Aug 25,2022 06:38
  • కార్మికుల హక్కుల్లో పని గంటలు, వారాంతపు సెలవులు, పండగ సెలవులు, లీవులు, భద్రత, ఆరోగ్య సౌకర్యాలు ప్రధానమైనవి. ఇప్పటికే ఈ హక్కుల అమలు అరకొరగా వుంది. యూనియన్లు లేనిచోట కార్మికులు వీటిని అమలు చేయించుకోలేక పోతున్నారు. ఇటువంటి సమయంలో లేబర్‌కోడ్‌ల లోని వీటికి సంబంధించిన అన్ని రూల్స్‌ను లేదా కొన్ని నిబంధనలను నిలిపివేసే అధికారం...కోడ్‌ల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చింది. కొత్తగా స్థాపించే పరిశ్రమల్లో వీటిని తాము అనుకున్నన్ని సంవత్సరాలు నిలిపివేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. దీన్ని బట్టి భవిష్యత్తులో ఏం జరగబోతుందో సులభంగానే అర్థంచేసుకోవచ్చు.

మోడీ ప్రభుత్వం పార్లమెంట్‌లో పాస్‌ చేసిన లేబర్‌కోడ్లను రద్దు చేయాలని కార్మిక సంఘాలు గత రెండు సంవత్సరాల నుండి డిమాండ్‌ చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కార్మిక సంఘాలతో నిర్వహించిన సమావేశాల్లో కార్మిక వ్యతిరేక అంశాలను తొలగించమని కోరినా లెక్క చేయకుండా వాటి అమలు కోసం ముందుకు పోతున్నది. ఆగస్టు 25, 26 తేదీల్లో తిరుపతిలో రాష్ట్రాల కార్మిక మంత్రులు, లేబర్‌ కమిషనర్లతో మోడీ ప్రభుత్వం లేబర్‌కోడ్ల అమలును వేగవంతం చేసేందుకు సమావేశం నిర్వహిస్తున్నది. ప్రధాని మోడీ ఈ సమావేశాన్ని ప్రారంభిస్తున్నారు. సబ్‌కా సాత్‌, సబ్‌కా వికాస్‌ (అందరితో ఉంటాం, అందరి అభివృద్ధి కోసం పనిచేస్తాం) అని నినాదం ఇచ్చే మోడీ ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా, కార్పొరేట్‌ కంపెనీలకు, యజమానులకు అనుకూలంగా తయారైన లేబర్‌ కోడ్లను అమలు చేయించాలని తహతహ లాడుతోంది. ఈ సమావేశం సందర్భంగా కార్మిక సంఘాలు తమ నిరసనను తెలియజేయాలని నిర్ణయించాయి. నిరసనను ఎప్పటిలాగానే సహించలేని రాష్ట్రంలోని జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం కార్మిక సంఘాల నాయకులకు, కార్యకర్తలకు పోలీసుల చేత నోటీసులు జారీ చేయించింది. కార్మిక వ్యతిరేక మోడీ ప్రభుత్వ విధానాలను అమలు చేయడంలో వైసీపీ ప్రభుత్వం ముందంజలో ఉంది.
సరళీకరణ, ప్రైవేటీకరణ విధానాల్లో భాగంగానే ఇంతకు ముందటి ప్రభుత్వాలు అమలు చేయలేని కార్మిక వ్యతిరేక సంస్కరణలను మోడీ ప్రభుత్వం పట్టుబట్టి అమలు చేస్తున్నది. పెద్ద సంఖ్యలో ఉన్న చట్టాలను కుదించి సంక్షిప్తం చేయడం వలన వాటిని అర్ధం చేసుకోవడం మరియు అమలు చేయడం తేలికవుతుందని దుష్ప్రచారం చేస్తున్నది. కార్మిక హక్కులు యథాతథంగా ఉంటాయని, కార్మిక చట్టాలను అంతకు ముందులాగా కాకుండా కార్మికులందరికీ అమలు చేయబోతున్నామని నమ్మబలుకుతోంది.
కార్మికులకు వేతనాలు, ఉమ్మడి బేరసారాలు, సమ్మె హక్కులు, పని పరిస్థితులు, సామాజిక భద్రతకు సంబంధించిన సమస్యలు ప్రధానంగా ఉన్నాయి. వీటిని పరిష్కరించకుండా, ఈ హక్కుల అమలును మోడీ ప్రభుత్వం యజమానులకు అనుకూలంగా మరింత జఠిలం చేస్తున్నది. 'శ్రమయేవ జయతే' (శ్రమయే జయిస్తుంది) పేరుతో కార్మికులను మోసం చేయాలని సంకల్పించింది. ఈ సందర్భంగా మోడీ ప్రభుత్వం పాస్‌ చేసిన లేబర్‌ కోడ్లలో కార్మికులకు వ్యతిరేకంగా ఉన్న ప్రధాన అంశాలను గుర్తించాలి.
కార్మికులకు చేసిన పనికి ఇచ్చే వేతనాలు ప్రధానం. కార్మికుల కనీస వేతనాలు-జాతీయ కనీస వేతనం (నేషనల్‌ ఫ్లోర్‌ వేజ్‌) ఆధారంగా నిర్ణయించబడతాయి. ఈ జాతీయ కనీస వేతనాన్ని 2019లో మోడీ ప్రభుత్వం అతి తక్కువగా రోజుకు రూ.178 నిర్ణయించింది. పైగా ఈ వేతనం కంటే తక్కువగా కనీస వేతనాలు ఉండకూడదని కోడ్‌లో చేర్చింది. మోడీ ప్రభుత్వం వేతనాలకు సంబంధించిన నిబంధనలలో కనీస వేతనం ఎలా నిర్ణయించాలనేది రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలేసింది. జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం కనీస వేతనాల నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించే జాతీయ కనీస వేతనాన్ని ఆధారంగా తీసుకుంటామని రూల్స్‌లో చేర్చింది. దీనితో రాబోయే రోజుల్లో కార్మికుల వేతనాలు మరింత దిగజారనున్నాయి. అదే సమయంలో కేరళ లోని వామపక్ష ప్రభుత్వం కనీస వేతనాన్ని 15వ భారత కార్మిక మహాసభ సిఫార్సులు, సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా నిర్ణయిస్తామని తమ రాష్ట్ర వేతన కోడ్‌ రూల్స్‌లో చేర్చింది.
వేతనాలు మరింతగా దిగజారిపోతే కార్మికులకు వచ్చే బోనస్‌లు, పి.ఎఫ్‌ లాంటి బెనిఫిట్లు కూడా తగ్గిపోతాయి. లేబర్‌ కోడ్లు కార్మికులందరికీ అమలు చేయటానికిగాను వాటి అమలును సార్వత్రికం చేశామని మోడీ ప్రభుత్వం చెప్పింది. కానీ ఆచరణలో కోడ్‌లో బోనస్‌ అర్హతకు మరియు ఇతర హక్కులను పొందడానికి అదివరకు ఉన్న పరిమితులను యథాతథంగా కొనసాగిస్తున్నది.
కార్మికులు తమ వేతనాలను, ఇతర బెనిఫిట్లను సమ్మె హక్కు ద్వారా సాధించుకునే అవకాశం ఉండేది. కానీ సమ్మె చేయడానికి లేబర్‌కోడ్లు అనేక పరిమితులు విధించాయి. నోటీసులివ్వకుండా సమ్మె చేసే హక్కు కోల్పోవడమే కాకుండా లేబర్‌ అధికారులు సమ్మె నోటీసు ఆధారంగా కన్సిలియేషన్‌ (మధ్యవర్తిత్వం) సమావేశం నిర్వహించడం మొదలు పెట్టగానే కార్మికులు సమ్మెకు వెళ్లే హక్కును కోల్పోతారు. లేబర్‌ అధికారులు యజమానులకు అనుకూలంగా కన్సిలియేషన్‌ సమావేశాలను పదే పదే వాయిదా వేస్తూ వాటిని సజీవంగా ఉంచుతారు.
కార్మికుల తొలగింపులు, ఓవర్‌టైమ్‌, మూసివేతలు మరియు లే-ఆఫ్‌లను పారిశ్రామిక సంబంధాల కోడ్‌ సులభతరం చేసింది. అంతకు ముందు 100 అంతకంటే ఎక్కువ కార్మికులు కలిగిన యజమానులు మాత్రమే ఈ పనికి ప్రభుత్వం నుండి ముందస్తు అనుమతి తీసుకోవాలి. కానీ లేబర్‌కోడ్‌లో 100 ను 300 కు పెంచారు. 300 లోపు కార్మికులు ఉండే పరిశ్రమలు, సంస్థలే ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. వీటిలో దాదాపు 80 శాతం మందికి పైగా కార్మికులు పనిచేస్తారు. కార్మికుల ఉద్యోగ భద్రతకు ప్రమాదం వచ్చింది. 300 లకే పరిమితం కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం నోటిఫికేషన్‌ ద్వారా కార్మికుల సంఖ్యను ఎంతకైనా పెంచే అధికారాన్ని కోడ్లు ఇచ్చాయి. దీని వలన హైర్‌ అండ్‌ ఫైర్‌ (పనిలో పెట్టుకోవడం, పనిలో నుండి తీసివేయడం) పద్ధతి అమల్లోకి వస్తుంది.
పారిశ్రామిక సంబంధాల్లో తీవ్రంగా మార్పులు తెచ్చే విధంగా ఫిక్స్‌డ్‌ టర్మ్‌ ఎంప్లాయిమెంట్‌ (నిర్ధారిత కాల ఉద్యోగాలు)ను కోడ్‌లలో ప్రవేశపెట్టారు. పర్మినెంట్‌ కార్మికులుగా ఉన్నప్పటికీ ప్రస్తుతం తమ హక్కులపై నోరెత్తి మాట్లాడలేని పరిస్థితులు ఉన్నాయి. ఫిక్స్‌డ్‌ టర్మ్‌ ఎంప్లాయిమెంట్‌ వలన ఒక సంవత్సరానికో, రెండు సంవత్సరాలకో నియమించబడిన కార్మికులు మాట్లాడలేని పరిస్థితులు మరింత తీవ్రమవుతాయి. యజమానులు తమను మరలా నియమించుకోవాలంటే మాట్లాడకుండా ఉంటే మంచిదని కార్మికులు కూడా భావిస్తారు. తమ పొట్ట కూటి కోసం కార్మికులు పడుతున్న బాధలను మోడీ ప్రభుత్వం ఉపయోగించుకుని ఈ అన్యాయానికి పూనుకుంది.
కార్మికుల హక్కుల్లో ముఖ్యమైనవి పని గంటలు, వారాంతపు సెలవులు, పండగ సెలవులు, లీవులు, భద్రత, ఆరోగ్య సౌకర్యాలు ప్రధానమైనవి. ఇప్పటికే ఈ హక్కుల అమలు అరకొరగా వుంది. యూనియన్లు లేనిచోట కార్మికులు వీటిని అమలు చేయించుకోలేక పోతున్నారు. ఇటువంటి సమయంలో లేబర్‌కోడ్‌ల లోని వీటికి సంబంధించిన అన్ని రూల్స్‌ను లేదా కొన్ని నిబంధనలను నిలిపివేసే అధికారం కోడ్‌ల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చింది. కొత్తగా స్థాపించే పరిశ్రమల్లో వీటిని తాము అనుకున్నన్ని సంవత్సరాలు నిలిపివేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. దీన్ని బట్టి భవిష్యత్తులో ఏం జరగబోతున్నదో సులభంగానే అర్థంచేసుకోవచ్చు.
కార్మిక హక్కుల్లో మరో ముఖ్యమైనది సామాజిక భద్రత. వీటిల్లో ముఖ్యంగా పి.ఎఫ్‌, ఇఎస్‌ఐ సౌకర్యాలు ఉన్నాయి. ఇపిఎఫ్‌, ఇపిఎస్‌, ఇడిఎల్‌ఐ, ఇఎస్‌ఐ స్కీమ్‌లను మోడీ ప్రభుత్వం పార్లమెంట్‌కు వెళ్ళకుండానే కేవలం నోటిఫికేషన్‌ ద్వారా మార్చివేసే అధికారం సామాజిక భద్రత కోడ్‌ ఇచ్చింది. పెన్షన్‌ వంటి పదవీ విరమణ సదుపాయాల్లో ప్రభుత్వాలు సంస్కరణలు అమలు చేసి కార్మిక వ్యతిరేక విధానాలు అమలు చేయడం మనం చూస్తున్నాం. పెన్షన్‌ ఫండ్స్‌, మెడికల్‌ ఇన్సూరెన్స్‌లలో ప్రవేశించే విదేశీ పెట్టుబడుల కోసం ఇ.పి.ఎఫ్‌, ఇ.ఎస్‌.ఐ పథకాలను వాటికి అనుకూలంగా మార్చే అధికారం కేంద్ర ప్రభుత్వానికి వచ్చింది.
అందుకనే లేబర్‌కోడ్లపై దేశవ్యాప్తంగా ఆందోళనలు తలెత్తుతున్నాయి. కార్మికుల వ్యతిరేకతను లెక్కచేయకుండా మోడీ ప్రభుత్వం వాటి అమలు కోసం ముందుకు వెళ్ళడానికే నిర్ణయించుకుంది. తిరుపతిలో జరుగుతున్న ఈ సమావేశం సందర్భంగా నిరసన తెలియజేయడం న్యాయ సమ్మతం. రాజ్యాంగ హక్కు అయిన నిరసనను కాలరాయడం రాజ్యాంగ వ్యతిరేకం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకటి గుర్తుంచుకోవాలి. బ్రిటీష్‌ పరిపాలన కాలంలో కార్మిక చట్టాలు లేక ముందే కార్మికులు పెద్ద ఎత్తున పోరాడి బ్రిటీష్‌ ప్రభుత్వాన్ని గడగడలాడించారు. అటువంటిది కార్మిక చట్టాల్లో కార్మిక వ్యతిరేక మార్పులు చేసినంత మాత్రాన కార్మికోద్యమం ఆగిపోదు. కేంద్రంలోని నరేంద్ర మోడీ, రాష్ట్రంలోని జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం అలా అనుకుంటే అది పెద్ద తప్పిదమవుతుందని రుజువౌతుంది.
/ వ్యాసకర్త : సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు /