- విలేఖరులను కరివేపాకులా చూస్తున్న నాయకులు
- జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఏప్రిల్ 5 ఛలో ఢిల్లీ జయప్రదం చేయాలి...
- నాయకులు ఆకుల వెంకటనారాయణ
ప్రజాశక్తి-నందిగామ : జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ఏప్రిల్ 5 ఛలో ఢిల్లీ కార్యక్రమం జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ (ఎపిడబ్ల్యుజెఎఫ్) నాయకులు ఆకుల వెంకటనారాయణ పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న జర్నలిస్టుల సమస్యల పరిష్కారించాలని కోరుతూ ఎపిడబ్ల్యుజెఎఫ్ ఆధ్వర్యంలో శుక్రవారం నందిగామ ఆర్డిఓ కార్యాలయం వద్ద జర్నలిస్టులు ధర్నా చేశారు.
ఎపిడబ్ల్యుజెఎఫ్ నాయకులు ఆకుల వెంకటనారాయణ అధ్యక్షత వహించి మాట్లాడుతూ జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు లేక అద్దె ఇళ్ళలలో ఉంటూ అనేక ఆర్ధిక ఇబ్బందులకు గురౌతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారిన జర్నలిస్టుల తలరాతలు మారటం లేదన్నారు. నందిగామ ఎంఎల్ఎ తక్షణమే స్పందించి జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు, పట్టాలు, ఇళ్ళు నిర్మించుకోవటానికి ఇచ్చిన హమీ ప్రకారం ప్రతి ఒక్క జర్నలిస్టుల కుటుంబానికి లక్ష రూపాయలు ఆర్ధిక సాయం చేయాలని డిమాండ్ చేశారు. వేజ్ బోర్డు, మతీజియా కమీషన్ నిబంధనలు ప్రకారం జర్నలిస్టులకు కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని, రిటైర్డు జర్నలిస్టులకు కనీస పెన్సన్ రూ.10 వేలు ఇవ్వాలని కోరారు. హెల్త్ కార్డులు మంజూరు చేయాలని,జీవిత భీమా, ప్రమాధ భీమా అమలు చేయాలని కోరారు. అర్హులైన ప్రతి ఒక్క జర్నలిస్టుకు అక్రిడేషన్స్,బస్ పాస్ లు ఇవ్వాలని, పెండింగ్ అక్రిడేషన్స్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల గ్రామీణ విలేకరుల సంఘం జిల్లా కన్వీనర్ షేక్ లాల్ అహమ్మద్ గౌస్ మాట్లాడుతూ జర్నలిస్టులకు సంక్షేమ పధకాలు అమలు చేయకుండా అధికార, ప్రతిపక్ష పార్టీలు కుట్రపూరితంగా వ్యవహరిస్థున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. జర్నలిస్టుల సేవలను వాడుకుని వైసిపి, టిడిపి నాయకులు లబ్ధిపొందుతున్నారని పేర్కొన్నారు. ది న్యూ ఇండియా జర్నలిస్టుల వెల్ఫేర్ అసోసియేషన్ జాతీయ ఉపాధ్యక్షులు పఠాన్ మీరా హుస్సేన్ ఖాన్ మాట్లాడుతూ జర్నలిస్టులకు సంక్షేమ పధకాలు తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు, పట్టాలు ఇళ్ళు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్రామీణ విలేకరులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నా వైసిపి, టిడిపి నాయకులు పట్టించుకోవటం లేదని విమర్శించారు. జర్నలిస్టుల సంఘం నాయకులు శాఖమూరి మల్లి ఖార్జునరావు మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఎపిడబ్ల్యుజెఎఫ్ నాయకుల సేవలను కొనియాడారు. తక్షణమే ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలను పరిష్కారించాలని డిమాండ్ చేశారు. యూట్యూబ్ విలేకరుల సంఘం నాయకులు షేక్ షాబాన్ పాషా మాట్లాడుతూ నందిగామ జర్నలిస్టులను అధికార, ప్రతిపక్ష పార్టీలు కరివేపాకు వలే వినియోగించుకుంటున్నారని, కనీస తమకు కనీస గౌరవం కూడా ఇవ్వటం లేదన్నారు. జర్నలిస్టులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని దశాబ్ధాలుగా అడుగుతున్నా పట్టించుకునే నాధుడు లేరన్నారు. జర్నలిస్టుల ఆందోళనకు సంఘీభావం తెలిపిన సిపిఎం నందిగామ మండల కార్యదర్శి కటారపు గోపాల్, సిపీఎం నాయకులు సయ్యద్ ఖాసిం మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో నాల్గో స్థంభంగా ఉన్న జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.ఎపిడబ్ల్యుజెఎఫ్ నాయకులు, స్దానికి పత్రికల సంఘం రాష్ట్ర కోశాధికారి, సీమాంధ్ర కెరటం ఎడిటర్ వల్లూరి రవి శేఖర్ మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ పెద్థలు స్పందించాలని కోరారు. అనంతరం నందిగామ ఆర్డిఓ కార్యాలయం లో ఎఓకు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు నాయకులు ఘంటా విజయ్ కుమార్, ఏచురి శ్రీనివాసరావు, జర్నలిస్టు సింగంశెట్టి సత్యనారాయణ,ఎం శ్రీనివాసరావు, యూట్యూబ్ విలేకరుల సంఘం నాయకులు షేక్ మీరా, ఇక్బాల్, అమీద్,ప్రజా సంఘాల నాయకులు గోపి నాయిక్, కర్రి వెంకటేశ్వరరావు, హుస్సేన్, వేల్పుల ఏసోబు తదితరులు పాల్గొన్నారు.










