలుకు పంపడం, బాధితులకు రక్షణ కల్పించడం అత్యవసరం. ఇలాంటి స్థితిలో ప్రజల హక్కులకు, మహిళల రక్షణకు ప్రజా చైతన్యమే అండ.
గుజరాత్‌లో 2002లో బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం జరిగింది. ఆమె కళ్ళెదుటే తన కుటుంబానికి చెందిన 14 మంది చంపివేయబడ్డారు. ఈ క్రూరులకు చట్టప్రకారం శిక్ష వేయించడం కోసం ఆరు సంవత్సరాలు అనేక బెదరింపులు, ఒత్తిళ్ళ మధ్య సుదీర్ఘ న్యాయ పోరాటం చేసింది బిల్కిస్ బానో. కింది కోర్టు నుండి సుప్రీంకోర్టు వరకు విచారణ జరిపి 11 మంది దోషులకు యావజ్జీవ శిక్ష విధించారు. ఇలాంటి దోషులను గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం విచక్షణాధికారాన్ని అడ్డుపెట్టుకొని విడుదల చేయడం విచక్షణ కోల్పోయిన వివక్షాపూరితమైన నిర్ణయం. 75 సంవత్సరాల సాతంత్య్ర దినోత్సవాల నాడే బిజెపి పాలిత గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ఈ ద్రిగ్భాంతికరమైన నిర్ణయాన్ని తీసుకుంది. ఢిల్లీ పెద్దలకు తెలియకుండా ఇంతటి తీవ్రమైన నిర్ణయాన్ని తీసుకోలేరన్నది జగమెరిగిన సత్యం. ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేస్తూ 'మహిళల్ని తక్కువగా చూసి, బాధించే మన ప్రవర్తననూ, సంస్కృతినీ, రోజువారీ జీవన విధానాన్నీ మార్చుకోలేమా?' అని గంభీరంగా ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలనుద్దేశించి ప్రశ్నించారు. ఆ మాటలు పూర్తిగా స్మృతిపథం నుంచి చెరగక ముందే...తన సొంత రాష్ట్రంలో అత్యాచారానికి పాల్పడిన క్రూర మృగాలను మానవ సమూహంలోకి స్వేచ్ఛగా పంపడం సిగ్గుచేటు.
తీవ్రమైన సామూహిక అత్యాచారం, 14 హత్యల్లో దోషులైన వారిని విడుదల చేయడం కేవలం బాధితురాలికే కాదు. దేశ భవిష్యత్తుకు, మహిళల మనగడకు, చట్ట ఉనికికి సంబంధించిన సమస్య. 'నిందితులు బ్రాహ్మణ కులానికి చెందిన వారు కాబట్టి ఇలాంటి నేరం చేసివుండ'రని చెప్పడం కుల దురహంకారమే. ఈ వివాదంలోకి కోర్టులను లాగవద్దని న్యాయమూర్తులు వేడుకోవడం, శుద్ధులు చెప్పిన ఢిల్లీ పెద్దలు మౌనంగా వుండడం, అధికారం చాటున విడుదలైన నిందితులకు స్వీట్లు పంచి, వారి పాదాలకు స్థానిక విశ్వ హిందూ పరిషత్ వారు నమస్కరించి స్వాగతించడం ఒకవైపు జరుగుతుంటే, మరోవైపు బిల్కిస్ బానో భయంతో చేస్తున్న ఆక్రందనలు, విజ్ఞులైన మహిళలు, ప్రజాస్వామిక వాదులు వ్యక్తం చేస్తున్న ఆందోళనలు, బాధితురాలి పక్షాన నిలిచి నిందితులకు శిక్ష వేయించిన తీస్తా సెతల్వాద్, ఆర్.వి.సి కుమార్ అనే పోలీసు అధికారి ప్రస్తుతం జైల్లో వుండడం దేశ ప్రజాస్వామికవాదులందరినీ కలవర పెడుతున్నాయి. జర్మనీలో పురుడు పోసుకున్న నరహంతక ఫాసిజం మన దగ్గరకు వచ్చేసిందా? తరతరాల అనుభవాల సారం నుండి సభ్య సమాజం నేర్చుకున్న 'స్త్రీలను గౌరవించాలనే' విలువలను హరించి వేసి, మానవత్వానికి పాతరేసే మనుస్మృతిని అమలు చేసే కాలానికి మనల్ని ఈడ్చుకుపోతున్నారా? అని ప్రశ్నించాల్సిన తరుణం వచ్చింది.
1992లో బాబ్రీ మసీదు విధ్వంసం అనంతరం 2002లో అయోధ్యకు ఇంటికో ఇటుక అంటూ కరసేవకుల యాత్రకు విహెచ్‌పి, ఆర్‌ఎస్‌ఎస్, బజరంగ్‌దళ్ సంస్థలు పిలుపునిచ్చాయి. తిరుగు ప్రయాణంలో ఫిబ్రవరి 27న గుజరాత్ రాష్ట్రంలోని గోద్రా రైల్వే స్టేషన్ దగ్గర సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలు ఎస్-6 బోగీ కాలిపోయింది. ఇందులో 58 మంది సజీవ దహనమయ్యారు. ఈ బోగీ దగ్ధం కావడానికి కారకులు ఎవరో ఇప్పటికీ రుజువు కాలేదు. అయితే ఈ ఘోర సంఘటనను అవకాశంగా తీసుకొని గుజరాత్‌లో నరమేధం జరిగింది. వేలాది మంది మైనారిటీలు హత్య గావించబడ్డారు. లక్షల మంది నిరాశ్రయులయ్యారు. కోట్లాది సంపద బుగ్గిపాలయింది. అన్నిటికన్నా ఘోరంగా వేలాది మంది అమ్మాయిలు, మహిళలపైనా ఆటవికమైన అత్యాచారాలు జరిగాయి. అలాంటి నిర్భాగ్యుల్లో బిల్కిస్ బానో కేసు ఒకటి.
మానవ రూపంలో వున్న క్రూరమృగాలు, వారికి అండగా నిలిచిన రాజ్య యంత్రాంగంతో తలపడడం అంత సులభం కాదు. వారికి శిక్షలు పడే వరకు బానో సాహసోపేతంగా పోరాడింది. ఆ శిక్షలకు విలువ లేకుండా చేయడానికి బిజెపి పాలన లోని కేంద్ర, గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వాలు బరితెగించాయి. యావజ్జీవ శిక్ష పడిన నిందితులు 14 సంవత్సరాల పాటు జైలు జీవితం గడిపిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తనకున్న విచక్షణాధికారాన్ని ఉపయోగించి వారి శిక్ష తగ్గించి విడుదల చేయవచ్చు అనే '1992 మినహాయింపు విధానాన్ని' దారుణంగా దుర్వినియోగం చేసింది. మినహాయింపు పేరుతో నిందితులను అక్రమంగా విడుదల చేస్తున్నారని ఈ కేంద్ర ప్రభుత్వమే 2014లో సవరించిన చట్టాన్ని కూడా ధిక్కరించింది.
మహిళలపై పాశవికంగా దాడులు, అత్యాచారాలు చేయడం, ఇలా విడుదల కావడాన్ని ఏదో ఒక సాధారణ సంఘటనగా చూడలేము. దీని వెనుక మతోన్మాద భావజాలం, దాన్ని అమలు చేసే భవిష్యత్ ప్రణాళిక వుంది. ఈ దోషుల విడుదలకు కొద్ది రోజుల ముందు 'మనుస్మృతి వల్లే మహిళలకు రక్షణ' అని ఢిల్లీ లోని మహిళా న్యాయమూర్తి ఒకరు చెప్పారు. - బానో కేసు లోని నిందితులు బ్రాహ్మణులు. వారు సహజంగా ఉన్నత శ్రేణి వారు, వారు సత్ప్రవర్తన కలిగిన వారు. అందుకే వారి విడుదలకు బిజెపి ప్రభుత్వం ఆమోదం తెలిపింది- అని గోద్రా బిజెపి ఎమ్మెల్యే సి.కె. రౌల్జీ ప్రకటించారు. ఈ రెండు ప్రకటనలు కూడా మనుస్మృతిని బలపరచి అమలు చేయడంలో భాగమే. ''బ్రాహ్మణుడు కేవలం బ్రాహ్మణ కులంలో పుట్టిన కారణంగానే ధర్మ నిర్ణయం చేయగలడు'' (మనుస్మృతి 8.20), ''హీన జాతి పురుషుడు ఉన్నత స్త్రీని తనను వలచినదాననైనను మోహమున పొందునో వానికి 'లింగ చ్ఛేదము, వధయును' దండమునకు అర్హుడు, ఒకవైళ బ్రాహ్మణుడు దిగువ జాతి స్త్రీని మోహించినచో అది పుణ్యకార్యమగును'' (మనుస్మృతి 8.366). ఈ ఉన్మాదం తలకెక్కిన వారు ఎలా ప్రవర్తిస్తారనడానికి గుజరాత్ పరిణామాలు దర్పణం పడుతున్నాయి.
ఇటాలియన్ తత్వవేత్త అంబర్టో ఎకో ఫాసిజం లక్షణాలను వివరిస్తూ 'తమకు నచ్చని స్త్రీలను చిన్నచూపు చూసేలా ప్రచారం చేయడం, వారిని హింసించడం, లైంగికంగా వేధించడం కూడా' ఒక ముఖ్యమైన లక్షణమన్నారు. స్వాతంత్య్ర దినోత్సవాలకు వారం ముందు ఉత్తరప్రదేశ్ లోని ఆజంగఢ్ లోని మహరాజ్ గంజ్ గ్రామంలో పిల్లవాని పుట్టినరోజు జరుపుకుంటున్న ఆరుగురు దళిత క్రైస్తవ మహిళలు మత మార్పిళ్లకు పాల్పడుతున్నారని విశ్వహిందూ పరిషత్తుకు చెందిన స్థానిక నాయకుడు అశుతోష్ సింగ్ ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. కర్నాటకలో హిజాబ్ పేరుతో జరిగిన దౌర్జన్యాలు, ప్రతిష్టాత్మక కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో విద్యార్థినులపై జరిగిన భౌతిక దాడులు, సోషల్ మీడియాలో కనీస ఇంగితం లేకుండా మహిళలపై జరుగుతున్న మానసిక దాడులు చూస్తున్నాం. ఇవి ముస్లిం మహిళలకే పరిమితం కాదు. అన్నమయ్య కీర్తన వీడియో తీసిన గాయని శ్రావణ భార్గవిపై ఈ బుద్ధిహీనులు చేసిన మానసిక దాడి కారణంగా వీడియోను తొలగించి 'నేను బ్రాహ్మణ స్త్రీని' అని చెప్పుకోవలసి వచ్చింది. బానో కేసుపై స్పందించిన తెలంగాణకు చెందిన ఐఎఎస్ అధికారిణి స్మితా సభర్వాల్‌పై నేడు జరుగుతున్న ట్రోల్స్ సంగతి సరేసరి. ఇలా ఒకరిద్దరు కాదు. అనేక మంది మహిళలు ఈ ఉన్మాదుల దాడులకు గురవుతున్నారు.
'న్యాయస్థానం మీద ప్రజలు విశ్వాసం కోల్పోతే సమాజం చాలా ప్రమాదంలో పడుతుంది' అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇటీవల అన్న మాటలు ఎంతో విలువైనవి. ప్రజలకు న్యాయస్థానం మీద విశ్వాసం కలగాలంటే బిల్కిస్ బానో కేసులో నిందితులను తిరిగి జైలుకు పంపడం, బాధితులకు రక్షణ కల్పించడం అత్యవసరం. అయితే ఈ కాలంలో న్యాయస్థానాలు, రాజ్యాంగబద్ధ సంస్థలు పాలకుల నుండి తీవ్ర ఒత్తిళ్ళకు లోనవుతున్నాయి. ఇలాంటి స్థితిలో ప్రజల హక్కులకు, మహిళల రక్షణకు ప్రజా చైతన్యమే అండ. ప్రజాస్వామికవాదుల గొంతులను ఎంతగా అణచివేస్తున్నా...ఈ ఉన్మాద విధానాలనవి పదేపదే ప్రశ్నించాల్సిందే. మార్పు వైపు సమాజాన్ని నడిపించాల్సిందే.
బి.రాంభూపాల్
/వ్యాసకర్త : సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు/