ఆరోగ్యం మానవ హక్కుల్లో ఒకటి. జీవించే హక్కు అంటే ఆరోగ్యంగా జీవించడం అని అర్ధం. మానవ హక్కులను కాపాడే బాధ్యత ప్రభుత్వాలదే. కాని, కరోనా వచ్చాక ప్రజలను కాపాడే బాధ్యతను పక్కనబెట్టి కార్పొరేట్లను కాపాడే పనిలో కేంద్రమూ, అత్యధిక రాష్ట్రాలూ పడ్డాయి. ఒక్క కేరళ మాత్రం దీనికి మినహాయింపు. ఇంతలా కార్పొరేట్ల సేవలో మునిగిపోయినా ఫలితం వచ్చిందా అంటే అదీ లేదు. ఈ జూన్ త్రైమాసాంతానికి భారత స్థూల జాతీయోత్పత్తి (జిడిపి) ఏకంగా 23.9 శాతం పడిపోయిందని కేంద్ర గణాంకాల సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఇంత భారీగా జిడిపి పతనం కావడం ఏ ఇతర పెద్ద ఆర్థిక వ్యవస్థ లోనూ లేదు. కరోనాను కట్టడి చేయడమే గాక, ఈ ఏడాది రెండో త్రైమాసాంతానికి చైనా 3.2 శాతం వృద్థి రేటు సాధించింది. మూడు నెలల్లోనే కరోనాను కట్టడి చేయగలగడంతో ప్రజలతో ముమ్మరంగా ఉత్పత్తి కార్యకలాపాల్లో నిమగం కాగలిగారు. వారి వినిమయం పెరగడంతో సరుకులకు డిమాండ్ పెరిగి ఆర్థిక వ్యవస్థ పుంజుకుంది. అంటే కరోనాను కట్టడి చేస్తే ఆర్థిక వృద్థి సాధ్యపడుతుంది తప్ప ప్రజలను గాలికొదిలేస్తే ఆర్థిక పరిస్థితి అథోగతే అవుతుంది. క్యూబా, వియత్నాం వంటి సోషలిస్టు దేశాలతోబాటు న్యూజిలాండ్ కూడా కరోనా ను కట్టడి చేస్తేనే ఆర్థిక వృద్ధి అని గుర్తించి ఆ దిశగా నడుస్తోంది. కాని, అందుకు భిన్నంగా అమెరికా, బ్రిటన్, స్వీడన్ వంటి దేశాల్లో ప్రభుత్వాలు ప్రజారోగ్యాన్ని గాలికొదిలేశాయి. అక్కడ అటు కోవిడ్ అదుపు కాలేదు, ఇటు ఆర్థిక వ్యవస్థ పుంజుకోలేదు సరికదా మరింత క్షీణిస్తోంది. పాశ్చాత్య దేశాల వినాశకర మార్గంలోనే నరేంద్ర మోడీ సర్కారు పయనించడం దేశ ప్రజలకు అత్యంత ప్రమాదకరం.
కేంద్ర ప్రభుత్వం వలస కార్మికుల వెతలను పట్టించుకోకుండా అమానవీయంగా వ్యవహరించింది. ఆ తర్వాత 'ఆత్మ నిర్భర భారత్' అని రూ.21 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించినా దాంతో ప్రజలకు ఒరిగిందేమీ లేదు. ఆ ప్యాకేజీలో సింహభాగం కార్పొరేట్లకే ఉపయోగపడింది. 'పి.ఎం కేర్స్' కు ప్రజల నుండి విరాళంగా వచ్చినది ఎక్కువ, ఆ నిధి నుండి ప్రజలను ఆదుకోవడానికి చేసిన ఖర్చు తక్కువ. వామపక్షాలు, అనేక ప్రజా సంఘాలు లేవనెత్తిన డిమాండ్లలో ఏ ఒక్కటీ అమలు చేయలేదు. ఈ పరిస్థితుల్లో ప్రజలు చేసే ఖర్చు రాను రాను తగ్గిపోతుంది. దాంతో సరుకుల డిమాండ్ తగ్గిపోతుంది. కమ్యూనిస్టులు, అనేకమంది మేధావులూ చెప్పిన ఈ మాటను సంపన్నుల సంస్థ అయిన 'ఫిక్కీ' కూడా తాజాగా ముందుకు తేవడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా వాస్తవాలు గుర్తించాలి. ప్రజారోగ్యం కాపాడడం ప్రథమ, ప్రధాన కర్తవ్యం అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుగా గుర్తించాలి. దానికనుగుణంగా చర్యలు చేపట్టాలి. కుటుంబానికి రూ.7,500 నగదు బదిలీ, మనిషికి పది కిలోల ఆహార ధాన్యాలను ఉచితంగా ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వాలకు నిధులను మంజూరు చేయడంతోపాటు జిఎస్‌టి తో సహా అన్ని బకాయిలను విడుదల చేయాలి.
కోవిడ్‌ను అదుపు చేయడం, ప్రజలను ఆదుకునే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పరిస్థితి తీవ్రతకు ఏమాత్రం చాలదు. రోజుకు సుమారు పది వేల పాజిటివ్ కేసులు నమోదు కావడం, వంద మంది వరకూ ప్రాణాలు కోల్పోవడం రాష్ట్రంలో వ్యాధి విజృంభణకు నిదర్శనం. పేదలకు ఉచిత రేషన్ సరఫరా, మే నెల చివరి నుండి టెస్టుల సంఖ్య పెంచడం వంటివి తప్ప ప్రభుత్వం అంత పటిష్ట చర్యలేమీ తీసుకోలేదు. హోం ఐసొలేషన్‌లో వున్న కోవిడ్ బాధితులకు సర్కారు ద్వారా అందవలసిన వైద్య సేవలు అందడంలేదని సాక్షాత్తూ వైద్య ఆరోగ్య శాఖ తాజాగా నిర్వహించిన సర్వే లోనే తేటతెల్లమైంది. ఇప్పటికైనా ప్రభుత్వం కదలాలి. అందుబాటులో వున్న స్టేడియంలు, ఫంక్షన్ హాళ్ల వంటి వాటిని కోవిడ్ కేంద్రాలుగా మార్చి బాధితులకు వైద్య సేవలందించాలి. అవసరమైనన్ని ప్రైవేటు ఆసుపత్రులను టేక్ ఓవర్ చేసుకొని ప్రభుత్వ ఖర్చుతో ప్రజలకు వైద్యాన్ని అందించాలి. కార్పొరేట్ ఆసుపత్రుల నిలువు దోపిడిని అరికట్టాలి. ప్రైవేటు వైద్యులు, ఆర్‌ఎంపి ల సేవలను వినియోగించుకోవడంతో పాటు స్వచ్ఛంద సేవకులనూ ఈ కృషిలో భాగస్వాములను చేయాలి. టెస్టు ఫలితాలను త్వరితంగా ఇచ్చి, కాంటాక్టులను గుర్తించి వైరస్ విస్తరణను అరికట్టాలి. గతంలో కంటెయిన్‌మెంట్ జోన్‌లలో అయినా ముమ్మరమైన శానిటేషన్ చర్యలు చేపట్టేవారు ఇప్పుడు అది కూడా లేదు. కోవిడ్ యేతర వ్యాధులకు వైద్యం అందని దుస్థితి నెలకొంది. సీజనల్ వ్యాధులు వ్యాపించే ఈ తరుణంలో ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టాలి. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు వైద్యశాలల్లో రోగులకు సేవలందేలా చూడడం సర్కారు బాధ్యత. ఆ దిశగా చర్యలు చేపట్టాలి. 'ఆరోగ్యం మన హక్కు' అన్న నినాదంతో ఉద్యమాలు రావాలి.










